IT raids on ex-IPS officer's premises : గతకొంత కాలంగా యూపీలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. వరుస దాడుల్లో వందల కోట్ల రూపాయల లెక్కల్లో చూపని ధనాన్ని ఐటీ అధికారులు గుర్తిస్తున్నారు. తాజాగా సమాజ్‌వాదీ పార్టీకి అత్యంత సన్నిహితుడిగా చెప్పబడుతున్న ఓ మాజీ ఐపీఎస్ అధికారి ఇంట్లో ఐటీ అధికారులు చేపట్టిన సోదాల్లో వందల కోట్ల రూపాయల లెక్కల్లో చూపని నగదు బయటపడింది. ఆయన ఇంట్లో భారీ స్థాయిలో నోట్ల కట్టలను చూసి అవాక్కవ్వడం అధికారుల వంతైంది.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి రామ్ నారాయణ్ సింగ్ కు చెందిన నోయిడా సెక్టార్ 50 లోని ఇంట్లో ఆదివారం సాయంత్రం ఐటీ అధికారులు ఆకశ్మిక తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇంటి బేస్ మెంట్ లో వందల కోట్ల రూపాయల నగదును ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. రూ.2000, 500 కరెన్సీ నోట్ల కట్టలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి బేస్ మెంట్ లోనే మాజీ ఐపీఎస్ అధికారి ఆఫీస్ ఓపెన్ చేశాడని..ఆ కంపెనీకి 650 లాకర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇంట్లో నుంచి రికవరీ చేసుకున్న నగదు వివరాలను అధికారికంగా ప్రకటించలేదు.
ALSO READ Pre-Polls Survey Results: యూపీలో బీజేపీ ఓటమి.. అఖిలేశ్ సీఎం: ఎవరికెన్ని సీట్లంటే..
ఇప్పటివరకు ఎవరిపైనా కేసు నమోదు చేయలేదని ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికి సోదాలు మాత్రమే నిర్వహిస్తున్నామని పేర్కొన్నాయి. బినామీ ఆస్తులు ఏమైనా ఉన్నాయా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. యూపీలో ఎన్నికల ముందు జరుగుతున్న ఐటీ దాడులు అన్ని పార్టీల నాయకుల్లో ఆందోళన కలిస్తోంది. ఎవరి పేరు ఎప్పుడు బయటకు వస్తుందో తెలియక కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.