Home /News /national /

Mercedes Benz: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. బాగా పనిచేస్తే బెంజ్ కారు మీదే..

Mercedes Benz: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. బాగా పనిచేస్తే బెంజ్ కారు మీదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దిగ్గజ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్.. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు మెర్సిడెస్ బెంజ్ కార్లను ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.

ప్రతిభావంతులు తమ ఉద్యోగాలను వదిలి వెళ్ళిపోతే కంపెనీలకు భారీ నష్టం చేకూరుతుంది. మళ్లీ అటువంటి ప్రతిభావంతులను నియమించుకోవడానికి కంపెనీలకు చాలా సమయం పడుతుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అయితే ఇలాంటి నష్టాల బారిన పడకుండా చాలా కంపెనీలు తమ టాలెంటెడ్ ఉద్యోగులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ అట్టిపెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఫలితంగా ఉద్యోగులు కూడా అదే కంపెనీలలో కొనసాగుతుంటారు. ఇక ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం లెక్కలేనన్ని ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి. తద్వారా తమ ప్రతిభావంతమైన ఉద్యోగులను నిలుపుకుంటాయి. ఇలాంటి వినూత్నమైన ప్రోత్సాహకాలతో వార్తల్లో నిలుస్తోంది హెచ్‌సీఎల్ సంస్థ.

దిగ్గజ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్.. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు మెర్సిడెస్ బెంజ్ కార్లను ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. 'మెర్సిడెస్ బెంజ్ కార్లను ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించాం. మా ప్రపోజల్ కి బోర్డు ఆమోదం తెలపగానే ప్రతిభావంతులకు కార్లను గిఫ్ట్‌గా ఇచ్చేస్తాం' అని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ముఖ్య మానవ వనరుల అధికారి (సీహెచ్‌ఆర్‌ఓ) వి.వి.అప్పారావు మీడియాకు వెల్లడించారు. నిజానికి 2013వ సంవత్సరంలో హెచ్‌సీఎల్‌ టెక్ కంపెనీ 50 మంది ఉద్యోగులకు మెర్సిడెస్‌ బెంజ్‌ కార్లను బహుమతులుగా అందించింది. కానీ తర్వాత కార్లను గిఫ్ట్‌గా ఇవ్వటం మానేసింది.

"ఒక ఉద్యోగి కంపెనీని వీడితే.. ఆ స్థానంలో మరొక ఉద్యోగిని నియమించాలంటే.. 15% నుంచి 20% ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఇటువంటి ఖర్చును తగ్గించుకోవడానికి మా ఉద్యోగుల్లోనే కొత్త నైపుణ్యాలు పెంచుతున్నాం. కొత్త ప్రొఫెషనల్స్ అవసరం లేకుండా జాగ్రత్త పడుతున్నాం. జావా డెవలపర్స్ మేము ఆఫర్ చేస్తున్న వేతనాలకే ఉద్యోగాలు చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ క్లౌడ్ ప్రొఫెషనల్‌ను నియమించుకోవడానికి ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుంది" అని వి.వి అప్పారావు చెప్పుకొచ్చారు.

గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022 ఆర్థిక సంవత్సరంలో 50 శాతం ఎక్కువగా ఫ్రెషర్లను నియమించుకుంటామని ఇటీవల హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రకటించింది. 20 నుంచి 22 వేల ఫ్రెషర్లను నియమించుకుంటామని సంస్థ ప్రకటించడం విశేషం. ఉద్యోగులను అట్టిపెట్టుకునేందుకు, ఉద్యోగ వలసలను నిరోధించేందుకు హెచ్‌సీఎల్‌ వేతనాలను కూడా పెంచింది. పెరిగిన వేతనాలు జులై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి.

తమ సంస్థలో ఉద్యోగ వలసల రేటు (అట్రిషన్) అధికంగా ఉందని వి.వి అప్పారావు అన్నారు. ఇతర దిగ్గజ ఐటీ కంపెనీలతో పోల్చుకుంటే తమ కంపెనీలో వలసల రేటు తక్కువగానే ఉందని చెప్పారు. గడిసిన 12 నెలల కాలంలో వలసల రేటు 11.8 శాతంగా ఉందని కంపెనీ వెల్లడించింది. ఇక ఇతర ఐటీ కంపెనీలు వేతన పెంపు, బోనస్‌లు అంటూ ఉద్యోగులపై వరాలు కురిపిస్తున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Employees, IT Employees

తదుపరి వార్తలు