కర్ణాటక పాలిటిక్స్ హీట్. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఆడియో లీక్? యడ్యూరప్ప రాజీనామా చేస్తారా?

యడ్యూరప్ప రాజీనామా చేస్తారా? (File Image)

Karnataka BJP: కర్ణాటక రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక కలకలం రేగుతూనే ఉంటుంది. యడ్యూరప్ప త్వరలో రాజీనామా చేస్తారనే అంశం ఇప్పుడు కాక రేపుతోంది. ఆడియోలో ఏముంది?

  • Share this:
కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కాయి. తాజాగా హల్‌చల్ చేస్తున్న ఆడియో ఒకటి అధికార పార్టీ అయిన బీజేపీలో కలకలం సృష్టిస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ అయిన నలీన్ కుమార్ కతీల్... కర్ణాటకలో నాయకత్వ మార్పు గురించి సంకేతాలు ఇస్తున్నట్లు ఆడియో టేప్‌లో ఉంది. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేస్తారనే ఊహాగానాల నడుమ, తాజా ఆడియో పార్టీలో సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. కతీల్ తన మాతృభాష అయిన తులులో కొన్ని విషయాలు మాట్లాడినట్లు ఆ ఆడియో క్లిప్‌లో ఉంది. యడ్యూరప్ప త్వరలోనే ముఖ్యమంత్రి కుర్చీ దిగిపోతారనీ, కొత్త ముఖ్యమంత్రిని అధిష్టానం ఎంపిక చేస్తుందనీ అందులో ఉంది. మంత్రివర్గంలో ఉన్న సీనియర్ నాయకులైన కెఎస్ ఈశ్వరప్ప, జగదీష్ శెట్టర్‌ కూడా రాజీనామా చేస్తారని ఆయన చెప్పారు. అయితే సదరు ఆడియో నకిలీదని కతీల్ చెబుతున్నారు. దీనిపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు చెప్పడం గమనార్హం.

తాజా పరిణామంతో ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరత తార స్థాయికి చేరింది. దీంతో పాటు పార్టీ వర్గాల మధ్య మరింత దూరం పెరిగింది. రాజీనామా వార్తల మధ్య గత వారం ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఢిల్లీ వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర పార్టీ నాయకులను కలిసి వచ్చారు. తర్వాత తన పదవికి ఎలాంటి ముప్పూ లేదనీ... 78 ఏళ్ల యడ్యూరప్ప క్లారిటీగా చెప్పారు. తనను ఎవరూ రాజీనామా చేయమని కోరలేదని అన్నారు. అయితే ఆయనపై పార్టీలో వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం. ఈమధ్య వ్యతిరేక వర్గంలోని కొందరు నాయకులు ఈ విషయంపై అధిష్టానంతో చర్చించినట్లు వార్తలొచ్చాయి. జులై 26 నాటికి యెడ్డీ రెండేళ్ల పాలన పూర్తవుతుందనీ, ఆ తర్వాత ఆయన కుర్చీ దిగిపోతారని ఆ వర్గం వారు ప్రచారం చేశారు. ప్రస్తుత ఆడియో వారి వాదనలకు బలం చేకూరుస్తోంది. అయితే ఈ పరిణామాలపై బీజేపీ అధిష్టానం మాత్రం మౌనం వహిస్తోంది.

బలమైన మద్దతు:
శక్తివంతమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్పకు ఇప్పటికీ ప్రజాబలం ఉంది. మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయనకే మద్దతు పలుకుతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం మార్పు విషయం కష్టతరమైందని హైకమాండ్ భావిస్తోంది. పార్టీ, ప్రభుత్వంలో వ్యతిరేకత పెరిగిన ప్రతిసారీ, యెడ్డీ మాత్రం ప్రతికూలతలను అధిగమిస్తూ వస్తున్నారు. దీంతో తన వ్యక్తిగత పలుకుబడి, ప్రజాబలం ముందు వ్యతిరేకత ప్రభావం నామమాత్రమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ ఆడియోను కతీల్ తీవ్రంగా ఖండించినప్పటికీ, యెడ్డీ మద్దతుదారులు మాత్రం ఈ వాదనలపై ఇంకా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అసమ్మతి వాదులు మాత్రం ఇది నకిలీ ఆడియో కాదని వాదిస్తున్నారు. ఈ విషయంపై కతీల్ న్యూస్ 18తో మాట్లాడారు. అధికార పార్టీలో ఇబ్బందులను సృష్టించడానికి ఎవరో తన గొంతును మిమిక్రీ చేశారని చెప్పారు. ఆడియోలో ఉన్నది తన గొంతు కాదని, దీనిపై తక్షణ విచారణ చేయాలని కోరుతున్నానని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బీఎల్ సంతోష్, సీటీ రవి యడ్యూరప్పకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని యడ్యూరప్ప మద్దతుదారులు చెబుతున్నారు. వారే నాయకత్వ మార్పును కోరుకుంటున్నారని అనుమానిస్తున్నారు.

యడ్యూరప్పకు ప్రత్యామ్నాయంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, సీటీ రవి, బీఎల్ సంతోష్ పేర్లను అసమ్మతి వర్గం సూచిస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ముగ్గురు నాయకులు మాత్రం ఈ వాదనలను ఖండించారు. కానీ పార్టీ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని తెలిపారు. ఈ ఆడియో యడ్యూరప్పకు మేలు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను యెడ్డీ తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చని విశ్లేషిస్తున్నారు.

ఇది కూడా చదవండి: శ్మశానంలో లాటరీ... అద్దెకు ఆరడుగుల స్థలం... ఆరేళ్లకోసారి శవ మార్పిడి.. ఏ దేశంలో అంటే...

కర్ణాటకలో లింగాయత్‌లు రాజకీయంగా, ఆర్థికంగా అత్యంత శక్తివంతమైన వర్గం. అందువల్ల ఆ వర్గానికి చెందిన యడ్యూరప్పను తొలగించడం పార్టీ అధినాయకత్వానికి సులభమైన పని కాదు. ప్రస్తుతం యడ్డీకి బలమైన ప్రత్యామ్నాయంగా ఎవరూ లేరని లింగాయత్ నేతలు చెబుతున్నారు.
Published by:Krishna Kumar N
First published: