• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • KARNATAKA HIGH COURT GIVE GREEN SIGNAL TO CCI REGARDING PROBE AGAINST FLIPKART AND AMAZON AK

Amazon Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు కర్ణాటక హైకోర్టుకు షాక్.. సీసీఐ విచారణకు గ్రీన్‌సిగ్నల్

Amazon Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు కర్ణాటక హైకోర్టుకు షాక్.. సీసీఐ విచారణకు గ్రీన్‌సిగ్నల్

ప్రతీకాత్మక చిత్రం

Amazon Flipkart: కొందరు వ్యాపారులు మాత్రమే స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ చేసే విధంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వ్యవహరించిందని ఢిల్లీ వ్యాపార్ మహాసంఘ్ 2019 అక్టోబర్‌లో ఆరోపించింది.

  • Share this:
    అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. ఈ రెండు సంస్థలు పోటీ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయనే ఆరోపణలపై సీసీఐ(కాంపీటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) విచారణ చేపట్టవచ్చని కోర్టు స్పష్టం చేసింది. దీని వల్ల ఈ కామర్స్ రంగం విస్తరణపై ప్రభావం ఉంటుందని అభిప్రాయపడింది. 18 నెలల క్రితం ఢిల్లీ వ్యాపార్ మహాసంఘ్ ఈ రెండు ఈ కామర్స్ సంస్థలపై సీసీఐకు ఫిర్యాదు చేశాయి. కేవలం కొందరు వ్యాపారులను మాత్రమే ప్రొత్సహిస్తూ పోటీ వ్యతిరేక విధానాలు, ఇష్టానుసారమైన ధరలను నిర్ణయిస్తున్నారని వారు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. దీనిపై రెండు వారాలపాటు మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు ఇవ్వాలని ఫ్లిప్‌కార్ట్ వాదనను సైతం కోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ పీఎస్ దినేశ్ కుమార్ ఈ తీర్పు ఇచ్చారు.

    ఈ తీర్పుపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ కర్ణాటక హైకోర్టులోని ఇరువురు న్యాయమూర్తుల ధర్మాసనం లేదా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. కొందరు వ్యాపారులు మాత్రమే స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ చేసే విధంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వ్యవహరించిందని ఢిల్లీ వ్యాపార్ మహాసంఘ్ 2019 అక్టోబర్‌లో ఆరోపించింది. ఇలా చేయడం ద్వారా భారతీయ నిబంధనలను ఈ రెండు సంస్థలు ఉల్లంఘించాయని తప్పుబట్టింది. కాంపీటేషన్ యాక్ట్‌లోని సెక్షన్ 3, 4 ప్రకారం ఈ సంస్థలపై సీసీఐకు ఫిర్యాదు చేసింది. దీనిపై 2020 జనవరిలో సీసీఐ విచారణకు ఆదేశించింది. సీసీఐ ఆదేశాలపై అమెజాన్ గతేడాది ఫిబ్రవరిలో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. అదే నెలలో కోర్టు ఈ విచారణపై స్టే విధించింది. మరోవైపు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఎఫ్‌డీఐ విధానాన్ని ఉల్లంఘిస్తోందని అఖిల భారత వర్తకుల సమాఖ్య(సీఏఐటీ) ఆరోపించింది. దీనిపై సీసీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ రెండు సంస్థల తీరు వల్ల చిన్న వ్యాపారులకు ఇబ్బంది కలుగుతోందని ఆరోపించింది.

    గతేడాది సెప్టెంబర్‌లో సీసీఐ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి నాగేశ్వరరావు ఈ కేసులు కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అప్పటి నుంచి దీనిపై కోర్టు విచారణ వేగవంతం చేసింది. కర్ణాటక హైకోర్టులో వాదనలు వినిపించిన సీసీఐ.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు చిన్న వ్యాపారులను కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరింది. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు వాదించాయి. తమపై కొందరు వ్యాపారులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని.. వ్యాపారులకు, అమెజాన్‌కు నేరుగా ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించి ఆ తరువాత ఏం చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని అమెజాన్ ప్రతినిధి తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published: