హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Karnataka: కర్ణాటకలో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి అసమ్మతి సెగ.. 100 రోజుల పాలనపై అధిష్టానంకు ఫిర్యాదులు

Karnataka: కర్ణాటకలో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి అసమ్మతి సెగ.. 100 రోజుల పాలనపై అధిష్టానంకు ఫిర్యాదులు

బసవరాజ బొమ్మై (ఫైల్​ ఫొటో)

బసవరాజ బొమ్మై (ఫైల్​ ఫొటో)

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై (Karnataka CM Basavaraj bommai)కి సొంత పార్టీలో అసమ్మతి సెగ మొదలైంది. గత 100 రోజుల పరిపాలనలో గొప్ప సాధనలు లేవని, సొంత నిర్ణయాలు శూన్యమని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

  కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై (Karnataka CM Basavaraj bommai)కి సొంత పార్టీలో అసమ్మతి సెగ మొదలైంది. గత 100 రోజుల పరిపాలనలో గొప్ప సాధనలు లేవని, సొంత నిర్ణయాలు శూన్యమని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సింధగి, హానగల్‌ అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల (By elections) సమయంలో రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలకు కూడా ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నుంచి వలస వచ్చిన వారికే పెద్ద పీట వేస్తున్నారని మరికొందరు గుర్రుగా ఉన్నారు. బీజేపీ (BJP)లో ఎన్నో ఏళ్లుగా కష్ట పడిన వారిని సీఎం పట్టించుకోవడం లేదంటున్నారు.

  యడియూరప్ప సూచనతో..

  కాగా, యడియూరప్పపై అసమ్మతి పెరగడంతో ఆయన సూచనల మేరకే కొత్త ముఖ్యమంత్రిగా బొమ్మైను ఎంపిక చేసింది బీజేపీ హైకమాండ్.. పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్‌ (Lingayat)లను సంతృప్తిపరుస్తూ అదే వర్గానికి చెందిన బసవరాజ్ బొమ్మైకి అవకాశం కల్పించింది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టే ఉత్తర కర్ణాటక ప్రాంతానికి (హావేరి) చెందిన నేతకు అవకాశం కల్పించింది. ఇప్పటికే వందలాది లింగాయత్‌ మఠాధిపతులు లింగాయేతర సముదాయం నుంచి నూతన సీఎంను ఎంపిక చేయరాదని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేశారు. బీజేపీ సీఎంలకు ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) నేపథ్యం, పార్టీలో సుదీర్ఘ సభ్యత్వం ఉండాలన్న సంప్రదాయాన్ని బసవరాజ ఎంపికలో అధిష్ఠానం పక్కన బెట్టింది. కర్నాటకలో బలమైన సామాజికవర్గంగా ఉన్నలింగాయత్ నేతకే సీఎం పదవిని కట్టబెట్టింది. అయితే ఇపుడు బొమ్మైపై కూడా అసమ్మతి పెరగడం చర్చనీయాంశమైంది.

  ఆరోపణలను గట్టిగా తిప్పకొట్టలేక పోయారని ..

  బిట్‌ కాయిన్‌ (Bitcoin) స్కాం ఆరోపణలను గట్టిగా తిప్పకొట్టలేక పోయారని, పరిపాలనలో ఇద్దరు మంత్రులపై ఆధార పడ్డారని ప్రచారం సాగుతోంది. ఇటీవల జరిగిన సింధగి, హానగల్‌ ఉప ఎన్నికల బాధ్యతను కూడా ఆ ఇద్దరు మంత్రులకే అప్పజెప్పారనే విమర్శలు ఉన్నాయి.

  ఇద్దరు మంత్రుల తీర్మానమే..

  ప్రభుత్వంలో ఏదైనా నిర్ణయం ఓ ఇద్దరు మంత్రుల తీర్మానమే అని, అదే ముఖ్యమంత్రి బొమ్మై నిర్ణయం అనే వదంతులున్నాయి. హానగల్‌లో బీజేపీ ఓటమి, బిట్‌కాయిన్‌ స్కాం ఆసరాగా ఆయన ప్రత్యర్థులు అసమ్మతిని తీవ్రం చేయాలనే యోచనలో ఉన్నారు.  కర్ణాటకలో సీఎం మార్పుపై జేడీఎస్‌ నేత, విధాన పరిషత్తు చైర్మన్‌ బసవరాజ్‌ హోరట్టె శనివారం ఆయన ధారవాడలో మీడియాతో మాట్లాడారు. సీఎంగా బొమ్మై ఉత్తమ పాలన అందిస్తున్నారని, ఇప్పట్లో సీఎం మార్పు ఉండబోదని చెప్పారు. బిట్‌ కాయిన్‌ కేసును అధికారులు చూసుకుంటారన్నారు.

  మాజీ సీఎం కుమారుడు..

  బసవరాజ్ బొమ్మై రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు. 1988- 1989లో ఎస్‌.ఆర్‌.బొమ్మై కర్ణాటక సీఎంగా పనిచేశారు. 1960 జనవరి 1న హుబ్బళ్లిలో బసవరాజ్ బొమ్మై జన్మించారు. 61 ఏళ్ల బసవరాజ బసవరాజ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు. పుణె టెల్కో కంపెనీలో సాంకేతిక సలహాదారుడిగా, సీనియర్‌ కన్సల్టెంట్‌గా పనిచేశారు. నీటిపారుదల రంగంలో విశేష పరిజ్ఞానం ఉంది. బసవరాజ్ బొమ్మై కొన్నాళ్లు జేడీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా, 1996 నుంచి 1997 వరకు నాటి ముఖ్యమంత్రి జె.హెచ్‌.పటేల్‌కు రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు. 2005 వరకు రెండుసార్లు విధాన పరిషత్తుకు ఎన్నికయ్యారు. 2006లో బీజేపీలో చేరిన ఆయన హావేరి జిల్లా శిగ్గాం ఉంచి వరుసగా మూడుసార్లు విధానసభకు ఎన్నికయ్యారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు ఎస్ఆర్ బొమ్మై అత్యంత సన్నిహితుడు నమ్మకస్తుడు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Basavaraj Bommai, Karnataka, Politics

  ఉత్తమ కథలు