Karnataka Lockdown: కర్ణాటకలో లాక్‌డౌన్ వార్తలపై కుండబద్ధలు కొట్టిన సీఎం యడియూరప్ప.. ఆయన ఏమన్నారంటే..

సీఎం యడియూరప్ప

కర్ణాటక రాజధాని నగరం, ఐటీ హబ్ బెంగళూరులో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప వైద్య శాఖ మంత్రితో పాటు సదరు శాఖ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ, లాక్‌డౌన్ విధించే అవకాశాలను...

  • Share this:
    బెంగళూరు: కర్ణాటక రాజధాని నగరం, ఐటీ హబ్ బెంగళూరులో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప వైద్య శాఖ మంత్రితో పాటు సదరు శాఖ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ, లాక్‌డౌన్ విధించే అవకాశాలను సీఎంతో పాటు వైద్యఆరోగ్య శాఖ మంత్రి కూడా కొట్టిపారేశారు. బెంగళూరు నగరంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించినట్లు సమావేశం అనంతరం మంత్రి సుధాకర్ చెప్పారు. మనోజ్ కుమార్ మీనా(బెంగళూరు ఈస్ట్), ఉజ్వల్ కుమార్ ఘోష్(బెంగళూరు వెస్ట్), డాక్టర్ రవికుమార్ సుర్పుర్(బొమ్మనహళ్లి), అన్బు కుమార్(ఎల్హంక), పంకజ్ కుమార్ పాండే(బెంగళూరు సౌత్), మంజుల(మహదేవ్‌పుర), డాక్టర్ పీసీ జాఫర్(దసరహళ్లి), డాక్టర్ ఆర్ విశాల్‌ను(రాజరాజేశ్వరి నగర్) నోడల్ అధికారులుగా నియమించినట్లు మంత్రి తెలిపారు. వీరితో పాటు 2020లో కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు హెల్త్ కమిషనర్‌గా ఉన్న పంకజ్ కుమార్ పాండే కూడా వీరితో పాటు కరోనా కట్టడికి కృషి చేస్తారని మంత్రి సుధాకర్ చెప్పారు. కోవిడ్-19 పేషెంట్స్ కోసం బెంగళూరు రూరల్, బెంగళూరు అర్బన్ ఆసుపత్రుల్లో 1,166 బెడ్స్ కేటాయించినట్లు సీఎం యడియూరప్ప తెలిపారు. సిటీలోని ఒక్కొక్క వార్డుల్లో రెండు మొబైల్ స్క్వాడ్ బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తాయని ఆయన వెల్లడించారు. బెంగళూరులోని హెచ్‌ఏఎల్, హజ్ భవన్‌లో ఇటీవల 100 పడకల కోవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభించినట్లు సీఎం చెప్పారు. కోరమంగళ ఇండోర్ స్టేడియంలో ఏప్రిల్ 5న 250 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు సీఎం యడియూరప్ప తెలిపారు.

    రాష్ట్రంలోని ప్రజలంతా కోవిడ్-19 నిబంధనలను పాటించాలని, మాస్క్‌లు ధరించాలని ఆయన సూచించారు. మరో రెండు వారాల పాటు పబ్లిక్ ర్యాలీలకు గానీ, ఆందోళనలకు గానీ అనుమతి లేదని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికైతే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ గానీ, లాక్‌డౌన్ గానీ విధించే ఉద్దేశం లేదని కర్ణాటక సీఎం యడియూరప్ప ప్రకటించారు. కేరళ,మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కర్ణాటకలోకి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీ-పీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి అని సీఎం గుర్తుచేశారు. కర్ణాటకలో ఆదివారం ఒక్కరోజే 3,082 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ మూడు వేల కేసుల్లో ఒక్క బెంగళూరు నగరంలోనే 2,004 కరోనా కేసులు నమోదు కావడంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు.

    ఇదిలా ఉంటే.. తాజా సమావేశంలో కర్ణాటకలో స్కూల్స్, కాలేజీల మూసివేతపై వస్తున్న వార్తలను సీఎం కొట్టిపారేశారు. పాఠశాలలు, కళాశాలలు తెరిచే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటకలో ఆరవ తరగతి, ఆ పై తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష విద్యాబోధన జరుగుతుందని సీఎం తెలిపారు.
    Published by:Sambasiva Reddy
    First published: