హ్యాట్సాఫ్ సార్.. నిరుపేద విద్యార్థులకు ఇళ్లు కట్టిస్తున్న టీచర్

35 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న కేసీ రంజన్.. మార్చి 31న పదవీవిరమణ చేయబోతున్నారు. అంతకంటే ముందే పేద విద్యార్థులకు సాయం చేసి.. వారి కళ్లల్లో ఆనందం చూడాలని భావిస్తున్నారు. విశాల హృదయం గల కేసీ రంజన్ మాస్టారు ఎంతో మంది మనసులను గెలుచుకున్నారు.


Updated: February 14, 2020, 6:27 PM IST
హ్యాట్సాఫ్ సార్.. నిరుపేద విద్యార్థులకు ఇళ్లు కట్టిస్తున్న టీచర్
కేసీ రంజన్
  • Share this:
'పాఠాలు చెప్పామా.. పనయిపోయిందా..'

'స్కూల్ బెల్ కొట్టారా.. ఇంటికి వెళ్లిపోయామా..'

కొందరు టీచర్లు ఇలానే ఉంటారు. ఉదయం స్కూలుకు వచ్చి పాఠాలు చెప్పి.. మధ్యాహ్నం లంచ్ చేసి... సాయంత్రం తిరిగి వెళ్లిపోతారు. వాళ్ల పని అంత వరకే..! కానీ ఇంకొందరు ఉపాధ్యాయులుంటారు. విద్యార్థులకు కేవలం పాఠాలు చెప్పడమే కాదు.. వారి కష్ట నష్టాలను తెలుసుకొని ఆదుకుంటారు. ఉన్నంతలో సాయం చేసి.. ఉన్నత స్థానాలకు చేరేలా తీర్చిదిద్దుతారు. వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తుంటారు. అలాంటి కోవలోకే వస్తారు ఈ మాస్టారు. తమ పాఠశాలలో చదివే పేద విద్యార్థులను గుర్తించి.. వారి కుటుంబాలకు ఇళ్లు కట్టిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నేతలతో మాట్లాడి ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు.

ఈయన పేరు కేసీ రంజన్. కేరళలోని కన్నూరు జిల్లాలో ఓ ప్రభుత్వ స్కూళ్లో ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన కేరళ ప్రదేశ్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (KPSTA) లీడర్‌గానూ పనిచేచేస్తున్నారు. రంజన్ భార్య కూడా టీచరే..! ఐతే కొన్ని రోజుల క్రితం తన పాఠశాలలో చదివే ఓ విద్యార్థి స్కూల్ మానేశాడు. ఏం జరిగి ఉంటుందా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు రంజన్. అప్పుడే ఆ విద్యార్థి ఫ్యామిలీ ధీనగాథ ఆయనకు తెలిసింది. వీరికి ఉండడానికి ఇల్లు లేదు. గుడిసెలో జీవనం సాగిస్తున్నారు. ఆ బాలుడి తండ్రి కుటుంబాన్ని ఎప్పుడో వదిలేసి వెళ్లిపోయాడు. సోదరుడేమో దివ్యాంగుడు. ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది ఈ ఫ్యామిలీ. అందుకే స్కూల్ మానేసి ఇంట్లోనే తల్లికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు.ఆ పిల్లాడి పరిస్థితిని చూసి కేసీ రంజన్ చలించిపోయాడు. వారికి ఎలాగైన మంచి జీవితాన్ని ప్రసాదించాలని అప్పుడే డిసైడయ్యాడు. అలాంటి పిల్లలు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలుసుకొని.. వారి కులం, మతంతో సంబంధం లేకుండా ఓ జాబితా తయారు చేశాడు. KPSTA నిధులు, విరాళాలతో వారందరి ఆర్థికంగా ఆదుకుంటున్నాడు. రంజన్ చేస్తున్న ఈ మంచి కార్యక్రమాన్ని చూసి కన్నూరు ఎంపీ కే.సుదర్శనన్ కూడా ముందుకొచ్చాడు. తన వంతుకు ప్రతి పేద విద్యార్థికి రూ.లక్ష విరాళం ఇస్తానని ప్రకటించారు. KPSTA కూడా రూ.2లక్షలు ఇవ్వబోతోంది. ఫిబ్రవరి 24 జరిగే ఈ కార్యక్రమానికి కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ హాజరుకాబోతున్నారు.
కేసీ రంజన్ దంపతులు

ఇక కేసీ రంజన్ తన వంతుగా నాలుగు సెంట్ల భూమిని విరాళంగా ఇచ్చారు. వాటిని విద్యార్థుల తల్లి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు.. మరో 20 ఏళ్ల వరకు ఆ ప్లాట్స్‌ని ఎవరికీ అమ్మకుండా ఒప్పంద పత్రం రాయించుకున్నారు. ప్లాట్స్ ఇవ్వడమే గాక.. ఇల్లు కట్టుకునేందుకు అవసరమైన డబ్బులను కూడా KPSTA ద్వారా ఇవ్వబోతున్నారు.
టీచర్ జాబ్ అంటే కేవలం పాఠాలు చెప్పడం మాత్రమే కాదు. విద్యార్థుల కుటుంబ నేపథ్యంతో పాటు వారి కష్ట నష్టాలను తెలుసుకోవాలి. తరగతిలో ఉన్న విద్యార్థులంతా చూడ్డానికి సంతోషంగా కనిపించవచ్చు. కానీ ఒక మంచి ఉపాధ్యాయుడు మాత్రమే వారి గుండెల్లో దాచుకున్న కన్నీళ్లను అర్థం చేసుకోగలడు. అలా కష్టాల్లో ఉన్న విద్యార్థులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వారి చదువుకు పేదరికం అడ్డు కాకూడదు.
కేసీ రంజన్


35 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న కేసీ రంజన్.. మార్చి 31న పదవీవిరమణ చేయబోతున్నారు. అంతకంటే ముందే పేద విద్యార్థులకు సాయం చేసి.. వారి కళ్లల్లో ఆనందం చూడాలని భావిస్తున్నారు. విశాల హృదయం గల కేసీ రంజన్ మాస్టారు ఎంతో మంది మనసులను గెలుచుకున్నారు. కేసీ రంజన్ మంచి తనాన్ని చూసి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. హాట్సాఫ్ మాస్టారు.. అంటూ ఆకాశానికెత్తుతున్నారు. చాలా అరుదుగా ఉండే ఇలాంటి ఉపాధ్యాయులు.. నేటి సమాజంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు