హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థిపై కాల్పులు.. అప్రమత్తమైన భద్రత బలగాలు

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థిపై కాల్పులు.. అప్రమత్తమైన భద్రత బలగాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Jammu and Kashmir DDC Polls: జమ్మూ కశ్మీర్‌లో జిల్లా అభివృద్ది మండలి(DDC) ఎన్నికల బరిలో నిలిచిన ఓ అభ్యర్థిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు

  జమ్మూ కశ్మీర్‌లో జిల్లా అభివృద్ది మండలి(DDC) ఎన్నికల బరిలో నిలిచిన ఓ అభ్యర్థిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దక్షిన కశ్మీర్‌ అనంత్‌నాగ్ జిల్లాలోని కోకెర్నాగ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. డీడీసీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజే అభ్యర్థిపై కాల్పులు జరగడం స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. జమ్మూ కశ్మీర్‌లో జిల్లా అభివృద్ది మండలి ఎన్నికలు జరుగుతున్నాయి. గత నెలలో ప్రారంభం అయిన ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. శుక్రవారం మూడో విడత పోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే కోకెర్నాగ్ ప్రాంతంలోని సగమ్ వద్ద ఎన్నికల పోటీచేస్తున్న ఓ అభ్యర్థిపై దుండగులు దాడి చేశారు. దాడిలో గాయపడిన అభ్యర్థిని అనీస్‌ ఉల్‌ ఇస్లాంగా గుర్తించారు. అయితే డీడీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఇలాంటి దాడి జరగడం ఇదే తొలిసారి.

  దుండగుల కాల్పుల్లో గాయపడ్డ అనీస్‌ను వెంటనే ఆస్ప్రతికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారని.. అతని పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, భారత ఆర్మీ బలగాలు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై స్థానికులు మాట్లాడుతూ.. అనీస్ ఇటీవలే అల్తాఫ్ బుకారీ నేతృత్వంలో అప్నీ పార్టీలో చేరారని తెలిపారు. ఇక, డీడీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం మూడెంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 8 విడతల్లో జరగనున్న ఎన్నికల్లో 280 అభ్యర్థులను ఎనుకోనున్నారు.

  ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్ల స్పందించారు. శాంతికి విఘాతం కలిగించే శక్తులే ఈ దాడికి పాల్పడ్డాయని అన్నారు. డీడీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిపై దాడి జరిగిందనే వార్త కలవరానికి గురిచేసిందని చెప్పారు. అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Jammu and Kashmir

  ఉత్తమ కథలు