హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం...క్రెడిట్ రాహుల్ గాంధీదేనా ?

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం...క్రెడిట్ రాహుల్ గాంధీదేనా ?

మూడు రాష్ట్రాల ఫలితాలు రాహుల్ గాంధీకి నాయకుడిగా ఎదిగే గొప్ప అవకాశాన్ని ఇచ్చాయని చెప్పొచ్చు. ఈ విజయాలను మెట్లుగా చేసుకుని మోదీని ఢీ కొట్టేందుకు సమర్థవంతమైన వ్యూహాలు రచిస్తేనే... రాహుల్ గాంధీ అసలు సిసలు నాయకుడిగా గుర్తింపు పొందుతారు.

మూడు రాష్ట్రాల ఫలితాలు రాహుల్ గాంధీకి నాయకుడిగా ఎదిగే గొప్ప అవకాశాన్ని ఇచ్చాయని చెప్పొచ్చు. ఈ విజయాలను మెట్లుగా చేసుకుని మోదీని ఢీ కొట్టేందుకు సమర్థవంతమైన వ్యూహాలు రచిస్తేనే... రాహుల్ గాంధీ అసలు సిసలు నాయకుడిగా గుర్తింపు పొందుతారు.

మూడు రాష్ట్రాల ఫలితాలు రాహుల్ గాంధీకి నాయకుడిగా ఎదిగే గొప్ప అవకాశాన్ని ఇచ్చాయని చెప్పొచ్చు. ఈ విజయాలను మెట్లుగా చేసుకుని మోదీని ఢీ కొట్టేందుకు సమర్థవంతమైన వ్యూహాలు రచిస్తేనే... రాహుల్ గాంధీ అసలు సిసలు నాయకుడిగా గుర్తింపు పొందుతారు.

ఇంకా చదవండి ...

    (వ్యాసకర్త: కిశోర్ కుమార్, సీనియర్ సబ్ ఎడిటర్, న్యూస్18 తెలుగు)

    దేశంలో ప్రధాని నరేంద్రమోదీ హవా ఇంకా కొనసాగుతుందనే ఊహాగానాల నేపథ్యంలో... రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ హోరాహోరీగా పోరాడినా... అంతిమ విజయం మాత్రం కాంగ్రెస్‌కే దక్కింది. ఇక రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పూర్తి మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చింది. మరో ఆరు నెలల్లోపే సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో... కాంగ్రెస్ సాధించిన ఈ విజయాలు ఆ పార్టీలో కచ్చితంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని వేరే చెప్పనవసరం లేదు. అయితే ఈ ఫలితాలకు సంబంధించిన క్రెడిట్ కచ్చితంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకే దక్కుతుందా అనే విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.

    Five states election results, Kamalnath and Ashok gehlot, Sachin Pilot, మధ్యప్రదేశ్ ఛత్తీస్‌గఢ్ రాజస్థాన్ సీఎంల ఎంపిక, కమల్ నాథ్ అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్
    రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)

    గతంలో రాహుల్ గాంధీ ఎక్కడ ప్రచారం చేసినా... అక్కడ కాంగ్రెస్ ఓడిపోతుందని అపవాదు బలంగా ఉండేది. ఫలితాలు కూడా అదే రకంగా రావడంతో... రాహుల్ సారథ్యంపై కాంగ్రెస్‌లోని చాలామందిలో అనుమానాలు ఉండేవి. అయితే కొంతకాలంగా ఆయన తన ప్రసంగాలు, వ్యవహారశైలిలో పరిణితిని ప్రదర్శించడం మొదలుపెట్టారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీపై రాజకీయ దాడి చేయడంలో పూర్తి స్పష్టతను ప్రదర్శిస్తున్నారు. అవిశ్వాసం సమయంలోనూ ఆయన చేసిన ప్రసంగాలు దేశ ప్రజలను ఆకట్టుకున్నాయి. రాహుల్ గాంధీలోనూ నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఆ తరువాత జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సాధించలేకపోయినా... జేడీఎస్‌తో కలిసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ రాహుల్ గాంధీ రాజకీయ చతురతను ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

    కాంగ్రెస్‌లో ఉండే వ్యూహకర్తలను కర్ణాటకలో రాహుల్ గాంధీ సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. ఫలితంగానే దక్షిణాదిలోని పెద్ద రాష్ట్రంలో అధికారం చేజారకుండా చూసుకోవడంలో విజయం సాధించారు. అయితే రాహుల్ గాంధీకి అసలు సిసలు పరీక్ష మాత్రం రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎదురైంది.

    ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సత్తా చాటి ఉండకపోతే... వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరిగి ఉండేది కాదు. ఈ విషయం రాహుల్‌ గాంధీకి కూడా బాగా తెలుసు. అందుకే బీజేపీ కంచుకోటలుగా ఉన్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారనే వాదన ఉన్న మెజార్టీ వర్గాలను మళ్లీ తమ వైపు తిప్పుకునేందుకు బాగా కష్టపడ్డారు.

    రాహుల్ గాంధీ ( Image: Facebook)
    రాహుల్ గాంధీ ( Image: Facebook)

    రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని నాయకత్వానికి రాహుల్ గాంధీ పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారు. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ ద్వయం, మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియా ద్వయానికి బాసటగా నిలిచారు. దీంతో వారిలోనూ ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగింది. ఏయే రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉందో తెలుసుకుంటూ... ఆయా రాష్ట్రాలపై ఎక్కువగా ఫోకస్ చేయడానికి రాహుల్ గాంధీ ఎక్కువ సమయం కేటాయించారు. కాంగ్రెస్ పార్టీని తాను సమర్థవంతంగా నడిపించగలననే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించారు. పార్టీ పగ్గాలు పూర్తిస్థాయిలో చేపట్టిన తరువాత సంస్థాగతంగానూ మార్పులు చేయడం మొదలుపెట్టారు. అది కాంగ్రెస్‌ శ్రేణుల్లోనూ రాహుల్ గాంధీ పట్ల నమ్మకాన్ని పెంచాయి.

    అయితే మూడు రాష్ట్రాల్లో గెలుపు క్రెడిట్‌ను పూర్తిగా రాహుల్ గాంధీకి ఇవ్వలేమనే వాదనలు కూడా ఉన్నాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలుపు కోసం రాహుల్ గాంధీ పెద్దగా చేసిందేమీ లేదనే టాక్ ఉంది. ఇక్కడ బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉన్నందువల్లే ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారనే ప్రచారం ఉంది. మూడుపర్యాయాలు మధ్యప్రదేశ్‌ను ఏలుతున్న బీజేపీని రాహుల్ గాంధీ అండ్ టీమ్ అతి కష్టం మీద నిలువరించగలిగారని... ప్రభుత్వ వ్యతిరేకత ఉండే రాష్ట్రాల్లో విజయం సాధించేందుకు సైతం కాంగ్రెస్ ఇంతగా కష్టపడాల్సి వచ్చిందనే భావనను కూడా పలువురు వ్యక్తం చేశారు.

    చత్తీస్‌గఢ్‌లోనూ ప్రభుత్వ వ్యతిరేకతే కాంగ్రెస్‌ను గెలిపించిందని... ఇందులో రాహుల్ గాంధీ పెద్దగా చేసిందేమీ లేదనే టాక్ ఉంది. చత్తీస్‌గఢ్‌లో స్థానిక కాంగ్రెస్ నాయకత్వం బలంగా లేకున్నా కాంగ్రెస్ గెలిచిందనే విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అయితే ఈ మూడు రాష్ట్రాల ఫలితాలు రాహుల్ గాంధీకి నాయకుడిగా ఎదిగే గొప్ప అవకాశాన్ని ఇచ్చాయని మాత్రం చెప్పొచ్చు. ఈ విజయాలను మెట్లుగా చేసుకుని ఆయన మోదీని ఢీ కొట్టేందుకు సమర్థవంతమైన వ్యూహాలు రచిస్తేనే... ఆయన అసలు సిసలు నాయకుడిగా గుర్తింపు పొందుతారన్నది ఎవరూ కాదనలేని వాస్తవం.

    First published:

    ఉత్తమ కథలు