Yediyurappa: సీఎం పైనే గవర్నర్‌కు మంత్రి ఫిర్యాదు.. కోర్టులోనూ చుక్కెదురు.. యడియూరప్పకు దెబ్బ మీద దెబ్బ..!

సీఎం యడియూరప్ప(ఫైల్ ఫొటో)

ఈ ఆడియో టేప్‌పై స్పందించిన యడియూరప్ప తాను శరణగౌడను దేవ్‌దుర్గ్ బంగళాలో కలిసి మాట్లాడిన మాట వాస్తవమేనని.. కానీ వాళ్లకు అనుకూలంగా తన మాటలను ఎడిట్ చేసి కుమారస్వామి ఆడియో టేప్ విడుదల చేశారని యడియూరప్ప చెప్పారు. ఈ ‘ఆపరేషన్ కమలం’ కేసులో జరుగుతున్న దర్యాప్తుపై...

  • Share this:
    బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు హైకోర్టులో చుక్కెదురైంది. 2019లో కలకలం రేపిన ‘ఆపరేషన్ కమలం’ వ్యవహారంపై తదుపరి విచారణకు కర్ణాటక హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ ‘ఆపరేషన్ కమలం’ వెనుక యడియూరప్ప ఉన్నారనేది జేడీఎస్ ప్రధాన ఆరోపణ. జేడీఎస్ నేత నాగన్‌గౌడ పాటిల్ కుమారుడు శరణగౌడ పాటిల్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై విచారణకు కర్ణాటక హైకోర్టు తాజాగా అనుమతినిచ్చింది. క్యాంపు రాజకీయాల కారణంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాకివ్వడంతో సంక్షోభాన్ని ఎదుర్కొన్న అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ కుమారస్వామి ఫిబ్రవరి 8, 2019న రాష్ట్ర బీజేపీ చీఫ్, ఇప్పటి ముఖ్యమంత్రి యడియూరప్పకు, శరణగౌడకు మధ్య జరిగిన కాల్ సంభాషణకు సంబంధించిన ఆడియో టేప్ బయటపెట్టారు. ఆ ఫోన్‌ కాల్‌లో జేడీఎస్ ఎమ్మెల్యేలకు డబ్బు, కొందరికి మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు యడియూరప్ప ఆఫర్ చేసినట్లుగా ఆ ఆడియో టేప్‌లో ఉంది. అంతేకాదు, శరణగౌడకు రూ.25 కోట్ల డబ్బుతో పాటు, శరణగౌడ తండ్రికి మంత్రి పదవి యడియూరప్ప ఆఫర్ చేసినట్లుగా ఆ ఫోన్ సంభాషణల్లో ఉంది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలోని 12 నుంచి 13 మంది ఎమ్మెల్యేల మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని యడియూరప్ప మాట్లాడినట్టుగా ఆ ఆడియో టేప్‌లో ఉండటం గమనార్హం. ఈ వ్యవహారంలో యడియూరప్పపై శరణగౌడ ఫిర్యాదు చేశారు. సెక్షన్ 506 కింద యడియూరప్పపై కేసు కూడా నమోదైంది. అయితే.. ఈ ఆడియో టేప్‌పై స్పందించిన యడియూరప్ప తాను శరణగౌడను దేవ్‌దుర్గ్ బంగళాలో కలిసి మాట్లాడిన మాట వాస్తవమేనని.. కానీ వాళ్లకు అనుకూలంగా తన మాటలను ఎడిట్ చేసి కుమారస్వామి ఆడియో టేప్ విడుదల చేశారని యడియూరప్ప చెప్పారు. ఈ ‘ఆపరేషన్ కమలం’ కేసులో జరుగుతున్న దర్యాప్తుపై ఫిబ్రవరి 2019లో కోర్టు స్టే విధించడంతో విచారణ నిలిచిపోయింది.

    తాజాగా.. జస్టిస్ జాన్ మైఖెల్ ఈ స్టే ఆర్డర్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, ఈ వ్యవహారంలో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని యడియూరప్ప దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. దీంతో.. ఈ వ్యవహారంలో విచారణ మళ్లీ కొనసాగనుంది. ఇదిలా ఉంటే.. సొంత పార్టీ నేతల నుంచి కూడా యడియూరప్పకు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి.

    తాజాగా.. తన మంత్రిత్వ శాఖలో ముఖ్యమంత్రి యడియూరప్ప జోక్యం పెరిగిపోయిందని ఆరోపిస్తూ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప తమ నాయకుడైన యడియూరప్పపై ఫిర్యాదు చేయడం పెను దుమారాన్ని రేపింది. సీఎంపై మంత్రి ఫిర్యాదు చేయడంతో సొంత పార్టీ నేతలే అవాక్కయ్యారు. ముఖ్యమంత్రి యడియూరప్ప తన మంత్రిత్వ శాఖలో నేరుగా జోక్యం చేసుకోవడం ‘కర్ణాటక రూల్స్ 1977’ నిబంధనలను అతిక్రమించడం కిందకి వస్తుందని గవర్నర్‌ వాజూభాయి వాలాకు రాసిన లేఖలో మంత్రి ఈశ్వరప్ప పేర్కొన్నారు. ఆ లేఖల కాపీని ప్రధాని నరేంద్ర మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు కూడా మంత్రి పంపారు.
    Published by:Sambasiva Reddy
    First published: