IRCTC SRI RAMAYANA YATRA INDIAN RAILWAY BHARAT GAURAV TOURIST TRAIN START NEXT MONTH HERE IS COMPETE PACKAGE DETAILS SK
IRCTC Sri Ramayana Yatra: రైల్లో రామాయణ యాత్ర.. ఇండియాతో పాటు నేపాల్.. 18 రోజుల ట్రిప్.. ధర ఎంతంటే?
(ప్రతీకాత్మక చిత్రం)
Bharat Gaurav Tourist Train: భారత్ గౌరవ్ రైళ్ల శ్రేణిలోని మొదటి రైలు.. రామాయణ సర్క్యూట్‌లోని శ్రీరాముని జీవితానికి సంబంధించిన అన్ని ప్రదేశాలకు వెళ్తుంది. నేపాల్‌లోని జనక్‌పూర్‌లోని రామ్ జానకి ఆలయాన్ని కూడా ఈ ట్రిప్‌లో సందర్శించవచ్చు.
శ్రీరాముడి భక్తులకు భారతీయ రైల్వే (Indian Railways) శుభవార్త చెప్పింది. మొట్టమొదటి 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు (Bharat Gaurav Tourist Train) 'శ్రీ రామాయణ యాత్ర (Sri Ramayana Yatra)' వచ్చే నెలలోనే ప్రారంభం కానుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నిర్వహించే ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ఇండియా, నేపాల్‌ను కలుపుతుంది. మన దేశంలోని చారిత్రక ప్రదేశాల్లో పర్యటించేలా రైళ్లను నడుపనున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని మోదీ ప్రకటించారు. 'దేఖో అప్నా దేశ్' థీమ్‌తో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను నడపనున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగా మొట్ట మొదటి భారత్ గౌరవ్ రైలును జూన్ 21న ప్రారంభించనున్నారు. భారత్ గౌరవ్ రైళ్ల శ్రేణిలోని మొదటి రైలు.. రామాయణ సర్క్యూట్‌లోని శ్రీరాముని జీవితానికి సంబంధించిన అన్ని ప్రదేశాలకు వెళ్తుంది. నేపాల్ జనక్‌పూర్‌లోని రామ్ జానకి ఆలయాన్ని కూడా ఈ ట్రిప్‌లో సందర్శించవచ్చు.
రైలు ప్రత్యేకతలు:
భారత్ గౌరవ్ మొదటి రైలు జూన్ 21న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతుంది. 18 రోజుల పాటు యాత్ర ఉంటుంది. ఇది థర్డ్ క్లాస్ ఏసీ రైలు. మొత్తం 10 ఏసీ కోచ్‌లు ఉంటాయి. ఇందులో మొత్తం 600 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఈ టూరిస్ట్ రైలులో ప్యాంట్రీ కోచ్ సౌకర్యం ఉంటుంది. రైలులోనే ఆహార పదార్థాలను తయారుచేసి యాత్రికుల బెర్త్ వద్దే వడ్డిస్తారు. ఐతే కేవలం శాఖాహారం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ రైలులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు వంటి అదనపు సౌకర్యాలు ఉంటాయి.
రూట్ ఇదే:
ఢిల్లీ నుంచి బయలుదేరిన తర్వాత.. ఈ రైలు మొదట శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఆగుతుంది. ఇక్కడ శ్రీరామ జన్మభూమి ఆలయం, శ్రీ హనుమాన్ ఆలయం, నందిగ్రామ్‌లోని భారత్ మందిర్‌లను సందర్శిస్తారు. అనంతరం అయోధ్య నుంచి బీహార్‌లోని బక్సర్‌కు రైలు వెళ్తుంది. అక్కడ శ్రీ విశ్వామిత్ర ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత సీతా జన్మస్థలం ఉన్న సీతామర్హికి రైలు వెళ్తుంది. అనంతరం నేపాల్‌లోని జనక్‌పూర్‌లోని రామ్ జానకీ ఆలయాన్ని సందర్శిస్తారు. నేపాల్ నుండి తిరిగి వచ్చాక.. భారత్ గౌరవ్ రైలు తదుపరి స్టాప్ వారణాసి. ఈ రైల్వే స్టేషన్ నుంచి యాత్రికులను బస్సులో తీసుకెళ్లి కాశీలోని ప్రముఖ ఆలయాలన్నింటినీ చూపిస్తారు. అనంతరం శృంగవర్పూర్, చిత్రకూట్‌కు వెళ్తారు. చిత్రకూట్ నుంచి నేరుగా నాసిక్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత హంపి, రామేశ్వరం, కాంచీపురంలోని ఆలయాలను సందర్శిస్తారు. అక్కడి నుంచి తెలంగాణలోని భద్రాచలానికి వెళ్తారు. ఈ యాత్రలో ఇదే లాస్ట్ డెస్టినేషన్. భద్రాచలంలో దర్శనం పూర్తైన తర్వాత.. అక్కడి నుంచి రైలు తిరిగి ఢిల్లీకి చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
భారత్ గౌరవ్ రైలు రామాయణ యాత్ర కింద దాదాపు 8000 కిలోమీటర్ల ప్రయాణిస్తుంది. మొత్తం 18 రోజుల ప్రయాణానికి రూ. 62370/- చార్జీని నిర్ణయించారు. మొత్తం ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. 3, 6, 9, 12, 18 , 24 నెలల వాయిదాలలో పూర్తి చేయవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణికులకు రైలు ప్రయాణంతో పాటు రుచికరమైన శాఖాహారం, బస్సుల్లో పర్యాటక ప్రదేశాల పర్యటన, ఏసీ హోటళ్లలో వసతి, గైడ్, బీమా తదితర సౌకర్యాలను కల్పిస్తారు.
హంపి- అంజనాద్రి కొండ, విరూపాక్ష దేవాలయం, విఠల్ దేవాలయం
రామేశ్వరం - రామనాథస్వామి దేవాలయం, ధనుష్కోటి
కాంచీపురం - విష్ణు కంచి, శివ కంచి, కామాక్షి అమ్మన్ ఆలయాలు
భద్రాచలం - శ్రీ సీతారామ స్వామి దేవాలయం, అంజనీ స్వామి దేవాలయం
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.