కేరళ ప్రభుత్వం వరకట్నానికి వ్యతిరేకంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ ప్రభుత్వంలో పని చేస్తున్న పెళ్లికాని పురుష ఉద్యోగులు తాము వరకట్నాన్ని ప్రొత్సహించడం లేదా తీసుకోవడం చేయవద్దని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పెళ్లయిన నెల రోజుల్లో తాము పని చేస్తున్న విభాగం అధిపతులకు డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. ఈ డిక్లరేషన్లో భార్య సంతకంతో పాటు వధువు తండ్రి, వరుడి తండ్రి సంతకం ఉండాలని పేర్కొంది. మహిళ, శిశు సంక్షేమ శాఖ కొద్దిరోజుల క్రితం ఈ సర్క్యులర్ జారీ చేసింది.
ప్రభుత్వంతో పాటు ప్రైవేటు, అటానమస్, ఇతర సంస్థలకు సంబంధించిన విభాగాల అధిపతులు సైతం ఈ మేరకు డిక్లరేషన్లు తీసుకోవాలని సూచించింది. వివిధ శాఖలకు సంబంధించిన అధిపతులు ప్రతి ఏడాది ఏప్రిల్ 10, అక్టోబర్ 10కి ముందు ఇందుకు సంబంధించిన డిక్లరేషన్లను జిల్లా వరకట్న నిరోధక అధికారికి సమర్పించాలని సూచించింది.
దీంతో పాటు ఇకపై కేరళలో ప్రతి ఏడాది నవంబర్ 26 వరకట్న వ్యతిరేక దినోత్సవంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు స్కూల్, కాలేజీ, ఇతర విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు కట్నం తీసుకోబోమని ప్రతిజ్ఞ చేయాలని ప్రభుత్వం సూచించింది. గత నెలలో వరకట్నానికి వ్యతిరేకంగా విద్యార్థులందరూ తమ డిగ్రీ తీసుకోవడానికి ముందు బాండ్ ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ సూచించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.