CBI: సీబీఐ డైరెక్టర్ కొత్త ఆదేశాలు.. వాటిపై నిషేధం.. ఉల్లంఘస్తే కఠిన చర్యలు..

ప్రతీకాత్మక చిత్రం

CBI: ఇటీవల సీబీఐ డైరెక్టర్ గా నియమితులైన సుబోధ్ కుమార్ జైస్వాల్ తన అధికారులు, సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. జీన్స్, టీష‌ర్ట్స్‌, స్పోర్ట్స్ షూలు వేసుకోకూడదని ఫార్మల్ డ్రస్ లోనే రావాలని అధికారులకు తెలిపారు.

  • Share this:
    వారం రోజుల కిందట సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కొత్త డైరెక్ట‌ర్ గా బాధ్యతలు చేపట్టిన సుబోధ్ కుమార్ జైస్వాల్ త‌న అధికారులు, సిబ్బందికి కీల‌క ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి జీన్స్, టీష‌ర్ట్స్‌, స్పోర్ట్స్ షూలు వేసుకోకూడ‌ద‌ని, హుందాగా క‌నిపించే ఫార్మ‌ల్ డ్రెస్సులే వేసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని.. ప్రతీ ఒక్కరూ పాటించాలని అన్నారు. ఈ ఆదేశాల ప్ర‌కారం సీబీఐలో ప‌ని చేసే పురుషులు ష‌ర్ట్స్‌, ఫార్మ‌ల్ ప్యాంట్లు, ఫార్మ‌ల్ షూస్ వేసుకోవాలి. ప్ర‌తి రోజూ నీట్‌గా షేవ్ చేసుకొని రావాలని తెలిపారు. ఇక మ‌హిళా అధికారులైతే చీర‌లు, సూట్లు, ఫార్మ‌ల్ ష‌ర్ట్స్, ప్యాంట్లు మాత్ర‌మే వేసుకోవాలి. ఆఫీస్‌లో జీన్స్‌, టీష‌ర్ట్స్‌, స్పోర్ట్స్ షూస్‌, చెప్పులు, క్యాజువ‌ల్ వేర్ ఏదీ అనుమ‌తించ‌బోము అని ఆ ఆదేశాల్లో డైరెక్ట‌ర్ సుబోధ్ స్ప‌ష్టం చేశారు.

    దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖలలో ఈ ఆదేశాలు పాటించాలని తెలిపారు. ఆయా శాఖల హెడ్స్ క‌చ్చితంగా ఈ ఆదేశాలు అమ‌లయ్యేలా చూడాల‌ని కూడా ఆ ఉత్తర్వులో తెలిపారు. మొదటి నుంచి ఇలాంటి నిబంధనలు అమలో ఉన్నా.. ఈ మధ్య కాలం నుంచి వాటిని అమలుకు నోచుకోవడం లేదు.

    అయితే ఇన్ని రోజులూ వారిని ఎవ‌రూ ప్ర‌శ్నించ‌లేద‌ని ఓ సీబీఐ అధికారి అన్నారు. ఇటువంటి ఆదేశాలు ఇవ్వడం ఒక రకంగా మంచిదేనని వారు అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో సీబీఐ ప‌నితీరును మెరుగుప‌రిచేందుకు కొన్ని కీల‌క చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు సీబీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ ఆదేశాలను ప్రతీ ఒక్కరూ ఆహ్వానించారు.
    Published by:Veera Babu
    First published: