IT Raids On Fomer NSE MD : సెబీ దర్యాప్తు క్రమంలో హిమాలయ యోగి అంశం తెరపైకి వచ్చింది. చిత్రా రామకృష్ణ నిర్ణయాలను హిమాలయాల్లోని ఒక యోగి ప్రభావితం చేసినట్టు సెబీ తేల్చింది. ఆనంద్ సుబ్రమణియన్ పనితీరుపై ఎలాంటి అంచనాలు, రిపోర్ట్ లు లేకుండానే కేవలం యోగి చెప్పారని మాత్రమే అతని జీతాన్ని చిత్రా రామకృష్ణ పెంచుకుంటూ పోయారని తేలింది.
IT Raids On Chitra Ramkrishna Residence : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE)మాజీ సీఈవో,మేనేజింగ్ డైరెక్టర్ చిత్రా రామకృష్ణ(Chitra Ramakrishna)కు సంబంధించిన ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఆర్థిక అవకతవకలు, పన్ను ఎగవేత వంటి కారణాలతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. చెన్నై, ముంబైలలోని చిత్రా రామకృష్ణకు సంబంధించిన నివాసాల్లో సోదాలు జరుగుతున్న విషయాన్ని ఐటీ అధికారులు ధ్రువీకరించారు. సెబీ ఆదేశాల నేపథ్యంలో ముంబై, చెన్నైలలో సోదాలు జరుగుతున్నాయని, ఐటీకి చెందిన ముంబై విభాగం ఈ సోదాలకు నేతృత్వం వహిస్తోందని సమాచారం. NSE యొక్క అంతర్గత రహస్య సమాచారాన్ని తెలియని వ్యక్తికి పంచుకోవడం ద్వారా అక్రమ ఆర్థిక లాభాలను ఆర్జించారనే ఆరోపణలపై చిత్రా రామకృష్ణపై దర్యాప్తు జరుగుతోంది. చిత్రా రామకృష్ణ.. 2009లో నేషనల్ స్టాక్ ఎక్చేంజీలో జేఎండీగా నియమితులయ్యారు. 2013లో స్టాక్ ఎక్చేంజీకి సీఈవో అయ్యారు. అనూహ్యరీతిలో 2016లో పదవికి రాజీనామా చేశారు.
అయితే చిత్రా రామకృష్ణ పదవీకాలంలో కొన్ని నియామకాలు అనుమానాస్పదంగా ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. 2013లో క్యాపిటల్ మార్కెట్‌పై ఎలాంటి అనుభవం లేని ఆనంద్ సుబ్రమణియన్ ను స్టాక్ ఎక్చేంజి చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్ గా నియమించడం, ఆపై అతడిని గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎండీ సలహాదారుగా మార్చడం వివాదాస్పదం అయ్యాయి. అంతకు ముందు ఓ చిన్న కంపెనీలో ఏడాదికి 15 లక్షల జీతంతో మేనేజర్ స్థాయిలో పనిచేస్తున్న ఆనంద్ సుబ్రమణియన్ ను ఏకంగా కోటి 68 లక్షల వార్షిక వేతనం ఇచ్చి అడ్వైజర్‌గా కూర్చొబెట్టారు చిత్ర. అక్కడితో ఆగలేదు. ఆ జీతాన్ని 2014లో రెండు కోట్లు, 2015లో 3 కోట్ల 33 లక్షలకు పెంచారు. అంతేకాదు ఎండీకి సలహాదారుగా ప్రమోషన్ కట్టబెట్టారు. 2016లో ఆనంద్ జీతాన్ని 4 కోట్ల 21 లక్షలకు పెంచారు. అంతేకాకుండా ఆనంద్ సుబ్రమణియన్ వారానికి ఐదు రోజులకు బదులు మూడు రోజులు పనిచేస్తే చాలని ఆదేశాలు ఇచ్చారు చిత్ర. సుబ్రమణియన్ నియామక వ్యవహారంపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంచ్ బోర్డ్ ఆఫ్ ఇండియా - సెబీ దర్యాప్తు చేపట్టింది. సుబ్రమణియన్.. అపాయింట్మెంట్ లో అవకతవకలు జరిగాయని తెలియడంతో NSE నుంచి చిత్రా రామకృష్ణను 2016లో తొలగించారు. సుబ్రమణియన్ కు.. విమానాల్లో కూడా ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించేందుకు వెసులు బాటు ఇచ్చారని సెబీ తెలుసుకుంది. మొత్తం వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సెబీ చిత్రా రామకృష్ణను క్యాపిటల్ మార్కెట్ నుంచి మూడేళ్ల పాటు నిషేధించింది. అంతేగాకుండా.. అడిషనల్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద కోటీ 54 లక్షలు.. బోనస్ కింద ఇచ్చిన 2 కోట్ల 83 లక్షల రూపాయలను జప్తు చేయాలని NSEని ఆదేశించింది సెబీ.
సెబీ దర్యాప్తు క్రమంలో హిమాలయ యోగి అంశం తెరపైకి వచ్చింది. చిత్రా రామకృష్ణ నిర్ణయాలను హిమాలయాల్లోని ఒక యోగి ప్రభావితం చేసినట్టు సెబీ తేల్చింది. ఆనంద్ సుబ్రమణియన్ పనితీరుపై ఎలాంటి అంచనాలు, రిపోర్ట్ లు లేకుండానే కేవలం యోగి చెప్పారని మాత్రమే అతని జీతాన్ని చిత్రా రామకృష్ణ పెంచుకుంటూ పోయారని తేలింది. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంచ్ వివరాలను అన్నింటినీ సదరు యోగికి ఈమెయిళ్ల ద్వారా ఆమె చేరవేసేవారని సెబీ బయటపెట్టింది. NSEలో ఎవరిని నియమించాలి?ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలి? ఎవరికెంత జీతం పెంచాలన్న విషయాలతో పాటు.. NSE డివిడెంట్, ఆర్థిక ఫలితాల వివరాలు, బోర్డ్ మీటింగ్ ఎజెండా, ఫైనాన్షియల్ డేటా మొత్తం ఆ గుర్తు తెలియని యోగి డైరెక్షన్లోనే జరిగినట్లు తేలింది. యోగిని చిత్రా ఎప్పుడు కలవలేదు.. నేరుగా మాట్లాడలేదు. మెయిల్ రూపంలోనే వారి మధ్య సంభాషణలు కొనసాగాయి. చిత్రా ప్రశ్నలు అడగడం.. దానికి యోగి సమాధానాలు చెప్పడం.. యోగి చెప్పిన వారికే ప్రమోషన్ లు.. యోగి చెప్పిన ప్రాజెక్టులపైనే సంతకాలు..ఇలా సాగిపోయింది. ఆ హిమాలయ యోగి తనకు గత రెండు దశాబ్దాలుగా మార్గదర్శనం చేస్తున్నారని, వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాల్లో దారి చూపించారని చిత్రా రామకృష్ణ తెలిపారు. ఆయనను ఆమె 'శిరోన్మణి' అని పేర్కొన్నారు. అయితే, సెబీ మాత్రం చిత్రా రామకృష్ణను ఆ హిమాలయ యోగి ఓ పావులా ఉపయోగించుకున్నారని ఆరోపిస్తోంది.
ఇక, 2013లో చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్ (సీఎ్సఓ) నియామకంలో కార్పొరేట్ పాలన ప్రమాణాల ఉల్లంఘన, రహస్య సమాచారాన్ని తెలియని వ్యక్తికి పంచుకున్నారనే ఆరోపణలపై సెబీ తాజాగా ఆమె చర్యలు చేపట్టింది. ఆమెకు రూ. 3 కోట్ల జరిమానా విధించింది. 45 రోజుల్లోగా జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు, మూడేళ్ల పాటు స్టాక్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధం వేటు వేసింది. మాజీ వైస్ చైర్మన్ రవి నారాయణ్, మాజీ సీఎస్ఓ ఆనంద్ సుబ్రమణియన్ తో పాటు ఎన్ఎస్ఈపై రూ.2 కోట్ల చొప్పున పెనాల్టీ విధించింది. అప్పట్లో చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్, చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్‌గా పనిచేసిన వీఆర్ నరసింహన్‌కు రూ.6 లక్షల ఫైన్ పడింది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.