ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో విచారణ ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha).. ఈడీ(ED)నే ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు పలు మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ఢిల్లీలో ఈడీ అధికారులు కవితను మార్చి 20 సోమవారం నాడు 11 గంటల పాటు ప్రశ్నించారు. పదకొండు గంటల్లో 14 ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది.
ఐతే.. ఈ కేసుకు సంబంధించి తనకు సంబంధం లేదంటూ మొదటి నుంచి వాదిస్తూ వస్తున్నారు కల్వకుంట్ల కవిత . తనపై ఆరోపణలకు సాక్ష్యాలేంటి.. తనను నిందితురాలిగా పిలిచారా.. అనుమానితురాలిగానా అంటూ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులనే ఎదురు ప్రశ్నించారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇది నిజమేనా.. కవిత ఈడీని ప్రశ్నించే అవకాశం ఉంటుందా అనేదే ఇపుడు జరుగుతున్న చర్చ.
Read Also : Kavitha: కవిత అరెస్ట్ అవుతుందా లేదా అని జోరుగా బెట్టింగ్! కోట్లు మారుతున్న చేతులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ కీలకం అనేది ఈడీ వాదన. ఇందులో పెద్ద ఎత్తున కవిత పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అధికారులు అంటున్నారు. అరెస్టైన వారి కేసు చార్జ్ షీట్ లోనూ కవిత పేరు చేర్చారు. గత నెల రోజులుగా కవితను మూడు సార్లు విచారించారు. కవిత పాత్రకు సంబంధించి పలు లీకులు కూడా బయటకు వచ్చాయి.
సోమవారం మార్చి20న సుదీర్ఘంగా విచారణ జరగడం.. ఆఖరుకు కవిత ఎప్పటిలాగే ఇంటికి వెళ్లడంపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హైప్రొఫైల్ కేసు కావడంతో.. లీగల్ గానూ కల్వకుంట్ల కవిత అదే స్థాయిలో ఫైట్ చేస్తున్నట్టు సమాచారం. ఢిల్లీలోనే ఉంటున్న కేటీఆర్ , హరీశ్ రావు అన్నీ దగ్గరుండి చూసుకుంటుండటం.. అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు లాంటి సీనియర్ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటూ.. ఈడీ అడుగుతున్న ప్రశ్నలకు బదులిస్తున్నట్టు చెబుతున్నారు.
ఈ కేసులో కవితకు స్ట్రాంగ్ లీగల్ సపోర్ట్ అందుతున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. పౌరులు, అనుమానితులు, నిందితులు, దోషులు.. ఎలా ఏ స్థాయిలో వాళ్లు దర్యాప్తు సంస్థల ప్రశ్నలను ఎలా ఎదుర్కోవచ్చు అనేది న్యాయ నిపుణులు వివరంగా చెప్పినట్టు తెలుస్తోంది.
ఓ అనుమానితురాలిని నిందితురాలిగా ఎలా చేర్చారని.. ఫోన్లు ధ్వంసం అయ్యాయంటూ లీకులెందుకు ఇచ్చారని ఈడీని కవిత అడిగినట్టు సమాచారం. ఏ ఫోన్ కూడా ధ్వంసం చేయలేదని కవిత సోమవారం తెలిపారని.. అవే ఫోన్లను మంగళవారం ఈడీ విచారణకు తీసుకొచ్చారని టాక్ నడుస్తోంది. సుజనా చౌదరి, నారాయణ రాణె, హిమంత బిశ్వవర్మ కేసుల్లో విచారణ ఎంతవరకు వచ్చిందని కవిత సోమవారం నాడు ఈడీ అధికారులను అడిగినట్టు కొన్ని టీవీల్లో వచ్చిన స్క్రోలింగ్ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi liquor Scam, Enforcement Directorate, Harish Rao, Kalvakuntla Kavitha, KTR