ప్రభుత్వ టీచర్ల ఉదారత.. కష్టాల్లో ఉన్న ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక సాయం

రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్ టీచర్లను గుర్తించే పనిలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు. అందరి వివరాలను సేకరించిన తర్వాత..నేరుగా వారి ఖాతాల్లోకే డబ్బులను జమచేయనున్నారు.

news18-telugu
Updated: July 8, 2020, 2:20 PM IST
ప్రభుత్వ టీచర్ల ఉదారత.. కష్టాల్లో ఉన్న ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక సాయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా లాక్‌డౌన్‌తో మార్చి నెలాఖరు నుంచి దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. మళ్లీ ఎప్పుడు తెరచుకుంటాయో తెలియదు. ఐతే ఈ కరోనా పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూళ్ల టీచర్ల బతుకులు దయనీయంగా మారాయి. ప్రభుత్వ స్కూళ్ల టీచర్లకు ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుంది. స్కూళ్లు తెరచుకున్నా..లేకపోయినా.. వారి జీతాలకు, జీవితాలకు ఢోకా లేదు. కానీ ప్రైవేట్ స్కూల్ టీచర్లు మాత్రం రోడ్డున పడ్డారు. 3 నెలలుగా జీతాలు లేక ఆర్థికంగా చితికిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ టీచర్లు కొబ్బరి బోండాలు, టిఫిన్ సెంటర్ల నడుపుతున్న దృశ్యాలు చూశాం. ఈ నేపథ్యంలో కర్నాటకలోని ప్రభుత్వ స్కూల్ టీచర్లు పెద్ద మనసును చాటుకున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ టీచర్ల కోసం ఫండ్ రైజింగ్ చేసి ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చారు.

కర్నాటకలో లక్షా 40వేల మంది టీచర్లు ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్నారు. ఐతే కరోనా లాక్‌డౌన్ వల్ల వారిలో చాలా మందికి గత మూడు నెలలుగా యాజమాన్యాలు జీతాలు చెల్లించలేదు. ఈ క్రమంలోనే తమను ప్రభుత్వం ఆదుకోవాలని.. రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించాలని కోరాయి. ఐతే ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ చేయలేమని చెప్పిన ప్రభుత్వం.. గవర్నమెంట్ స్కూల్ టీచర్లు ముందుకురావాలని పిలుపునిచ్చింది. పెద్ద మనసుతో తోటి టీచర్లను ఆదుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే కర్నాటక స్టేట్ హైస్కూల్ అసిస్టెంట్ టీచర్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది.

కర్నాటకలోని ప్రభుత్వ స్కూళ్లలో 2.20 లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రైమరీ, సెకండరీ స్కూల్ టీచర్లంతా ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇస్తే.. దాదాపు రూ.30 కోట్లు సమకూరుతాయి. ఆ నిధులతో ప్రైవేట్ స్కూల్ టీచర్లకు ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వ స్కూల్ టీచర్లు తెలిపారు. టీచర్స్ వెల్ఫేర్ ఫండ్‌ని కూడా వినియోగించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా విద్యాధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్ టీచర్లను గుర్తించే పనిలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు. అందరి వివరాలను సేకరించిన తర్వాత..నేరుగా వారి ఖాతాల్లోకే డబ్బులను జమచేయనున్నారు. ప్రభుత్వ స్కూల్ టీచర్లు చేసిన ఈ మంచి పనిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
Published by: Shiva Kumar Addula
First published: July 8, 2020, 2:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading