హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Khalistan Flags: అసెంబ్లీ గేటుకు ఖలిస్తాన్ జెండాలు కట్టిన దుండగులు.. ఇది ఉగ్రవాదుల హెచ్చరికా?

Khalistan Flags: అసెంబ్లీ గేటుకు ఖలిస్తాన్ జెండాలు కట్టిన దుండగులు.. ఇది ఉగ్రవాదుల హెచ్చరికా?

అసెంబ్లీ గేటుకు ఖలిస్తాన్ జెండాలు

అసెంబ్లీ గేటుకు ఖలిస్తాన్ జెండాలు

Khalistan Flags: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ భవనం ప్రధాన ద్వారానికి ఖలిస్తాన్ జెండాలు కట్టడాన్ని సీఎం జైరాం ఠాకూర్ తీవ్రంగా ఖండించారు. ఈ పని చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో తీవ్ర కలకలం రేగింది. ఏకంగా రాష్ట్ర అసెంబ్లీ భవనం గేటుకు గుర్తు తెలియని ఖలిస్తానీ జెండాలు (Khalistan Flags) కట్టడం సంచలనం రేపుతోంది. గేటుకు రెండు వైపులా పసుపు రంగు జెండాలు కనిపించాయి. దానిపై ఖలిస్తాన్ అరి రాసి ఉంది. అటు అసెంబ్లీ గోడలపై కూడా ఖలిస్తాన్ అని రాశారు. ఇవాళ ఉదయం ధర్మశాల (Dharmasala)లోని తపోవన్‌లో ఉన్న అసెంబ్లీ గేటుపై ఖలిస్తాన్ జెండాలను కొందరు స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని జెండాలను తొలగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు కట్టారు? ఎందుకు కట్టారన్నది తెలుసుకునేందుకు పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు. అసెంబ్లీ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

ఈ ఘటన అనంతరం హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ధర్మశాలతో పాటు రాష్ట్ర రాజధాని సిమ్లాలో భద్రతను పెంచారు. రెండు రోజుల క్రితం పక్క రాష్ట్రం హర్యానాలో కొందరు ఖలిస్తాన్ ఉగ్రవాదులు భారీ మొత్తంలో ఆయుధాలతో పట్టుబడ్డారు. పాకిస్తాన్ సరిహద్దు నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలను అందుకొని.. వాటిని పంజాబ్ నుంచి హర్యానా మీదుగా నాందేడ్, తెలంగాణలోని ఆదిలాబాద్‌కు తరలిస్తుండగా.. హర్యాణా పోలీసులు పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులను పట్టుకొని వారి నుంచి పెద్ద మొత్తంలో పేలుడ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఘటన జరిగిన మూడు రోజుల్లోనే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గేటుకు ఖలిస్తాన్ జెండాలు కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది.

ఇది పంజాబ్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌కు వచ్చిన టూరిస్టుల పని అయి ఉండవచ్చని కంగ్రా ఎస్పీ కుశాల్ శర్మ పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు. ప్రజలంతా సంయమనం పాటించాలని.. ఈ చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

అసెంబ్లీ గేటకు ఖలిస్తాన్ జెండాలు కట్టడాన్ని హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ (Jai Ram thakur) తీవ్రంగా ఖండించారు. ధర్మశాలలో ఉన్న అసెంబ్లీ భవనంలో కేవలం శీతాకాల సమావేశాలు మాత్రమే జరుగుతాయని ఆయన అన్నారు.

పొరుగు రాష్ట్రాల్లో టెర్రరిస్టు మాడ్యూల్స్‌ క్రియాశీలకంగా మారడం, భారీ ఆయుధాలతో పట్టుబడడం ఆందోళన కలిగిస్తోందని సీఎం ఠాకూర్ తెలిపారు. హిమాచల్‌లో కూడా ముందస్తు భద్రతకు సంబంధించి నిఘా పెంచామని.. రాష్ట్ర సరిహద్దులో అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లో ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని.. ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులను అరెస్టు చేయడం భద్రతా సంస్థల అప్రమత్తత ఫలితమేనని జైరామ్ ఠాకూర్ తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాల పట్ల.. రాష్ట్ర భద్రతా సంస్థలు, పోలీసులు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు.

First published:

Tags: Himachal Pradesh, Khalistan, Punjab, Terrorists

ఉత్తమ కథలు