మర్కజ్ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారందరూ అలసత్వం ప్రదర్శించకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారి నుంచే అధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారు తమ కుటుంబ సభ్యులకు సైతం పరీక్షలు చేయించాలని కోరారు. ప్రభుత్వం ఓ వైపు చెబుతున్నా.. పట్టించుకోకుండా మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారు పట్టించుకోకపోవడం సరికాదన్నారు.
సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే అనేక కుటుంబాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని తెలిపారు. కరోనా వైరస్‌కు కులం, ప్రాంతం, మతం, వర్గం అన్న తేడా లేకుండా కబళిస్తుందని కిషన్ రెడ్డి హెచ్చరించారు. కరోనా మహమ్మారిపై కొంతమంది సామాజిక మాధ్యమాల్లో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నేతలు సైతం అనవసర విమర్శలు చేస్తున్నారని, దానికి ఇది సమయం కాదని వివరించారు. రాజకీయాలకతీతంగా సమస్త మానవాళి ఐక్యత కోసం అందరూ ఐక్యంగా పోరాడాల్సిన సమయమేర్పడిందని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kishan Reddy, Telangana, Union Home Ministry