హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Delhi Blast: ‘ఢిల్లీలో ఇజ్రాయిల్ ఎంబసీ వద్ద పేలుడు మా పనే’.. ప్రకటించిన ఉగ్రవాద సంస్థ

Delhi Blast: ‘ఢిల్లీలో ఇజ్రాయిల్ ఎంబసీ వద్ద పేలుడు మా పనే’.. ప్రకటించిన ఉగ్రవాద సంస్థ

ఇజ్రాయిల్ ఎంబసీ వద్ద భారీగా భద్రతా సిబ్బంది (Image; ANI)

ఇజ్రాయిల్ ఎంబసీ వద్ద భారీగా భద్రతా సిబ్బంది (Image; ANI)

ఢిల్లీలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద జరిగిన పేలుడు తమ పనేనని ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఐఈడీ పేలుడు తమ పనేనని ఉగ్రవాద సంస్థ జైషే ఉల్ హింద్ తెలిపింది. ఢిల్లీలోని అబ్దుల్ కలాం రోడ్డులో అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో జనవరి 29న చిన్న తరహాల పేలుడు సంభవించింది.

ఇంకా చదవండి ...

  ఢిల్లీలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద జరిగిన పేలుడు తమ పనేనని ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఐఈడీ పేలుడు తమ పనేనని ఉగ్రవాద సంస్థ జైషే ఉల్ హింద్ తెలిపింది. ఢిల్లీలోని అబ్దుల్ కలాం రోడ్డులో అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో జనవరి 29న చిన్న తరహాల పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి మూడు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. రిపబ్లిక్ డే ముగింపు ఉత్సవాలు జరుగుతున్న ప్రాంతానికి 1.7 కిలోమీటర్ దూరంలోనే ఈ పేలుడు జరగడం, దీంతోపాటు భారత్, ఇజ్రాయిల్ మధ్య సుహృద్భావ చర్చలు జరిగి 29 ఏళ్లు పూర్తయిన రోజే ఈ పేలుడు జరగడంతో చాలా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే, పేలుడు జరిగిన ప్రాంతంలో శాంపిళ్లను పరిశీలించగా, అందులో హైగ్రేడ్ మిలటరీ పేలుడు పదార్థాలు గుర్తించారు. ఇలాంటి పేలుడు పదార్థాలు ఉగ్రవాద సంస్థలైన అల్ ఖైదా, ISIS లాంటి వాటి వద్ద లభించే అవకాశం ఉంది. ఇప్పుడు ISISకి అనుబంధంగా ఉండే జైషే ఉల్ హింద్ అది తామే చేశామని ప్రకటించింది. కానీ, నిఘా సంస్థలు, భద్రతా సంస్థలు దీన్ని విశ్వసించడం లేదు.

  ఈ ఘటన వెనుక ఇరాన్ హస్తం ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి ఇరాన్ వెళ్తున్న ఓ విమానాన్ని నిలిపివేశారు. అందులో ప్రయాణికులను పూర్తిగా తనిఖీ చేశారు. కానీ, అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆ తర్వాత విమానం బయలుదేరింది. పేలుడు జరిగిన స్థలంలో భద్రతా బలగాలకు ఒక లేఖ కూడా లభించింది. లేఖను ఫోరెన్సిక్ బృందం స్వాధీనం చేసుకుంది. ఇజ్రాయెల్​ రాయబారిని బెదిరిస్తూ ఇంగ్లీష్‌లో ఈ లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు. ఇది కేవలం 'ట్రైలర్' అని లేఖలో ఉందని పోలీసులు చెప్పారు. గతేడాది ఇరాన్​కు అణు శాస్త్రవేత్త, జనరల్ అధికారిని చంపిన విషయాన్ని నిందితులు లేఖలో ప్రస్తావించినట్లు అధికారులు తెలిపారు. దానికి ప్రతీకారంగానే ఇజ్రాయిల్ ఎంబసీని లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు.

  ఇది కచ్చితంగా ఉగ్రదాడిగా భావించాల్సి ఉంటుందని భారత్‌లో ఇజ్రాయిల్ రాయబారి రాన్ మల్కా చెప్పారు. ఎన్నో ఇజ్రాయిల్ మిషన్స్ మీద దాడులు జరుగుతున్నాయని, ఇది తమకు ఆశ్చర్యం కలిగించలేదని తెలిపారు. దాడికి కారణాలను అన్వేషించేందుకు తాము భారత్‌తో కలసి పనిచేస్తామని చెప్పారు. అలాగే, ఇజ్రాయిల్ బృందం కూడా భారత్‌కు వచ్చిన ఘటన స్థలాన్ని పరిశీలించనుంది.

  ఢిల్లీలో పేలుళ్ల తర్వాత దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో అలర్ట్ అయ్యారు. భారీ భద్రతను పెంచారు. దేశ రాజధానిలోని ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ దేశాల ఎంబసీల వద్ద కూడా భారీ భద్రతను మోహరించారు. పోలీసులు అన్నిచోట్లా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తమకు అందివచ్చిన అన్ని విషయాలను పరిశీలించి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇజ్రాయిల్ ఎంబసీకి కొంచెం దూరంలో ఓ చెట్టుకు సీసీ కెమెరా ఉందని, అందులో కొన్ని దృశ్యాలు నిక్షిప్తం అయినట్టు సమాచారం. కానీ, అందులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడని, అతడి ముఖం స్పష్టంగా కనిపించడం లేదనే సమాచారం వచ్చింది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: BLAST, New Delhi

  ఉత్తమ కథలు