ఏ దేవుడూ (God) ఉన్నత వర్గాలకు చెందిన వాడు కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు JNU వైస్ ఛాన్సలర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్. ఆంత్రొపాలజీ పరంగా చూస్తే శివుడు (Lord Shiva) కూడా షెడ్యూల్డ్ కులానికి లేదా షెడ్యూల్డ్ తెగకు చెందిన వాడని చెబుతూ ఆమె కొత్త చర్చకు తెరలేపారు. ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ థాట్స్ ఆన్ జెండర్ జస్టిస్: డీకోడింగ్ ఆఫ్ యూనిఫాం సివిల్ కోడ్’ అనే థీమ్‌తో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (DR Br Ambedkar) లెక్చర్ సిరీస్ స్పీచ్ సమయంలో JNU వైస్ ఛాన్సలర్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మనుస్మృతిలో మహిళలకు 'శూద్రుల' హోదాను ఇచ్చారని, ఇది తిరోగమనమని తెలిపారు.
ఆమె మాట్లాడుతూ.. ‘మనుస్మృతి ప్రకారం స్త్రీలందరూ శూద్రులని మహిళలందరికీ చెప్తాను. ఏ స్త్రీ కూడా తాము బ్రాహ్మణులమని, మరో వర్గమని చెప్పుకోదు. వివాహం ద్వారానే మహిళలకు భర్త లేదా తండ్రి కులం వస్తుంది. ఇది తిరోగమనం.’ అని తెలిపారు. తొమ్మిదేళ్ల దళిత బాలుడిపై ఇటీవల జరిగిన కుల హింస గురించి మాట్లాడుతూ.. ఏ దేవుడూ ఉన్నత కులానికి చెందినవాడు కాదు. చాలా మందికి మన దేవుళ్ల మూలాలు ఆంత్రొపాలజీ పరంగా తెలియాలి.
ఏ దేవుడూ బ్రాహ్మణుడు కాదు. అత్యున్నతుడు క్షత్రియుడు. శివుడు తప్పనిసరిగా షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ తెగవాడై ఉండాలి. ఎందుకంటే ఆయన పాముతో స్మశానవాటికలో కూర్చుని చాలా తక్కువ దుస్తులు ధరించి ఉంటాడు. బ్రాహ్మణులు స్మశానవాటికలో కూర్చుంటారని నేను అనుకోను’ అన్నారు. ఆంత్రొపాలజీ పరంగా లక్ష్మి, శక్తి లేదా జగన్నాథుడు వంటి దేవుళ్ళు కూడా ఉన్నత కులానికి చెందినవారు కాదని, నిజానికి జగన్నాథుడికి గిరిజన మూలాలు ఉన్నాయని ఆమె అన్నారు.
* అంబేడ్కర్ వంటి ఆలోచనాపరులు లేరు
‘అమానవీయమైన ఈ వివక్షను మనం ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నాం? మనం పునరాలోచించడం, బాబాసాహెబ్ ఆలోచనలను తిరిగి మార్చడం చాలా ముఖ్యం. ఆధునిక భారతదేశంలో ఇంత గొప్ప ఆలోచనాపరుడైన నాయకుడు మనకు లేడు. హిందూయిజం అనేది ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం, అదే జీవన విధానం అయితే మనం విమర్శలకు ఎందుకు భయపడతాం..?’ అని ఆమె తెలిపారు.
ఇది కూడా చదవండి : అసెంబ్లీ స్పీకర్ రాజీనామా.. బలపరీక్షకు ముందు బీహార్ రాజకీయాల్లో ట్విస్ట్.. !
మన సమాజంలో నిర్మాణాత్మకమైన వివక్షలపై మమ్మల్ని మేల్కొల్పిన వారిలో గౌతమ బుద్ధుడు ఒకరు. యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమలుకు అంబేడ్కర్ సపోర్ట్ చేశారని ఆమె అన్నారు. దానిని అమలు చేయడానికి మనకు సామాజిక ప్రజాస్వామ్యం లేకపోతే, మన రాజకీయ ప్రజాస్వామ్యం ఎండమావి అన్నారు. 52 విశ్వవిద్యాలయాలలో కేవలం ఆరు వర్సిటీలలో మాత్రమే మహిళా వైస్-ఛాన్సలర్లు ఉన్నారని, అందులో ఒకటి రిజర్వ్డ్ కేటగిరీకి చెందినదని తెలిపారు.
* నా ఉద్దేశాలు కాదు: జేఎన్‌యూ వైస్ ఛాన్సలర్
అయితే ఆమె వ్యాఖ్యలకు విమర్శలు ఎదురైన తర్వాత.. అంబేడ్కర్ ఆలోచనలు వివరించానని తన ఉద్దేశాలు కావని చెప్పారు. గౌతమ బుద్ధుడి నుంచి అంబేడ్కర్ వరకు స్మరించుకోవడం హిందూ మతం ఘనత అని అన్నారు. జండర్ జస్టిస్‌పై అంబేడ్కర్ గురించి మాట్లాడానని, యూనిఫాం సివిల్ కోడ్‌ను డీకోడింగ్ చేస్తున్నానని వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ambedkar, JNU, Lord Shiva, National News