Karnataka Assembly Election Date 2023 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రకటించింది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మే 24తో ఇప్పుడున్న అసెంబ్లీ పదవీకాలం ముగుస్తుంది. కర్ణాటకలో 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 2.62 కోట్ల మంది కాగా, స్త్రీలు 2.5 కోట్లు ఉన్నారు. తొలిసారిగా.. 80 ఏళ్లు దాటిన ముసలివారు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే (vote from home) అవకాశం ఈ ఎన్నికల నుంచి మొదలవుతోంది.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే తేదీ - ఏప్రిల్ 13
నామినేషన్ల చివరి తేదీ - ఏప్రిల్ 20
నామినేషన్ల పరిశీలన - ఏప్రిల్ 21
నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 24
ఎన్నికలు జరిగే తేదీ - మే 10 (ఒకే విడతలో)
ఎన్నికల ఫలితాలు ప్రకటించే తేదీ - మే 13
ఈసారి ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ్టి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
కర్ణాటకలో మొత్తం 58,282 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 240 పోలింగ్ కేంద్రాలు.. ఎకో ఫ్రెండ్లీగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈసారి 41,312 మంది ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కు పొందారు. కర్నాటకలో 2018-19 నుండి మొదటిసారి ఓటర్లు 9.17 లక్షలు పెరిగారు. ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువ ఓటర్లందరూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయగలరు అని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
ప్రస్తుత కర్ణాటక అసెంబ్లీలో... బీజేపీకి 104 సీట్లు, కాంగ్రెస్ 78 సీట్లు, జేడీఎస్ 37 సీట్లు, ప్రజ్ఞావంత జనతాపార్టీ 1 సీటు, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ 1, ఇండిపెండెంట్ 1 సీటు ఉన్నాయి. కర్ణాటకలో 36 ఎస్సీ, 15 ఎస్టీ స్థానాలు ఉన్నాయి. 173 జనరల్ స్థానాలున్నాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో ఒక పెద్ద రాష్ట్రం కర్ణాటక. క్యాంప్, రిసార్ట్ రాజకీయాలకు పెట్టింది పేరు. ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, ఏ పార్టీ ప్రభుత్వం కుప్పకూలుతుందో చెప్పలేం. విపరీతమైన రాజకీయ ఎత్తుగడలకు కేంద్రమైన కన్నడ గడ్డపై.. అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గర పడింది. ఎన్నికల తేదీలు వచ్చేశాయి. అధికార బీజేపీ , ప్రతిపక్ష కాంగ్రెస్‌తోపాటూ.. ప్రాంతీయ JDS ఇతర పార్టీలు ఇక ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నాయి.
ఇప్పుడున్న కర్ణాటక శాసన సభా పక్షానికి మే 24, 2023తో పదవీ కాలం పూర్తవుతుంది. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్యే ఉండగా.. ఆమ్‌ఆద్మీపార్టీ, BRS కూడా సత్తా చాటాలని చూస్తున్నాయి.
కర్ణాటక అసెంబ్లీలో 224 సీట్లు ఉన్నాయి. అందువల్ల ఒకే దశలో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. ఇప్పటికే కాంగ్రెస్, JDS తమ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశాయి. బీజేపీ మాత్రం రిలీజ్ చెయ్యలేదు. ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత జాబితా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) ఆదివారం అన్నారు.
ఈసారి కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం సిద్ధరామయ్య హాట్ టాపిక్ అయ్యారు. ఈయన తన రెగ్యులర్ నియోజకవర్గం నుంచి కాకుండా... వరుణ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు. ఐతే.. కోలార్ నుంచి కూడా పోటీ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. కాంగ్రెస్ రిలీజ్ చేసిన 124 మంది సభ్యుల జాబితాలో.. కర్ణాటక PCC చీఫ్ డీకే శివకుమార్.. కనకపురా నుంచి బరిలో దిగుతున్నారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్... ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానమైన చితపూర్ నుంచి పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్ కంటే ముందు JDS 2022 డిసెంబర్‌లోనే తన మొదటి అభ్యర్థుల లిస్టును ప్రకటించింది. అందులో 93 మంది పేర్లు ఉన్నాయి.
మాజీ సీఎం, సీనియర్ JDS నేత HD కుమారస్వామి.. చన్నపట్న నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది. ఈ స్థానం బెంగళూరుకి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆయన కొడుకు.. మూడో తరం నేత నిఖిల్.. రామనగర స్థానం నుంచి బరిలో దిగుతున్నారు.
జేడీఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి GT దేవెగౌడ... చాముండేశ్వరి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన 2018లో మాజీ సీఎం సిద్ధరామయ్యపై చాముండేశ్వరి స్థానం నుంచే... చెప్పుకోతగ్గ మార్జిన్‌తో గెలిచారు. GT దేవెగౌడ కొడుకు హరీష్ గౌడను హన్సూర్ స్థానం నుంచి బరిలో దింపుతోంది పార్టీ.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తన మొదటి లిస్టులో 80 అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో 13 మంది లాయర్లున్నారు. వారిలో సుప్రీంకోర్టు లాయర్ బ్రిజేష్ కలప్ప కూడా ఉన్నారు. అలాగే ముగ్గురు డాక్టర్లు, నలుగురు ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఆప్ ఇంకా 144 మంది లిస్ట్ రిలీజ్ చేయాల్సి ఉంది. ఇక జాతీయ పార్టీగా అవతరించేందుకు ప్రయత్నిస్తున్న BRS అభ్యర్థులను బరిలో దింపుతుందా లేదా అన్నది తెలియలేదు. ప్రస్తుతం ఆ పార్టీ JDSతో దోస్తీ చేస్తోంది. ఆ పార్టీ తరపున ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karnataka Elections