బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు మునుపెన్నడూ ఇలాంటి ట్విస్ట్‌లను కనీవినీ ఎరుగవు. కన్నడ రాజకీయాలను రాసలీలల సీడీ ఇంతలా కుదిపేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఈ సీడీని అడ్డం పెట్టుకుని అధికార బీజేపీని శాసనసభలో కడిగిపారేసిన కాంగ్రెస్ ఇప్పుడు అంత ధైర్యం చేయలేకపోతోంది. ఈ సీడీ వ్యవహారంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ పేరు కూడా తాజాగా తెరపైకి రావడమే ఇందుకు కారణం. ఒక్కమాటలో చెప్పాలంటే.. కర్ణాటకలో ఈ రాసలీలల సీడీ కాంగ్రెస్, బీజేపీ మెడకు చుట్టుకుంది. ఈ రాసలీలల సీడీ వ్యవహారం ఎలాంటి ముగింపు తీసుకుంటుందోనన్న టెన్షన్ ఇరు పార్టీల్లో కనిపిస్తోంది. ఇన్నాళ్లూ ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, బీజేపీ నేతలు మరీ ఇంతలా దిగజారారంటూ విమర్శలతో విరుచుకుపడిన హస్తం పార్టీ నేతలు ఇప్పుడు నోరు మెదపడం లేదు. ఈ సీడీలో యువతితో పాటు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కున్న బీజేపీ నేత రమేష్ జార్కిహోళి మంత్రి పదవికి రాజీనామా చేయాల్సొచ్చింది. ఈ సీడీ కేసు ఇప్పుడు జార్కిహోళి వర్సెస్ డీకే శివకుమార్ ఎపిసోడ్‌కు తెరలేపింది.
ఒకపక్క ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా, మరోవైపు రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. ఈ రాసలీలల వీడియోలో కనిపించిన యువతి ఇప్పటికే ఐదు వీడియోలు విడుదల చేసింది. జార్కిహోళి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లైంగికంగా వేధించాడని ఆ యువతి ఆరోపిస్తోంది. అంతేకాదు, తనకు భద్రత కల్పించాలని కూడా కోరింది. అయితే.. యువతి తల్లిదండ్రులు చెబుతున్న వాదన మాత్రం మరోలా ఉంది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ తమ అమాయక కూతురిని అడ్డం పెట్టుకుని జార్కిహోళిపై హనీట్రాప్ వలపన్నాడని.. జార్కిహోళితో ఉన్న వ్యక్తిగత విభేదాల కారణంగా ఆయనను ఇరకాటంలోకి నెట్టడానికి డీకే ప్రయత్నించాడని యువతి తల్లిదండ్రులు చెప్పడం కొసమెరుపు.
యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌తో రాసలీలల సీడీ కేసు ఊహించని మలుపు తిరిగింది. కర్ణాటక కాంగ్రెస్ మెడకు చుట్టుకుంది. అయితే.. ఆ వీడియోలో కనిపించింది అసలు తాను కాదని, ఎవరో మార్ఫింగ్ చేశారని జార్కిహోళి చెబుతున్నారు. ఈ సీడీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నరేష్ గౌడ జర్నలిస్ట్ కావడంతో ఆ పరిచయంతోనే తనను కలిశాడనేది డీకే వాదన. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తు వారు మాత్రం.. డీకే ఇంటి నుంచే విచారణ మొదలైతే నిజానిజాలను నిగ్గు తేలే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
డీకే పేరు తెరపైకి రావడంతో రాష్ట్ర కాంగ్రెస్ డైలమాలో పడింది. ఈ వివాదంలో బీజేపీపై ఒంటి కాలిపై లేచిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు తమ విమర్శలకు పదును తగ్గించారు. అయితే.. డీకేపై వస్తున్న విమర్శలకు మాత్రం ప్రతివిమర్శలతో బదులిస్తున్నారు. దీంతో.. రాసలీలల కేసు బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు రోజుకో రకంగా మారిపోతున్నాయి. ఇప్పటిదాకా.. ఈ కేసులో కర్ణాటక బీజేపీ, కాంగ్రెస్ ఆరోపణలు, ప్రత్యారోపణలను ఆది నుంచి ఒక్కసారి పరిశీలిస్తే...
కాంగ్రెస్ వాదన: నీటిపారుదల శాఖ మంత్రి రమేష్ జార్కిహోళి ఉద్యోగం ఇప్పిస్తానని ఓ అమాయక యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు
బీజేపీ వాదన: ఆ యువతిని హనీట్రాప్‌లో భాగంగా కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది. ఆమె బాధితురాలు కాదు. ఈ సీడీ వెనుక శివకుమార్ ఉన్నాడు.
కాంగ్రెస్ వాదన: ఇది కచ్చితంగా ప్రొఫెషనల్ బ్లాక్‌మెయిలర్స్ పనే. డబ్బు కోసమే ఇదంతా చేసి ఉంటారు.
బీజేపీ వాదన: వాళ్లు కీలక ప్రతిపక్ష నేత నుంచి జార్కిహోళిని ఇందులో ఇరికించేందుకు సుపారీ తీసుకున్నారు.
కాంగ్రెస్ వాదన: వాస్తవానికి ఆ సీడీలో ఉన్నది జార్కిహోళినే. ఆ యువతి వేరు కావచ్చు. ఆమె ముఖాన్ని మార్ఫింగ్ చేసి ఉండొచ్చు.
బీజేపీ వాదన: మొత్తంగా ఈ సీడీనే ఫేక్. ఆ సీడీలో ఉంది జార్కిహోళి కాదు.
ఇలా కాంగ్రెస్, బీజేపీ మధ్య సీడీ కేసులో రోజుకో విధంగా పొంతన లేని ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతుండటం కొసమెరుపు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇలాంటి ఆరోపణల వల్ల.. విచారణ ఈ ఆరోపణల కోణంలో సాగితే మొత్తం కేసు నీరుగారిపోయే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే... సీడీ కేసుపై అసెంబ్లీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ చేసిన వ్యాఖ్యలు కూడా పెను దుమారాన్ని రేపాయి. కొందరు శ్రీరామచంద్రుల్లా ఫోజులు కొడుతున్నారని, తాను సవాల్ విసురుతున్నానని.. అసెంబ్లీలో ఉన్న మొత్తం 225 మంది ఎమ్మెల్యేల వ్యక్తిగత జీవితాలపై దర్యాప్తు చేస్తే ఎందరికి వివాహేతర సంబంధాలున్నాయో తెలిసిపోతుందని.. ఈ సవాల్ నైతికతకు సంబంధించి సరైందేనని మంత్రి సుధాకర్ చేసిన వ్యాఖ్యలు అధికార బీజేపీ నేతలను సైతం విస్తుపోయేలా చేశాయి. అసలే.. సీడీ కేసుతో తంటాలు పడుతున్న అధికార బీజేపీకి మంత్రి వ్యాఖ్యలు మూలిగే నక్కపై తాటి కాయ పడినట్టయింది. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడింది. అధికారంలో ఉన్న మంత్రి ఇలా మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించింది. గ్యాగ్ ఆర్డర్ రద్దు చేసి ఈ మంత్రుల బాగోతాలను కూడా బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే.. గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్న ఆరుగురు మంత్రులూ కాంగ్రెస్, జేడీఎస్ నుంచి వచ్చి బీజేపీలో చేరిన వారే కావడం గమనార్హం.
ముఖ్యమంత్రి యడియూరప్ప తన 20 నెలల పాలనపై ఇలాంటి మరకల అంటడం టపట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే పాటిల్ యత్నాల్ సీఎం సీడీ కూడా ఉందని చేసిన వ్యాఖ్యలు కర్ణాటక బీజేపీకి తలనొప్పిగా మారాయి. కర్ణాటకకు ఉగాదికి కొత్త సీఎం రాబోతున్నారని యత్నాల్ గతంలో చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. ప్రతిపక్షంతోనే కాకుండా సొంత పార్టీ నేతల వ్యవహార శైలితో కూడా సీఎం యడియూరప్ప నానా తంటాలు పడుతున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా జార్కిహోళి వర్సెస్ శివకుమార్ ఎపిసోడ్‌తో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని భావిస్తోంది. మొత్తం మీద కర్ణాటక రాజకీయాల్లో రాసలీలల సీడీ కొత్త రచ్చకు దారితీసింది.
రాజకీయ పార్టీల వాదనలు కాసేపు పక్కన పెడితే.. ఈ రాసలీలల సీడీలో కనిపించినట్టుగా చెబుతున్న ఆ యువతి తాజాగా కర్ణాటక చీఫ్ జస్టిస్‌కు ఓ లేఖ రాసింది. ఈ కేసును సీజే వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని కోరింది. తనకు రక్షణ కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించింది. తాను ఒక అత్యాచార బాధితురాలినని, కర్ణాటక ప్రభుత్వ మాజీ మంత్రి పైన తాను ఫిర్యాదు చేశానని ఆ యువతి లేఖలో సీజేకు వివరించింది. రమేష్ జార్కిహోళి చాలామందిని ప్రభావం చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి అని, బహిరంగంగా తనను ఇదివరకే బెదిరించాడని ఆమె చెప్పింది. రమేష్ జార్కిహోళి వద్ద నేర చరిత్ర కలిగిన వ్యక్తులున్నారని, ఈ కేసులో సాక్ష్యాధారాలను నాశనం చేసే పనిని వారు ఇప్పటికే మొదలుపెట్టారని యువతి మూడు పేజీల లేఖలో పేర్కొంది. ఏ క్షణంలోనైనా, ఎక్కడైనా రమేష్ జార్కిహోళి తనను చంపేస్తాడని ఆ యువతి లేఖలో ఆరోపించింది. తనకు ప్రాణహాని ఉందని యువతి సీజేను కోరడంపై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఆ యువతికి ఏదైనా జరగరానిది జరిగితే.. అందుకు సీఎం యడియూరప్ప, హోం మంత్రి బసవరాజ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు.
డీపీ సతీష్, నెట్‌వర్క్ 18
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dk shivakumar, Karnataka