జమ్ముకశ్మీర్‌లో పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మొహ్మద్‌కు చావుదెబ్బ తగిలింది. భారత భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో జైషే మొహ్మద్ టాప్ కమాండర్ కూడా ఉన్నట్లు సైనికాధికారులు తెలిపారు. కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు నక్కినట్లు సమాచారంతో భారత సేనలు, సీఆర్పీఎఫ్ జవాన్లు, పోలీసులు ఆ ప్రాంతంలో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమైనట్లు ఆ రాష్ట్ర డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన జైషే మొహ్మద్‌కు చెందిన సదరు టాప్ కమాండర్‌కు ఐఈడీ నిపుణుడిగా గుర్తింపు ఉంది.గతంలో మూడు, నాలుగు ఎదురుకాల్పుల్లో ఇతను చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఒకానొక ఎన్‌కౌంటర్ ఘటనలో అతను తృటిలో తప్పించుకోగా...అతను వాడుతున్న అమెరికాలో తయారైన MO4 రైఫిల్‌ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. జమ్ముకశ్మీర్‌లో జరిగిన పలు ఐఈడీ పేలుడు ఘటనల్లో ఇతను ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. భారత భద్రతా దళాలు లక్ష్యంగా జరిగిన ఐఈడీ పేలుడు ఘటనల్లోనూ అతని ప్రమేయముంది.
ఘటనా స్థలి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు భారత సైనికులు కూడా గాయపడినట్లు సమాచారం. వీరిని ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స కల్పిస్తున్నారు. ఆ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు ఉండొచ్చన్న అనుమానంతో జాయింట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు సైనిక అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.