హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఐటీ కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ తీసేయండి.. ఎమ్మెల్యేల డిమాండ్, వారి లాజిక్ బాగుంది

ఐటీ కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ తీసేయండి.. ఎమ్మెల్యేల డిమాండ్, వారి లాజిక్ బాగుంది

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Work from Home: ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కొందరు ఉద్యోగులు ఆనందంగా ఉన్నారు. మరికొందరు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఇటీవల కొన్ని సంఘటనలను బట్టి చూస్తే అర్థం అవుతోంది.

  ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ అవకాశాలను కల్పించాయి. మార్చి, ఏప్రిల్ నుంచి మొదలు పెట్టి ఇంకా ఆయా కంపెనీల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విధించే కరోనా గైడ్ లైన్స్ వల్ల ఇంకా వారు వర్క్ ఫ్రమ్ హోమ్ ను మరో మూడు నాలుగు నెలల పాటు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కొందరు ఉద్యోగులు ఆనందంగా ఉన్నారు. మరికొందరు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఇటీవల కొన్ని సంఘటనలను బట్టి చూస్తే అర్థం అవుతోంది. ఇళ్లలో మహిళల మీద దాడులు పెరుగుతున్నాయని కొందరు చెబుతుంటే, దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి వారు మరింత దగ్గరయ్యేందుకు ఉపయోగపడిందనే వాదన కూడా ఉంది. అయితే, దేనికైనా కష్ట నష్టాలు రెండూ ఉంటాయి.

  ఇక అసలు విషయానికి వస్తే సుమారు 9 నెలలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారిని ఇక ఆఫీసులకు పిలవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కర్ణాటకలో శరత్ బచ్చెగౌడ, రఘుపతి భట్ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేసి, మళ్లీ వారికి ఆఫీసులో పని ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో దీన్ని అమలు చేయాలన్నారు. కర్ణాటక అసెంబ్లీలో ఈ ప్రస్తావన తెచ్చారు. అయితే, అందుకు వారు చెప్పిన కారణం కూడా సహేతుకంగా ఉంది. వర్క్ ఫ్రమో వల్ల హాస్పిటాలిటీ, ట్రాన్స్‌పోర్ట్ రంగాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని చెప్పారు. ‘ప్రస్తుతం అన్ని రంగాలు తెరుచుకున్నాయి. ప్రతి ఒక్కరూ రోడ్ల మీద స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇక ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు? వారిని కూడా ఆఫీసులకు పిలిపిస్తే వారి వల్ల హాస్పిటాలిటీ, ట్రాన్స్ పోర్టు రంగాలు బాగుపడతాయి. ఆటోలు, ట్యాక్సీలు, హోటళ్లు మళ్లీ కళకళలాడతాయి. దీని వల్ల ఆయా రంగాల మీద ఆధారపడి బతికే వారికి కూడా మేలు జరుగుతుంది.’ అని ఎమ్మెల్యేలు సూచించారు. అయితే, దీనికి డిప్యూటీ సీఎం సీఎన్ అశ్వంత్ స్పందిస్తూ ప్రైవేట్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ తీసేయాలని ఆదేశించలేమని, అది వారి కంపెనీలో ఉద్యోగుల భద్రతకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు.

  అప్పుడెప్పుడో హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌కు కరోనా వచ్చిందనే వార్తలు గుప్పుమనడంతో ఏకంగా 10 అంతస్తుల బిల్డింగ్‌లో కంపెనీలన్నీ వెంటనే ఉద్యోగులను ఆఫీసు నుంచి ఇంటికి పంపించి వేశారు. వెంటనే ఆఫీసులు మొత్తం శానిటైజేషన్ చేయించాయి. మళ్లీ కరోనా సెకండ్ వేవ్ రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులను ఆఫీసులకు పిలిచిన తర్వాత ఒకరి నుంచి మరొకరికి కరోనా సోకితే.. ‘ఫలానా కంపెనీలో ఉద్యోగికి కరోనా అంట.’ అని గోల గోల అవుతుంది. అందుకే కంపెనీలు కూడా రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేవు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Karnataka, Work From Home

  ఉత్తమ కథలు