ప్రయాణం (Journey) చేసేటప్పుడు చాలా మందికి ఫోన్లలో పాటలు వినడం, వీడియోలు చూడటం అలవాటుగా ఉంటుంది. ప్రయాణం బోర్ (bore) కొట్టకుండా, సాఫీగా సాగుతూ ఈజీగా టైమ్ గడిచిపోయేందుకు ఇది మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. గతంలో అయితే మ్యాగజైన్, న్యూస్ పేపర్లు చదువుతూ కాలక్షేపం చేసేవారు.. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని స్మార్ట్ ఫోన్ (smart phone) ఆక్రమించేసింది. కొంతమంది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంటే మరి కొంతమంది లౌడ్ స్పీకర్ (loud speaker)తో పక్కన వారిని పట్టించుకోకుండా బయటకు వినపడేలా వింటున్నారు. చాలా వరకు ఇయర్ ఫోన్స్ (Ear phones) పెట్టుకొని మ్యూజిక్ వింటే కొంతమంది మాత్రం స్పీకర్లు ఆన్ చేసి పక్కన ఉన్న ప్రయాణికులను ఇబ్బంది పెడుతుంటారు. అయితే ఇకపై ఇలా పక్క వారికి ఇబ్బంది పెడతామంటే కుదరదు. బస్సుల్లో లౌడ్‌స్పీకర్ ఆన్‌చేసి పాటలు (songs) వినడాన్ని నిషేధించారు. ఎక్కడంటారా? మన పక్క రాష్ట్రం కర్ణాటకలో..
కర్ణాటక ఆర్టీసీ (Karnataka RTC) ఈ సరికొత్త విధానాన్ని అమల్లోకి తేనుంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ.. మొబైల్ స్పీకర్ల ద్వారా పాటలు (songs) వినడాన్ని నిషేధించింది. బస్సులో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించొద్దని కర్ణాటక హైకోర్టు (Karnataka High court) ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
గతంలో కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ (petition) ఆధారంగా కర్ణాటక హైకోర్టు నిషేధం (ban) విధించాలని నిర్ణయించింది. బస్సులో అనవసర శబ్ధాల అంతరాయంపై ఆంక్షలు విధించాలని కోర్టులో పిటిషన్ దాఖలవ్వగా.. మొబైల్‌లో ఎక్కువ సౌండ్ పెట్టి పాటలు, వీడియోలను ప్లే (play) చేసే వినియోగాన్ని పరిమితం చేయాలని పిటిషనర్ కోరారు.
కర్ణాటక హైకోర్టు స్పందిస్తూ.. అధిక సౌండ్‌తో పాటలు ప్లే చేయవద్దని అలాగే తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని బస్సులోని అధికారులు (డ్రైవర్, కండక్టర్) ప్రజలకు తెలియజేయాలని ఆదేశించింది. ఒకవేళ ప్రయాణికుడు అధికారుల సూచనలను పాటించకపోతే ప్రయాణీకుడిని బస్సు నుంచి దింపవచ్చని హైకోర్టు పేర్కొంది. కాగా, ఇదే పద్దతి తెలుగు రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు. ఇటీవల ఆర్టీసీ ఎండీ బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ వినూత్నంగా ముందుకు వెళుతున్నారు. దీనిపై కూడా ఓ నిర్ణయం తీసుకుంటారని నెటిజన్లు అంటున్నారు.
కాగా, పెరిగిన పెట్రోల్ ధరల నేపథ్యంలో ఆర్టీసీ తీసుకువచ్చిన T24 ఆఫర్ జీహెచ్ఎంసీ లో సత్ఫలితాలను ఇస్తోంది. ఈ ఆఫర్ ద్వారా సిటీలో రోజంతా కేవలం రూ. 100తో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకుంటున్నారు.బస్టాండ్ లలో చిన్న పిల్లల తల్లుల కోసం ప్రత్యేకంగా ఫీడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది ఆర్టీసీ. ఇప్పటికే 10 మేజర్ బస్ స్టేషన్లలో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళా ప్రయాణికుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Buses, High Court, Karnataka, Music, Viral Videos