కుటుంబంలో సంతోషాల కోసం భార్య, భర్తలు (Wife and Husband) చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చూడకూడదని కర్ణాటక హైకోర్టు (Karnataka HC) పేర్కొంది. భర్త, అత్తపై ఆరోపణలు చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణ సందర్భంగా కోర్టు ఇలా పేర్కొంది. ఈ కేసులో భర్త, అతని తల్లికి ట్రయల్ కోర్టు శిక్ష విధించడంతో, వారు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మహిళ చేసిన ఆరోపణలు చాలా చిన్నవిగా పేర్కొంటూ భర్త, అతని తల్లిని నిర్ధోషులుగా కోర్టు ప్రకటించింది.వివరాల్లోకి వెళ్తే.. తన భర్త, అత్తపై ఒక మహిళ చేసిన ఆరోపణలను చాలా చిన్నవిగా పేర్కొంటూ కేసును కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ట్రయల్ కోర్టు దోషులుగా పేర్కొంటూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ వారిద్దరికి ఉపశమనం కల్పించింది.
సెక్షన్ 498-A (IPCలోని సెక్షన్ 34, వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 3, 4) కింద శిక్షార్హమైన నేరాలకు సంబంధించి ట్రయల్ కోర్టు 2013 సెప్టెంబర్‌లో భర్త, అతని తల్లిని దోషులుగా నిర్ధారించింది. సెషన్స్ కోర్టు 2016 డిసెంబర్‌లో ఇద్దరూ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ ట్రయల్ కోర్టు విధించిన శిక్షను సమర్థించింది.
విభిన్న వర్గాలకు చెందిన భార్యాభర్తల మధ్య ఆచారాలు, సంప్రదాయాల విషయాల్లో తేడాలు రావడం చిన్నవిషయాలని, ఇవి IPC సెక్షన్ 498-A కింద వేధింపులు లేదా క్రూరత్వంగా పరిగణించలేమని హైకోర్టు పేర్కొంది. మహిళ భర్త, అత్తలను నిర్ధోషులుగా పేర్కొంటూ తీర్పు ఇచ్చింది.
శిక్ష విధించడాన్ని ప్రశ్నిస్తూ భర్త, అతని తల్లి దాఖలు చేసిన పిటిషన్లను విచారణకు అనుమతిస్తూ జస్టిస్ హెచ్‌బి ప్రభాకర శాస్త్రి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ..‘భార్య, భర్త ఇద్దరూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నివసించడానికి మితిమీరిన ప్రాముఖ్యత ఇచ్చినట్లు కనిపిస్తున్నారు. కుటుంబం అనేది సమాజంలో ఒక ప్రత్యేకమైన యూనిట్. కుటుంబంలోని సభ్యుల మధ్య పరస్పర అవగాహన వారి లక్ష్యాలు, ఉద్దేశాన్ని సాధించడంలో సహాయపడతాయి.
అంతే కాకుండా కుటుంబంలో సంతోషాన్ని పెంపొందిస్తాయి. మంచి కుటుంబాలు ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో సహాయపడతాయి. కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవం మంచి వాతావరణాన్ని తీసుకొస్తాయి. కుటుంబంలో భరించడం, సర్దుబాటు చేసుకోవడం, సహించడం, మేనేజ్ చేసుకోవాల్సి రావడం, చిన్న చిన్న ఇష్టాలు, అయిష్టాలు, విభేదాలు సర్వ సాధారణం. ఇలాంటి సున్నితమైన అంశాలను భార్య పెద్దవిగా చూడటంతోనే.. పరిస్థితులు ప్రస్తుత కేసుకు దారితీశాయి.’ అని కోర్టు పేర్కొంది.
ఇది కూడా చదవండి : ఉట్టికొట్టే వారికి రూ.55 లక్షల నజరానా.. ఫారిన్ ట్రిప్ ప్యాకేజ్ కూడా ఫ్రీ
నిందితుల నుంచి వరకట్నం కోసం డిమాండ్ ఉందని లేదా వారు ఏదైనా కట్నం తీసుకున్నారా? లేదా? అనే అంశాలను నిర్ధారించడంలో ఫిర్యాదుదారు విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. ఇతర అల్పమైన సమస్యలను లేవనెత్తడమే కాకుండా, వారి వివాహం జరిగిన మొదటి రాత్రి (శోభనం), తన భర్త తనకు మూడు సంవత్సరాల వరకు బిడ్డను కనడం ఇష్టం లేదని, ఎంఎస్ డిగ్రీ పూర్తయిన తర్వాత దాని గురించి ఆలోచిస్తానని చెప్పారని కూడా భార్య ఫిర్యాదు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karnataka, National News, Wife and husband