Vande Bharat: దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి ఇండియన్ రైల్వేస్ ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ రైళ్లను(Vande bharat express trains) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ మేడ్ ఇన్ ఇండియా సెమీ హై స్పీడ్ రైళ్లు ఇప్పటికే వివిధ మార్గాల్లో అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికులకు అద్భుతమైన జర్నీ ఎక్స్‌పీరియన్స్ అందించడం కోసం వీటిని అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో పెద్ద నగరాల్లో వీటికి మినీ వెర్షన్‌గా వందే భారత్ మెట్రోను ప్రారంభించాలని ఇండియన్ రైల్వేస్ యోచిస్తోంది. జమ్మూ కశ్మీర్‌లో(Jammu and Kashmir) కూడా 2024లో వందే భారత్ మెట్రో రైలు పట్టాలెక్కనుందని రైల్వే మంత్రి తాజాగా వెల్లడించారు.
కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ మార్చి 26న జమ్మూ కశ్మీర్‌లో పర్యటించారు. చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బిడ్జ్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ చీనాబ్ నదీగర్భం నుంచి దాదాపు 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ (USBRL) ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో పూర్తి కానున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత జమ్మూ - శ్రీనగర్ మధ్య వందే భారత్ మెట్రో రైలును నడపనున్నట్లు తెలిపారు.
* 28,000 మెట్రిక్ టన్నుల ఉక్కు వినియోగం
అనంతరం రైల్వే మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉన్న చీనాబ్ వంతెన నిర్మాణం ఇంజనీర్ల పనితీరుకు సవాల్ లాంటిదన్నారు. ఈ వంతెనపై ట్రాక్ పని పూర్తయిందని, త్వరలోనే కవాచ్-యాంటీ-కొలిషన్ సేఫ్టీ డివైజ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఎలక్ట్రిక్ వర్క్ కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ‘ఈ ఐకానిక్ రైల్వే బ్రిడ్జ్ సగం ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు సమానమైన పునాదితో నిర్మించారు. సెస్మిక్ జోన్‌లో నిర్మించిన ఈ వంతెన కోసం 28,000 మెట్రిక్ టన్నులకు పైగా ఉక్కును ఉపయోగించారు.’ అని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
* బ్రిడ్జ్ హైలెట్స్
ఈ ఐకానిక్ వంతెన డెక్ ఎత్తు 359 మీటర్లు, పొడవు 1,315 మీటర్లుగా ఉంటుంది. ఆర్చ్ బ్రిడ్జ్ 17 స్పాన్‌లతో ఉంటుంది. మెయిన్ ఆర్చ్ స్పాన్ లీనియర్ పొడవు 460 మీటర్లతో వంపుగా ఉంటుంది. సగటున ఈ రైల్వే బ్రిడ్జ్ 120 ఏళ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మిస్తున్నారు. ఇది 266 kmph గాలి వేగాన్ని సైతం తట్టుకోగలదు. 100 kmph వేగంతో రైలు పరుగులు పెట్టేలా ఈ బ్రిడ్జ్‌ను డిజైన్ చేశారు.
Pay Per Road Use: కొత్త టోల్ పాలసీ..రోడ్డుపై ఎంత దూరం ప్రయాణిస్తే ఆ మేరకు టోల్ కట్టాలంట!
* తగ్గనున్న ప్రయాణ సమయం
ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ పూర్తయితే కశ్మీర్ లోయ భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో కనెక్ట్ అవుతుంది. దీంతో జమ్మూ నుంచి శ్రీనగర్‌కు చాలా త్వరగా చేరుకోవచ్చు. దాదాపు 3.5 గంటల సమయంలోనే చేరుకోవచ్చు. అయితే వందే మెట్రో సర్వీస్‌లు నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలో మాత్రమే తిప్పనున్నారు. ఈ రైల్వే లింక్ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ రైలు ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. చీనాబ్ వంతెన వద్ద పర్యాటకంగా కొన్ని ప్రదేశాలను కూడా గుర్తించారు. కశ్మీర్ యాపిల్స్, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సైతం సులభతరం అవుతుంది.
* జమ్మూలో స్పెషల్ ట్రైనింగ్ అకాడమీ
జమ్మూ కశ్మీర్ పర్యటన సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వరాల జల్లు కురిపించారు. జమ్మూలో ఇంజనీర్ల కోసం ప్రత్యేక ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కశ్మీర్ లోయలోని బుద్గామ్ వద్ద వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.