భారతదేశంలో గిరిజనులు ఆహారపు అలవాట్లు విచిత్రంగా ఉంటాయి. సాధారణంగా మైదాన ప్రజలు చీమలు వారి దగ్గరికి వస్తే దూరంగా పడేస్తారు. మరికొంతమందైతే వారి కాలి కిందే నలిపేస్తారు. కానీ గిరిజనులు మాత్రం ఎర్ర చీమలను పచ్చడిగా చేసుకుంటారు. వాళ్లు ఎర్ర చీమల చట్నీని ఒక ఔషదంగా భావిస్తారు. గిరిజనులు ఈ పచ్చడిని ఫ్లూ, దగ్గు, జలుబు, శ్వాస ఇబ్బందులు, అలసట వంటి వాటి నుంచి ఉపశమనం పొందడానికి ఇష్టంగా వండుకుని తింటారు. అయితే ఈ చట్నీతో ప్రపంచాన్ని గజగజవణికిస్తున్న కోవిడ్-19 వైరస్ ను కూడా తరిమేయోచ్చట. ఈ మేరకు తాను చేసిన ప్రతిపాదనను పరిశోధకులు పెడచెవిన పెట్టారంటూ ఒక ఇంజినీర్ కోర్టులో దావా వేశారు.
ఒడిషాకు చెందిన ఇంజినీర్, పరిశోధకుడు నయాధర్ పఢియాల్ ఈ పిల్ దాఖలు చేశారు. కరోనా రోగుల చికిత్సలో భాగంగా.. సంప్రదాయ ఎర్ర చీమల చట్నీని ఉపయోగించే విషయమంలో అధ్యయనం చేయాలని నయాధర్ ప్రతిపాదనలు పంపినా దానిని పట్టించుకోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా.. ఆయన పిటిషన్ స్వీకరించిన ఒడిషా హైకోర్టు.. ఎరుపు చీమల పచ్చడి కరోనాను నయం చేయడంలో సహాయపడుతుందా...? అని వివరించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. మూడు నెలలలో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రపంచంలోని వివిధ దేశాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ పరీక్షకు కొన్ని దేశాలు దాదాపు తుది అంకానికి చేరాయి. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ లోని గిరిజనం.. ఎర్ర చీమలను పట్టుకుని పచ్చిమిర్చి, ఇతర సాంప్రదాయ పదార్ధాలను ఉపయోగించి దానిని తయారు చేస్తారు.
Published by:Srinivas Munigala
First published:January 02, 2021, 20:03 IST