హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Kiran Bedi: కిరణ్ బేడీకి ఉద్వాసన.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిసైకి అదనపు బాధ్యతలు

Kiran Bedi: కిరణ్ బేడీకి ఉద్వాసన.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిసైకి అదనపు బాధ్యతలు

కిరణ్ బేడీ (File)

కిరణ్ బేడీ (File)

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్‌కు అదనపు బాధ్యతలను అప్పగించింది.

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్‌కు అదనపు బాధ్యతలను అప్పగించింది. తమిళి సై సౌందర్ రాజన్ తెలంగాణ గవర్నర్‌గా ఉంటూ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తారు. 2016 మే 22న కిరణ్ బేడీని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్, డీఎంకే మిత్రపక్షం అక్కడ అధికారంలోకి వచ్చిన మూడు రోజులకు ఈ నియామకం జరిగింది. అంతకు ముందు ఆ పోస్టు దాదాపు రెండేళ్లు ఖాళీగా ఉంది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 15, డీఎంకే 2 సీట్లు గెలిచాయి. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కిరణ్ బేడీ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి వి. నారాయణస్వామితో ఆమెకు తీవ్ర విబేధాలు వచ్చాయి. ఓ దశలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి నారాయణస్వామి రాజ్ భవన్ ముందు ధర్నా కూడా చేశారు.

‘డాక్టర్ కిరణ్ బేడీని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తొలగిస్తూ ఆ బాధ్యతలను తాత్కాలికంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు అప్పగించారు. కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చే వరకు తమిళిసై సౌందర్ రాజన్ ప్రస్తుత విధులతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా విధులు నిర్వహిస్తారు.’ అని రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.

పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అక్కడ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. మరో ఇద్దరు తాజాగా రాజీనామా చేశారు. పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి, యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు కూడా రాజీనామా చేశారు. ఆయన కొన్ని రోజుల క్రితం మంత్రిపదవికి రాజీనామా చేసి దాన్ని ముఖ్యమంత్రి నారాయణస్వామికి పంపారు. కానీ, దాన్ని సీఎం ఆమోదించలేదు. ఈ రోజు మల్లాడి ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పుదుచ్చేరిలో పర్యటించే రోజే మల్లాడి రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, ఆయన ముందు నుంచే రాజకీయాల నుంచి సెలవు తీసుకుంటున్నారని ప్రకటిస్తున్నారు.

నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఈ సమయంలో కేంద్రం లెఫ్టినెంట్ గవర్నర్‌ను మార్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కిరణ్ బేడీ, నారాయణస్వామి మధ్య కొనసాగిన వైరం వల్ల మరోసారి కాంగ్రెస్ - డీఎంకే పార్టీలు లాభపడకుండా ఉండేందుకే కేంద్రం ఈ దిశగా అడుగులు వేసిందా అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. త్వరలో జరగబోయే తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికలతో పాటు పుదుచ్చేరికి కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో గవర్నర్ మార్పు సంచలనంగా మారింది. అదే సమయంలో తమిళనాడు రాజకీయాల మీద పట్టున్న తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించడం విశేషం.

First published:

Tags: Governor Tamilisai Soundararajan, Kiran Bedi, Puducherry, Tamilisai Soundararajan

ఉత్తమ కథలు