మన దేశంలో నిత్యం ఎన్నో రైలు ప్రమాద ఘటనలు (Train Accidents) జరుగుతుంటాయి. పట్టాలు దాటుతుండగా కొందరు... కదులుతున్న రైలు నుంచి పడిపోయి మరికొందరు.. ప్రమాదాల బారినపడుతుంటారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో కూడా ఓ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న రైలు నుంచి ఓ యువకుడు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఆ విషయం తెలిసి రైలు అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. కానీ అప్పటికే రైలు 2 కి.మీ. ముందుకు వెళ్లిపోయింది. అయినప్పటికీ మరుక్షణం ఆలోచించకుండా... అదే రూట్లో వెనక్కి వెళ్లారు. తీవ్ర గాయాలతో పట్టాలపై పడిఉన్న బాధితుడిని సకాలంలో ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం తపతి గంగా ఎక్స్‌ప్రెస్ (Tapti Ganga Express)లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Helicopter: మరో విషాదం.. కుప్పకూలీన హెలికాప్టర్.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం..
యూపీలోని మీర్జాపూర్ జిల్లా వింధ్యాచల్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల దీపక్ .. పని నిమిత్తం గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లేందుకు తన మామతో కలిసి తపతి గంగా ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. రైలు కొద్ది దూరం వెళ్లాక.. తన సీటులో నుంచి బయటకు వచ్చి.. డోర్ వద్ద కూర్చున్నాడు. ఆ తర్వత మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలోని చర్ఖేడా స్టేషన్ సమీపంలో హఠాత్తుగా రైలు నుంచి ట్రాక్‌పై పడిపోయాడు దీపక్. యువకుడు రైలు నుంచి కిందపడిపోయాడని తెలిసి.. ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. రైల్వే అధికారులు సకాలంలో స్పందించారు. అతడి ప్రాణాలను కాపాడేందుకు... మళ్లీ అదే రైలును వెనక్కి పంపించారు. దీపక్ కింద పడిపోయాక.. రైలు దాదాపు రెండు కి.మీ. ముందుకెళ్లింది. ఆ తర్వాత మళ్లీ వెనక్కి తీసుకెళ్లి.. తీవ్ర గాయాలతో రైల్వే ట్రాక్‌పై పడి ఉన్న దీపక్‌ని ట్రైన్లో ఎక్కించారు. ఆ తర్వాత హర్దా రైల్వే స్టేషన్లో దింపారు. అక్కడి నుంచి హర్దా జిల్లా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం భోపాల్‌కు షిప్ట్ చేశారు. ప్రస్తుతం దీపక్ పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు చెప్పారు.
Shocking: బాలికపై అమానుషం.. 70 ఏళ్ల ముసలోడు, మరో ఇద్దరితో కలిసి నెలల తరబడి..
సాధారణంగా రైళ్లలో ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతుంటాయి. కదులుతున్న రైలు నుంచి కిందపడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తరహా ప్రమాదాలు జరిగినప్పుడు రైళ్లు కాసేపు ఆగుతాయి. మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో .. కాసేపయ్యాక తిరిగి బయలుదేరుతాయి. కానీ హర్దాలో మాత్రం.. ముందుకు వెళ్లిన రైలు... మళ్లీ వెనక్కి వచ్చింది. రైలు వెనక్కి వచ్చి.. దీపక్‌ను సకాలంలో ఆస్పత్రికి చేర్చడం వల్లే.. అతడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని అధికారులు తెలిపారు. గాయపడిన బాధితుడి కోసం రైలు వెనక్కివెళ్లిన ఘటన బహుశా ఇది మొదటి సారి కావచ్చని ప్రయాణికులు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railways, Trains