Karnataka Floor Test : కర్ణాటక అసెంబ్లీలో నేడు జరిగేదేంటి? నంబర్ గేమ్ ఎలా ఉంటుంది? ప్రభుత్వం కూలిపోతుందా?

Karnataka Assembly : కర్ణాటక తాజా రాజకీయాలు ఎన్ని మలుపులు తిరిగినా... ఇవాళ సంక్షోభానికి తెరపడేలా కనిపిస్తోంది. బల నిరూపణ జరిగితే కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 19, 2019, 5:43 AM IST
Karnataka Floor Test : కర్ణాటక అసెంబ్లీలో నేడు జరిగేదేంటి? నంబర్ గేమ్ ఎలా ఉంటుంది? ప్రభుత్వం కూలిపోతుందా?
కర్ణాటక అసెంబ్లీ
  • Share this:
Karnataka : సినిమాలకి మించిన హైడ్రామాలతో సాగిన కర్నాటకానికి నేడు ఎండ్ కార్డ్ పడేలా కనిపిస్తోంది. మధ్యాహ్నం 1.30లోగా బల నిరూపణ పూర్తవ్వాలని గవర్నర్ ఆదేశించడంతో... నేడు కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం తప్పనిసరిగా విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. మరైతే... నంబర్ గేమ్ ఎలా ఉంటుంది? మేజిక్ ఫిగర్ ఎంత? ప్రభుత్వం నెగ్గాలంటే ఎన్ని సీట్లు ఉండాలి. ఇవన్నీ ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే అనారోగ్యమో, మరొకటో కారణాలు చెప్పి... సభకు రాకుండా ఎగ్గొడుతుంటే... ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్లు తీసుకుంటుంటే... ప్రభుత్వానికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇవాళ కూడా ఎమ్మెల్యేలు ఎగ్గొడతారేమో అన్న టెన్షన్‌లో ఉంది ప్రభుత్వం.

నంబర్ గేమ్ చూస్తే... కర్ణాటక అసెంబ్లీలో గురువారం 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. ఇవాళ కూడా వాళ్లు వచ్చే అవకాశాలు లేవు. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 225. అందువల్ల మేజిక్ ఫిగర్ 113. బీజేపీకి 105 సభ్యుల బలం ఉంటే... కాంగ్రెస్‌కి 80, జేడీఎస్‌కి 37 ఎమ్మెల్యేలు ఉండగా... స్వతంత్రులు ఇద్దరు, బీఎస్పీ నుంచీ ఒకరు సభ్యులుగా ఉన్నారు.

తాజా లెక్కల ప్రకారం కాంగ్రెస్‌కి చెందిన 12 మంది, జేడీఎస్‌కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఫలితంగా ప్రస్తుతం కాంగ్రెస్ బలం 68గా, జేడీఎస్ బలం 34గా ఉంది. బల నిరూపణ సమయంలో... సభలో ఎంత మంది ఉంటారో లెక్కలేసి... దాని ప్రకారం మేజిక్ ఫిగర్‌ని నిర్ణయించే అవకాశం ఉంది. అదే జరిగితే... 15 మంది రెబెల్ సభ్యులు రాకపోతే... సభలో సభ్యుల సంఖ్య 210కి పడిపోతుంది. ఫలితంగా మేజిక్ ఫిగర్ 106 అవుతుంది. బీజేపీకి ఇద్దరు స్వతంత్రులు మద్దతిస్తున్నారు. అందువల్ల ఆ పార్టీ బలం 107గా ఉంది. అదే సమయంలో ప్రభుత్వ బలం (68+34) 102తోపాటూ... బీఎస్పీ మద్దతు ఇస్తే 103 అవుతుంది. అయినప్పటికీ మెజార్టీ లేనట్లే. అందువల్ల 14 నెలల ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందన్న ఉద్దేశంతో... ప్రభుత్వం రద్దయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది.

స్వతంత్రుల మద్దతు కూడా అవసరం లేకుండా... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీమంత కుమార్ బాలాసాహేబ్‌ పాటిల్‌ బుధవారం రాత్రి కనిపించకుండా పోయారనీ, గురువారం ఆయన ఛాతీ నొప్పి, బీపీతో ఆయన ముంబైలోని ఓ హాస్పిటల్‌లో చేరారనే వాదన వినిపిస్తోంది. ఆయన కూడా సభకు రాకపోతే... మేజిక్ ఫిగర్ 105 అవుతుంది. తద్వారా బీజేపీ సొంతంగానే మెజార్టీ సాధించినట్లవుతుంది.
Published by: Krishna Kumar N
First published: July 19, 2019, 5:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading