కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన తండ్రికి లీగల్ నోటీసులు పంపడం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. తన న్యాయవాది ద్వారా హీరో విజయ్ తన తండ్రిని లీగల్ నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది. మీరు తీసుకునే చర్యలకు విజయ్ మద్దతు ప్రకటించలేదని... మీరు స్థాపించిన పార్టీలో విజయ్ పేరు లేదా ఫొటో వాడకూడదని ఆ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం. ఈ నిబంధనలను ఉల్లంఘించినట్టయితే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని విజయ్ తరపు న్యాయవాది నోటీసుల్లో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. గతేడాది జూన్ నెల 8న అఖిల భారత దళపతి విజయ్ మక్కల్ ఇయ్యక్కం అనే పేరుతో చంద్రశేఖర్ ఓ రాజకీయ పార్టీని రిజిస్టర్ చేయించారు. అయితే తన తండ్రి రాజకీయ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయ్ గతంలోనే ప్రకటించారు. దీనిని ఖండిస్తూ విజయ్ అప్పుడే ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.
తమిళనాడులో మరికొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయ్ సొంత పార్టీతో బరిలోకి దిగుతారని.. ఇందుకోసమే ఆయన తండ్రి కొత్త పార్టీని రిజిష్టర్ చేశారనే వార్తలు వచ్చాయి. అయితే విజయ్ మాత్రం తన తండ్రి ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే క్లారిటీ ఇచ్చారు. అభిమానులెవరూ ఆయనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇందుకు సంబంధించి ఏదైనా ప్రకటన ఉంటే.. స్వయంగా తానే చేస్తానని విజయ్ వెల్లడించారు.
ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ ద్వారా పోటీ చేసేందుకు సీనియర్ హీరో కమల్ హాసన్ సిద్ధమయ్యారు. రజినీకాంత్ సైతం ఇందుకు ముందుకొచ్చినా.. ఆరోగ్య సహకరించకపోవడంతో రేసు నుంచి తప్పుకున్నారు. ఇందుకు అభిమానులు తనను క్షమించాలని కోరారు. మరోవైపు విజయ్ కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తారని వార్తలు వచ్చినా.. ఆయన నుంచి మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి సంకేతాలు రాలేదు.
Published by:Kishore Akkaladevi
First published:January 27, 2021, 17:28 IST