కేరళలోని ఇడుక్కి జిల్లాలో శుక్రవారం రాత్రి కొండ చరియలు విరిగిపడిన ఘటనాస్థలిలో మరో 15 మంది మృతదేహాలను రిస్క్యూ టీమ్స్ ఆది బయటకు తీశాయి. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరింది. రిస్క్యూ ఆపరేషన్‌లో జాగిలాల సాయంతో పలు మృతదేహాలను వెలికితీశారు. తవ్వినకొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. కేరళలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇడుక్కి జిల్లాలోని రాజమల ప్రాంతంలో కొండ ప్రాంతానికి అడుగున ఓ కాలనీలోని 37 గుడిసెల్లో టీ ఎస్టేట్‌లో పనిచేసే కార్మికులు దాదాపు 80 మంది నివాసముంటున్నారు. వారి నివాసాలపై కొండ చరియలు విరిగిపడటంతో పలువురు సజీవ సమాధి అయ్యారు. ఇప్పటి వరకు 42 మంది మృతదేహాలను వెలికితీయగా...మరో 30 మంచి ఆచూకీ కనిపించడం లేదు. వీరి కోసం దాదాపు ఆరు ఎన్డీఆర్ఎఫ్ దళాలు రిస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.
హాస్టల్‌లో ఉంటూ చదవుతూ వచ్చిన పలువురు విద్యార్థులు కరోనా కారణంగా ఇటీవల తమ ఇళ్లకు వెనుదిరిగారు. అనధికారిక వర్గాల సమాచారం మేరకు ఆచూకీ కనిపించకుండా పోయిన వారి సంఖ్య 50 వరకు ఉండొచ్చని చెబుతున్నారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇడుక్కి జిల్లా అధికార వర్గాల సమాచారం.
కేరళకు చెందిన కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వీ మురళీధరన్, విపక్ష నేత రమేష్ చెన్నితల తదితరులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఇడుక్కు సహా అలపుళ, మలప్పురం, కోళికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్‌గోడ్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందంటూ భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఇడుక్కిలో రిస్క్యూ ఆపరేషన్‌కు విఘాతం కలిగే అవకాశముందని భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kerala rains