పాకిస్థాన్‌తో వయనాడ్‌ను పోల్చుతారా ?... ఆయనకు కనీసం జ్ఞానం లేదన్న కేరళ ముఖ్యమంత్రి

కేరళ సీఎం పినరయి విజయన్(File)

స్వాతంత్ర్య సంగ్రామంలో ఎంతగానో పోరాడిన వయనాడ్ ప్రజలను అమిత్ షా అవమానిస్తున్నారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు.

  • Share this:
    కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ధ్వజమెత్తారు. అమిత్ షా వయనాడ్‌ను పాకిస్థాన్‌తో పోల్చడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్వాతంత్ర్య సంగ్రామంలో ఎంతగానో పోరాడిన వయనాడ్ ప్రజలను అమిత్ షా అవమానిస్తున్నారని ఆక్షేపించారు. ఎల్‌డీఎఫ్ ఫ్రంట్ తరపున అభ్యర్థి పీపీ సునీర్ తరపున ప్రచారం చేపట్టిన విజయన్... ఈ ప్రాంతం మొత్తాన్ని అమిత్ షా అవమానించారని ఆరోపించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ సమావేశం పాకిస్థాన్‌లో పెట్టినట్టు ఉందని అమిత్ షా అనడం దారుణమని వ్యాఖ్యానించారు.

    అసలు వయనాడ్ గురించి అమిత్ షాకు ఏం తెలుసు అని విజయన్ ప్రశ్నించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఇక్కడ ప్రజల పాత్ర ఏమిటో బీజేపీ అధ్యక్షుడికి తెలుసా అని మండిపడ్డారు. వయనాడ్‌కు చెందిన కురిచియా తెగ బ్రిటిష్ ఆర్మీకి వ్యతిరేకంగా పోరాడిన విషయం అందరికీ తెలుసు అని విజయన్ అన్నారు. వయనాడ్ గురించి తెలిస్తే... పాకిస్థాన్‌తో పోల్చి ఇక్కడ ప్రజలను ఆయన అవమానించేవారు కాదని అన్నారు. అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ... ఈ నెల 4న అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ, సునీర్‌తో పాటు బీజేపీ తరపున తుషార్ వెల్లపల్లి, ఇతర అభ్యర్థులు వయనాడ్ నుంచి బరిలో ఉన్నారు.
    First published: