Jharkhand Accident: బస్సు లోపల సీట్ల మధ్య ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు దాదాపు 3 గంటల సమయం పట్టింది. గ్యాస్ కట్టర్‌లతో బస్సు భాగాలను కట్ చేస్తూ వారిని బయటకు తీసుకొచ్చారు.
ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Jharkhand Road Accident) జరిగింది. అచ్చం జర్నీ సినిమాను తలపించేలా యాక్సిడెంట్ అయింది. బస్సును ఎల్పీజీ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కును ఓ ట్రావెల్స్ బస్సు ఎదురెదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు 15 మంది మరణించారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. పాకూర్ జిల్లా గోవింద్‌పూర్-సాహిబ్‌గంజ్ హైవేపై పాడేర్‌కోలా సమీపంలో బుధవారం ఉదయం 08.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సు సాహిబ్‌గంజ్‌లోని బర్హర్వా నుంచి దుమ్కాకు వెళ్తోంది. అందులో మొత్తం 55 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు పాడేర్కోలా సమీపంలోకి రాగానే ఎల్పీజీ సిలిండర్ల లారీ (LPG Cylinders Truck), బస్సు అతివేగంతో ఎదురెదరుగా ఢీకొన్నాయి. స్పాట్‌లోనే పలువురు మరణించారు. బస్సు నుజ్జునుజ్జవడంతో కొందరు లోపలే ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు లోపల సీట్ల మధ్య ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు దాదాపు 3 గంటల సమయం పట్టింది. గ్యాస్ కట్టర్‌లతో బస్సు భాగాలను కట్ చేస్తూ వారిని బయటకు తీసుకొచ్చారు.అనంతరం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశమున్నట్లు డాక్టర్లు తెలిపారు.. పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందంటే.. రెండు వాహనాలు ఒకదానిలో మరొకటి ఇరుక్కుపోయాయి. వాటిని వేరు చేసేందుకు చాలా సమయం పట్టింది.
రోడ్డు ప్రమాద మృతులను నమితా దేవి (దేవ్‌గఢ్), నిర్మల (దుమ్కా), విమలా దేవి, సంజయ్ సాహు (దుమ్కా), షహబుద్దీన్ అన్సారీ(లిట్టిపాడా), అమతి రాజ్‌వార్ (పశ్చిమ బెంగాల్), ద్రోనాథ్ హెంబ్రమ్ (అమల్‌పడా), సుకం కర్కర్, సాంగ్ దేవి (సాహిబ్‌గంజ్), మెలిషిత్ (సాహిబ్ గంజ్), రాకేష్ మండల్ ( సాహిబ్‌గంజ్), బబ్లూ టుడు, జిగ్తీలుగా గుర్తించారు. మరికొందరి మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే రోడ్డు ప్రమాదంలో 15 మరణించడం అందరినీ కలిచివేసింది.
ప్రమాద సమయంలో రెండు వాహనాలు అతి వేగంతో ఉన్నాయనని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉదయం 08.30 సమయం అయినప్పటికీ రోడ్డుపై పొగమంచు ఎక్కువగా ఉందని, అందువల్లే రోడ్డు ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. అతి వేగంతో.. ఎదరెదురుగా.. ఢీకొనడం వల్లే.. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.