Jallikattu 2019 : 800 మంది అభ్యర్ధులు... 900 ఎద్దులు... తమిళనాడులో మొదలైన జల్లికట్టు పోటీలు...

జల్లికట్టు పోటీలు

Jallikattu 2019 : తమిళనాడులో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. గతేడాది కోర్టుకు వెళ్లి మరీ ఈ పోటీలు జరుపుకునేందుకు అనుమతులు తెచ్చుకున్న నిర్వాహకులు ఈసారి పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.

  • Share this:
తమిళనాడులోని మధురై జిల్లాలో ఉన్న అవనియపురంలో జల్లికట్టు పోటీలను ప్రారంభించారు జిల్లా కలెక్టర్ నటరాజన్. 800 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, 900 ఎద్దులు రంకెలు వేస్తున్నాయి. మొదట ఆలయ ఎద్దుతో పోటీలు ప్రారంభించారు. పరిగెడుతూ వస్తున్న ఎద్దుల్ని అడ్డుకుంటూ యోధులు పోరాట పటిమ చూపిస్తున్నారు. పోటీల్లో విజేతలకు ఈ ఏడాది బంగారు కేకులు, పత్తి, సైకిళ్లు సహా రకరకాల బహుమతులు ఇవ్వనున్నారు. ఈ ఏడాది రైతులు, అభ్యర్థుల మధ్య విబేధాలు రావడంతో... జల్లికట్టు పోటీలను నిర్వహించే విషయం సమస్యగా మారింది. దీనిపై మద్రాస్ హైకోర్టుకు వెళ్లగా... జిల్లా పాలనా యంత్రాంగమే వాటిని నిర్వహించాలని ఆదేశించింది. ఈ టోర్నమెంట్ చూసేందుకు వేల మంది తరలి రావడంతో... ప్రభుత్వం అంబులెన్స్, ఫైరింగ్ సహా అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంది.జల్లికట్టు పోటీల్లో మొత్తం 8 రౌండ్లు ఉంటాయి. ఒక్కో రౌండ్‌లో దాదాపు 75 నుంచీ 100 మంది పోటీ పడుతున్నారు. తొలి రౌండ్లలో పాల్గొని ఎద్దులను సమర్థంగా ఎదుర్కొన్న వారు తర్వాతి రౌండ్లలో పాల్గొనే అర్హత సాధిస్తున్నారు. చూడ్డానికి భయంకరంగా ఉండే ఎద్దులు వేగంగా తమ వైపు దూసుకొస్తుంటే వాటిని ఎదుర్కోవడం మాటలు కాదు. అందుకే చాలా మంది వెన్ను చూపి పారిపోతుంటారు. అలా పారిపోయేవాళ్లను వీక్షకులు ఇష్టపడరు. ప్రాణాలకు తెగించి పోరాడాలని కోరుకుంటున్నారు.

తాజా పోటీల్లో ఇప్పటికే 44 మంది గాయపడగా... వాళ్లలో 36 మందిని దగ్గర్లోని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు తరలించారు. వాళ్లలో 8 మందికి తీవ్ర గాయాలైనప్పటికీ... ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. గత రెండేళ్లతో పోల్చితే... విబేధాల కారణంగా ఈ ఏడాది జల్లికట్టు పోటీలకు ప్రజలు కాస్త తక్కువ సంఖ్యలో వచ్చారు. ఈ ఏడాది ఇస్తున్న బహుమతులు తక్కువగా ఉన్నాయంటూ స్థానికులు చాలా మంది ఈ పోటీలను బాయ్‌కాట్ చేశారు. జిల్లా యంత్రాంగం మాత్రం పోటీలను సమర్థంగా నిర్వహిస్తున్నామని చెబుతోంది.

ఇవి కూడా చదవండి:


World Record Egg : ఇన్‌స్ట్రాగ్రాం ఎగ్ పగలబడి నవ్వితే... ప్యాట్రిక్ స్టార్ వైరల్ వీడియో


Virat Kohli : ఛేజింగ్ వీరుడిగా రికార్డులు సృష్టిస్తున్న విరాట్ కోహ్లీ...


Head Wobble Challenge : హెడ్ వబుల్ ఛాలెంజ్... మీరూ పాల్గొంటారా... వైరల్ వీడియో

First published: