Home /News /national /

IS DANDAKARANYAM NOT SAFE FOR MAOISTS WILL THEY LEAVE CHHATTISGARH AND AOB IS THERE TEMPORARY BREAK TO NAXAL MOVEMENT MKS KMM

Maoist సంచలనం: ఉద్యమానికి విరామం - దండకారణ్యం సేఫ్ కాదా? -ఇక ఈశాన్యంలో ప్రధాన స్థావరం?

మావోయిస్టు పార్టీ

మావోయిస్టు పార్టీ

దాదాపు లక్ష కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన దండకారాణ్యంలో మావోయస్టులు ప్రత్యామ్నాయ పాలన కొనసాగిస్తూ ప్రభుత్వానికి సవాలుగా నిలిచారు. అయితే క్రమంగా ఆ ప్రాంతం చుట్టూ పోలీసుల పట్టు పెరగడం, అత్యవసర సప్లైని కూడా నిలిపేయగలడంతో నక్సల్స్ మనుగడ కష్టతరమైందని, ఉద్యామానికి తాత్కాలికంగా విరామం ఇవ్వనున్నారని సమాచారం. మావోయిస్టు ప్రధాన స్థావరాన్ని మధ్యభారతం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు తరలించబోతున్నారనీ తెలుస్తోంది..

ఇంకా చదవండి ...
  (G.Srinivasa Reddy, News 18, Khammam)
  దండకారణ్యం. దేశంలోనే దట్టమైన అడవులకు నిలయం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య ఉన్న ఈ అటవీ ప్రాంతం విస్తీర్ణం 92,200 చదరపు కిలో మీటర్లు కావడం విశేషం. ఇంతటి విశాలమైన ప్రాంతం కాబట్టే ఇక్కడ దృష్టి పెట్టిన మావోయిస్టులు, ఈ ప్రాంతంలోని అధిక సంఖ్యాకులైన ఆదివాసులను ఆకట్టుకుని ప్రభుత్వాలకు సవాల్‌ విసరగలిగారు. దశాబ్దాలుగా అటు కేంద్రం, ఇటు పలు ప్రభావిత రాష్ట్రాలు ఎంతగా ప్రయత్నాలు చేసినా మావోయిస్టులను నిలువరించలేకపోవడానికి కారణం ఈ ప్రాంతం భౌగోళికంగా అత్యంత క్లిష్టమైనది కావడమే.

  శతృదుర్భేద్యం..
  మనం కథల్లో వినినట్టు కాకులు దూరని కారడవులు.. చీమలు దూరని చిట్టడవులకు ఈ దండకారణ్యంలోని అబూజ్‌మడ్‌ కొండ ప్రాంతం నిలయం. దీంతోపాటుగా వందల కిలోమీటర్ల మేర విస్తరించిన తూర్పు కనుమలు, దండకారణ్యాన్ని శత్రు దుర్భేద్యంగా సహజసిద్ధంగా మలచిందని చెప్పొచ్చు. సుమారుగా ఉత్తరదక్షిణాలు ఐదొందల కిలోమీటర్లు, తూర్పు పడమరలు మూడొందల కిలోమీటర్ల మేర విస్తరించిందంటే ఈ అరణ్యం ఎంత విస్తారమైనదో అంచనా వేసుకోవచ్చు.

  శాటిలైట్ కెమెరాలకూ అందకుండా..
  దాదాపు నక్సల్బరీ ఉద్యమం నుంచి ఈ ప్రాంతంలో ఏదో ఒక మూలన ఉనికిని చాటుకున్న తీవ్రవాదం, అనంతర కాలంలో మావోయిస్టు ఉద్యమానికి కేంద్ర స్థానంగా మారింది. దేశంలో కార్యకలాపాలకు అబూజ్‌మ డ్‌ వేదికైంది. శాటిలైట్‌ కెమెరా కన్నులకు కూడా అందనంత దట్టంగా అల్లుకుపోయిన ఈ దండకారణ్యంలో పట్టు సంపాదించడమే మావోయిస్టు ఉద్యమం ఇన్నాళ్లు మనుగడ సాగించడానికి కారణమైందని చెప్పొచ్చు. పురాణ ఇతిహాసకాలంలోనూ ప్రస్తావన ఉన్న దండకారణ్యం దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తీవ్రవాదం, ఎన్‌కౌంటర్లు, మందుపాతరలు, రక్తపాతంతో ఎరుపెక్కింది. అయితే తాజా పరిణామాలతో ఈ ప్రాంతం తమకు సేఫ్‌జోన్‌ కాదని, ప్రస్తుతానికి ఖాళీ చేయనున్నట్టు వస్తున్న సంకేతాలు మావోయిస్టు పార్టీ ఉనికిపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది.

  ఆర్కే సహా అగ్రనేతల మృతి
  అవును ఇప్పుడు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో ఇది హాట్‌ టాపిక్‌. మావోయిస్టులు వీలైనంత త్వరలో తమ కార్యస్థానాన్ని మార్చుకోనున్నారన్న వార్తలు లీక్‌ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు దీనిపై సీరియస్‌గా దృష్టి సారించారు. ఇప్పటికే ప్రతికూల పరిస్థితుల మధ్య కుదేలైపోయిన మావోయిస్టు ఉద్యమానికి కరోనా వైరస్‌ రూపంలో సవాల్‌ ఎదురైంది. పలువురు సీనియర్లు, అగ్రనేతలు, సిద్ధాంతకర్తలు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కొద్ది రోజుల క్రితం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కే మరణం ఆ పార్టీని కోలుకోలేని దెబ్బ తీసింది.

  తర్వాతి టార్గెట్ హిడ్మానే
  దీనికితోడు ఉద్యమానికి వేగుచుక్కలా భావిస్తున్న మరో అగ్రనేత, పీపుల్స్‌ గెరిల్లా ఆర్మీ-1 కమాండర్‌ హిడ్మా కరోనా చికిత్స కోసం తెలంగాణలోని ఏటూరునాగారం పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఉండడంతో అతని వేటలో నిమగ్నమయ్యారు. ఈ వార్తతో ఉలిక్కిపడిన పోలీసులు ప్రత్యేక బలగాలతో గాలింపు ముమ్మరం చేశారు. దీనికితోడు ఇప్పటిదాకా మావోయిస్టులకు షెల్టర్‌జోన్‌గా, కార్యస్థానంగా, కేంద్రస్థానంగా పేరొందిన ఛత్తీస్‌ఘడ్‌, ఆంధ్ర ఒడిశా బోర్డర్‌లను ఖాళీ చేయనున్నట్టు సమాచారం. ఈ ప్రాంతంలో ఉన్న క్యాడర్‌ను మరో సురక్షిత స్థానానికి తరలించే యోచనలో కేంద్రకమిటీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

  ఈశాన్యం బాట పట్టనున్నారా?
  ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలు, ముఖ్య క్యాడర్‌ను, వ్యూహకర్తలను ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌కు తరలిరావాలని ఆదేశించినట్టు చెబుతున్నారు. కొంత విరామం, కఠినమైన శిక్షణ, వ్యూహ ప్రతివ్యూహాల్లో చురుకుదనం పెంచడం లాంటి కార్యక్రమాల్లో రాటుదేల్చడానికి అటువైపుగా రావాలని ఆదేశించినట్టు చెబుతున్నారు. దీంతో పాటు ప్రతికూల పరిస్థితుల్లో ఉద్యమానికి వ్యూహాత్మక విరామం అవసరమన్న భావనలోనూ కేంద్ర కమిటీ ఉన్నట్టు చెబుతున్నారు.

  కొత్త రిక్రూట్మెంట్లకు బ్రేక్
  దీన్లో భాగంగానే దశాబ్దాల పాటు తమకు తిరుగులేకుండా ఉన్న ప్రాంతాల్లో సైతం కార్యకలాపాలను నిలుపుదల చేసి, క్యాడర్‌లో స్థైర్యం నింపే కార్యక్రమానికి పూనుకున్నట్టు చెబుతున్నారు. వివిధ పరిస్థితుల కారణంగా కార్యకలాపాలు నిలిపేసి ఉనికే ప్రశ్నార్థకంగా మార్చుకున్న మావోయిస్టు పార్టీ ప్రస్తుతం ఆత్మరక్షణ పంథాలో ఉన్నట్టు చెబుతున్నారు. ఏడాదికి పైగా ఎలాంటి రిక్రూట్‌మెంట్లు లేకపోవడం, ఉద్యమంలోకి కొత్త రక్తం నింపలేకపోవడం, వరుస వైఫల్యాలు, అరెస్టులు, లొంగుబాట్లు, వ్యాధులు చుట్టుముట్టి ఉద్యమం నిర్వీర్యం అవుతున్న తరుణంలో విరామం ఇవ్వడమే సరైనదన్న దిశగా కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

  విరామమా? ఎత్తుగడలో భాగమా?
  దీనికితోడు గత కొద్ది నెలలుగా మావోయిస్టులకు అందుతున్న సరఫరా వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో పోలీసులు విజయం సాధించారు. మందులు, ఇతర చికిత్సలకు అవసరమైన పరికరాలు, నిత్యావసరాలు, డబ్బు సరఫరాపై నిఘాను తీవ్రతరం చేసిన పోలీసులు, వారపు సంతల్లో మకాం వేసి ఎవరు ఏమేం తీసుకుంటున్నారు..? మందులు ఎందుకు కొంటున్నారన్న సమాచారాన్ని సేకరించింది. దీంతో దీర్ఘకాలికంగా వారపు సంతలే సరఫరా మార్గాలుగా ఉన్న పరిస్థితి ఒక్కసారిగా మారింది. దీంతో గిరిజన గూడేలను ఆసరా చేసుకున్నా.. అక్కడా నిఘా పెరిగింది. ఇక ఊపిరి తీసుకోలేనంత నిర్బంధం ఎదురుకావడంతో ప్రస్తుతానికి విరామం తీసుకోవాలని కేంద్ర కమిటీ ఆదేశించినట్టు తెలిసింది. అయితే నిజానికి అబూజ్‌మడ్‌ లాంటి శత్రు దుర్భేద్యమైన ప్రాంతాలను సైతం ఖాళీ చేస్తారా.. లేక ఇదేమైనా పోరాట వ్యూహంలో భాగమా అన్న సందేహాలు సైతం లేకపోలేదు.
  Published by:Madhu Kota
  First published:

  Tags: Chhattisgarh, Maoist, Maoist RK

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు