కశ్మీర్‌లో వెల్లివిరిసిన మతసామరస్యం.. కశ్మీరీ పండిట్ మహిళ‌ల ద‌హ‌న‌ సంస్కారాలు నిర్వహించిన ముస్లింలు..

కశ్మీరీ పండిట్‌ల అంత్యక్రియలు నిర్వహిస్తున్న ముస్లింలు

‘ఇలా కశ్మీరీ పండిట్స్ అంత్య‌క్రియ‌ల‌కు ముస్లింలు హాజ‌రుకావ‌డం, అందుకు కావాల్సిన ఏర్పాట్లను ముస్లింలు చూడ‌ట‌మ‌నేది మ‌నుషుల మ‌ధ్య సంబంధాలుగా చూడాలి. ఇది మ‌తాల‌ మ‌ధ్య బంధం కాదు. దీనికి మ‌తాల‌తో ఏం ప‌ని?’ అని ప్ర‌శ్నించాడు స్థానికుడు.

  • Share this:
కశ్మీర్ లోయ అంటే బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది తుపాకుల మోత‌లు, బాంబుదాడులు, ఉగ్ర‌వాదుల దాడులు, ఎన్‌కౌంట‌ర్లు మాత్రమే. ఇవ‌న్నీ దారిత‌ప్పిన‌వారు చేసే ప‌నులు. కానీ అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను అన్ని మతాల వారు గౌరవిస్తారు. మతంతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలకు విలువ ఇస్తారు. తాజాగా మ‌తాలు వేరైనా మాన‌వ‌త్వం ఒక్క‌టే అని చాటారు కొందరు కశ్మీర్ ముస్లింలు. ఇద్ద‌రు కశ్మీరీ పండిట్ మహిళ‌ల ద‌హ‌న‌ సంస్కారాల‌ను వారు పూర్తి చేసి.. సోద‌ర భావాన్ని చాటుకున్నారు. కశ్మీర్ గురించి ప్ర‌పంచానికి స‌రికొత్త సందేశాన్ని పంపారు. ఈ సంఘ‌ట‌న ద‌క్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో జ‌రిగింది.

కుల్గామ్‌లో నివ‌సించే బ‌ద‌రీనాథ్ అనే కశ్మీరీ పండిట్ భార్య చండీరాణీ (80), జాన‌కీనాథ్ అనే వ్యక్తి భార్య కుశాలీదేవి (83) అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో మృతి చెందారు. వీరు చ‌నిపోయిన విష‌యం తెలిసిన వెంట‌నే ఆ ప్రాంతంలో నివ‌సించే ముస్లిం స‌మాజం మొత్తం క‌దిలివ‌చ్చింది. శ్మ‌శాన‌ వాటిక‌లో చితిని పేర్చ‌డం నుంచి చివ‌రి నిమిషంలో చేయాల్సిన క్ర‌తువుల‌కు కావాల్సిన ఏర్పాట్ల‌న్నీ స్థానిక ముస్లింలే చేశారు.

ఈ విషయంపై ర‌మేశ్ కుమార్ అనే స్థానిక కశ్మీరీ పండిట్ మాట్లాడుతూ.. ‘కశ్మీరీ పండిట్స్‌, ముస్లింలు ఒకే నాణేనికి రెండు ముఖాల వంటివారు. ఈ బంధం అపురూప‌మైన‌ది. సోద‌ర‌భావం, మ‌త‌సామ‌ర‌స్యం ఎన్న‌టికీ చెరిగిపోనివి. కశ్మీర్‌లో ఇలాంటివి సాధారణం. ఇందుకు తాజా సంఘ‌ట‌నే ఉదాహ‌ర‌ణ’ అని చెప్పారు. మృతుల బంధువులే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించిన‌ప్ప‌టికీ.. అందుకు కావాల్సిన ఏర్పాట్ల‌ను స్థానిక ముస్లింలే దగ్గరుండి చూసుకున్నారు.

తమ మ‌ధ్య ఎప్ప‌డూ ఈ బంధం ఉంటుందని తెలిపారు మరో కశ్మీరీ పండిట్. ‘సోద‌ర‌భావం స‌హ‌జ‌మైనది. ఒకే ప్రాంతంలో నివ‌సించేవాళ్లం అందరం.. ఆచారాలు, సంప్ర‌దాయాల‌ను ప‌ర‌స్ప‌రం గౌర‌వించుకుంటాం. ఇది మాకెంతో సంతోష‌మైన విష‌య‌ం’ అని చెప్పారు. ‘ఇలా కశ్మీరీ పండిట్స్ అంత్య‌క్రియ‌ల‌కు ముస్లింలు హాజ‌రుకావ‌డం, అందుకు కావాల్సిన ఏర్పాట్లను ముస్లింలు చూడ‌ట‌మ‌నేది మ‌నుషుల మ‌ధ్య సంబంధాలుగా చూడాలి. ఇది మ‌తాల‌ మ‌ధ్య బంధం కాదు. దీనికి మ‌తాల‌తో ఏం ప‌ని?’ అని ప్ర‌శ్నించాడు మ‌రో స్థానికుడు.
Published by:Ashok Kumar Bonepalli
First published: