కర్ణాటక మంత్రి, సీఎం కుమారస్వామి అన్న రేవణ్ణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాండ్య, హసన్, తూముకురులో జేడీఎస్ కచ్చితంగా గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను చెబుతున్నది జ్యోతిష్యమని... తన జ్యోతిష్యం ఎప్పుడూ వమ్ముకాలేదని వ్యాఖ్యానించారు. రేవణ్ణ తండ్రి, మాజీ ప్రధాని దేవేగౌడ తూముకురు నియోజకవర్గం నుంచి పోటీ చేయగా... ఆయన తనయుడు ప్రజ్వల్ రేవణ్ణ హసన్ నుంచి పోటీ చేశారు. ఇక ఆయన తమ్ముడు, ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ మాండ్య నుంచి పోటీ చేశారు. దీంతో ఆయన ఈ స్థానాల్లో గెలుపుపై స్పందించారు.
మీరు కావాలంటే రాసుకోవాలని మీడియా ప్రతినిధులకు చెప్పిన రేవణ్ణ... తన అంచనాలు ఎప్పుడూ తప్పవని అన్నారు. జేడీఎస్ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో గెలుస్తారని తెలిపారు. మీడియా కూడా ఈ మూడు నియోజకవర్గాల్లో మంచి కవరేజీ ఇచ్చిందని రేవణ్ణ... ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని అన్నారు. దేవేగౌడ, నిఖిల్, ప్రజ్వల్ కలిసి రైతులు వాణిని పార్లమెంట్లో వినిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు తన ఇంటికి కూరగాయాలు సరఫరా చేసే వ్యక్తి దగ్గర ఉన్న రూ. 80 వేలను కూడా ఐటీ అధికారులు తీసుకున్నారని రేవన్ణ ఆరోపించారు. జేడీఎస్ మాజీ ఎమ్మెల్సీ కుటుంబసభ్యుల దగ్గర ఉన్న చిన్న మొత్తంలోని డబ్బును కూడా ఐటీ అధికారులు తీసుకున్నారని మండిపడ్డారు. కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి మహ్మద్ మెహ్సిన్ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేయడాన్ని కూడా రేవణ్ణ ఖండించారు.