news18-telugu
Updated: November 20, 2020, 11:45 AM IST
కరోనా పేరుతో ఉన్న షాపు(Image ANI)
కరోనా... ఈ పేరు వింటే చాలు చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఉలిక్కిపడుతున్నారు. గత ఎనిమిది నెలల నుంచి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ మహమ్మారి జనజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తూ తెచ్చిన నష్టం అంతా ఇంతా కాదు. దీని వల్ల ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, కోలుకోలేని దెబ్బతిన్నాయి. మరోవైపు కరోనా ధాటికి ఎంతోమంది తమ వారిని పోగొట్టుకున్నారు. దీంతో వారు తీరని శోకంలో మునిగిపోయారు. మళ్లీ సాధారణ పరిస్థితి రావడానికి ఎంత సమయం పడుతుందో అర్థం కావడం లేదు.
అయితే యావత్ ప్రపంచానికి ఇంతటి నష్టాన్ని మిగిల్చిన కరోనా.. కేరళకు చెందిన ఒకతనికి మాత్రం బాగా లాభాలను తెచ్చిపెడుతోంది. అందేంటని ఆశ్చర్యపోకండి. పూర్తి వివరాల్లోకి వెళ్తే కేరళలోని కొట్టాయమ్ జిల్లా కలతిప్పడిలో జార్జ్ అనే వ్యక్తి ‘కరోనా’ పేరుతో ఏడేళ్ల క్రితం ఇంటీరియర్ డెకరేటివ్ షాపు ప్రారంభించాడు. ఈ షాపులో మొక్కలు, కుండీలు, దీపాలు, ఇతర సామగ్రిని విక్రయిస్తూ ఉండేవాడు. సాధారణంగా కరోనా వైరస్‌కు ముందు ఈ షాపును ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు.. అయితే, కరోనా విజృంభన తర్వాత మాత్రం ఆ షాపుకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో జార్జ్ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది.
కరోనా అంటే ‘కిరీటం’..
దీనిపై జార్జ్ మాట్లాడుతూ " తన షాప్‌కు కరోనా పేరు ఉడటంతో కరోనా వైరస్ విజృంభన తర్వాత వినియోగదారుల తాకిడి గణనీయంగా పెరిగింది. ఈ కారణంగా వ్యాపారం వృద్ధి చెంది లాభాలు గడిస్తున్నాను. కరోనా అందరికీ చెడు చేస్తే నాకు మాత్రం మంచే చేసింది." అని షాపు యజమాని జార్జ్ చెప్పారు. తన షాపుకు కరోనా అని పేరు పెట్టడం వెనుక కూడా ఆసక్తికరమైన కారణం ఉందని జార్జ్ చెప్పుకొచ్చాడు. “ లాటిన్ భాషలో కరోనా అంటే కిరీటం అనే అర్థం వస్తుంది. ఈ పేరు తనను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో నా షాపుకు ఏడేళ్ల క్రితమే కరోనా అనే పేరు పెట్టుకున్నాను. కరోనా పేరు విస్తృతమవ్వడంతో ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి కూడా నా షాపుకు కస్టమర్లు వస్తున్నారు.’’ అని అన్నారు. అయితే, ఏడేళ్ల క్రితం తన చిన్న షాపుకు భవిష్యత్తులో ఇంతటి పేరు వస్తుందని, వినియోగదారులను ఆకర్షిస్తుందని ఊహించలేదు అంటున్నాడు జార్జ్.
Published by:
Kishore Akkaladevi
First published:
November 20, 2020, 11:44 AM IST