కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలేమో.. అభివృద్ధిలో దూసుకుపోతున్నాం అని చెబుతున్నాయి. వాస్తవంలో ఇలాంటి ఘటనలు మనల్ని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. వినియోగదారులైన మనమే రైతుల నుంచి ఇంత తక్కువ ధరకు ఏనాడూ ఉల్లిపాయలు కొని ఉండం. కానీ.. ఓ మార్కెట్లో రైతు నుంచి 205 కేజీల ఉల్లిపాయలకు.. రూ.8.36 విలువ చూపించారు. ఇప్పుడు ఆ రైతు ఏం చెయ్యాలి? తన గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక.. ఆ బిల్లును సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. రైతులెవరూ తనలా మోసపోవద్దని కోరాడు.
కర్ణాటకలోని గదగ్ నుంచి బెంగళూరుకి 417 కిలోమీటర్లు. అంతదూరం నుంచి బెంగళూరు వచ్చిన ఆ రైతు.. యశ్వంత్పూర్ మార్కెట్లో 205 కేజీల ఉల్లిపాయలను అమ్మాలని ప్రయత్నించాడు. ఆ హోల్సేల్ వ్యాపారి.. 100 కేజీల ఉల్లిపాయల ధర రూ.200 అని ఫిక్స్ చేశాడు. ఆ లెక్కన 205 కేజీల ఉల్లిపాయల ధర రూ.410 అయ్యింది. అందులో పోర్టర్ ఛార్జీలు అంటూ రూ.24 తగ్గించాడు. అలాగే... ఫ్రైట్ ఛార్జీలు అంటూ రూ.377.64 తగ్గించాడు. దాంతో చివరకు మిగిలింది రూ.8.36 అని బిల్లు ఇచ్చాడు. ఆ బిల్లు చూడగానే రైతు గుండె గుభేలుమంది.
ఆ రైతు పేరు పవడెప్ప హళ్లికెరి. తిమ్మాపూర్ గ్రామానికి చెందినవాడు. అతనికి ప్రయాణ ఛార్జీల రూపంలో దాదాపు వెయ్యి రూపాయలు ఖర్చై ఉంటాయి. ఇక్కడ చూస్తే ఉల్లికి విలువ లేదు. కేజీ రూ.2 అంటే.. చాలా దారుణమే కదా. ఒక్క ఉల్లిపాయ భూమిలో పెరగడానికి 3 నెలలు పడుతుంది. అన్ని నెలలు కష్టపడితే వచ్చే దిగుబడికి ఉన్న విలువ ఇది. అందుకే మన దేశంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంటోంది.
Coconut : ఈ కొబ్బరిబోండాం ధర రూ.592.. ఎందుకో తెలుసా?
గదగ్లో దాదాపు 50 మంది రైతులు ఉల్లిపాయలు పండిస్తున్నారు. కొన్ని రోజుల కిందట ఉల్లి ధర క్వింటాలుకు రూ.500 ఉంది. ఇప్పుడు రూ.200కి తగ్గించేశారు. ఆగ్రహంతో ఉన్న రైతులు.. ఉల్లి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. జపాన్లో కేజీ ఉల్లి ధర రూ.90 దాకా ఉంది. మరి మన దగ్గర రైతులకు ధర రూ.2 మాత్రమే నిర్ణయించడం ఏమాత్రం సమంజసం కాదనుకోవచ్చు. తనలాగా ఏ రైతూ మోసపోవద్దన్న పవడెప్ప.. బెంగళూరుకి వచ్చి.. ఉల్లిపాయలు అమ్మొద్దని కోరుతున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Viral, VIRAL NEWS