INTERNET SHUTDOWN AND 4 DAY CURFEW IMPOSED IN AMRAVATI AMID FRESH VIOLENCE IN MAHARASHTRA RIOTS MKS
Amravati : అమరావతిలో ఇంటర్నెట్ నిలిపివేత -4రోజుల కర్ఫ్యూ -భారీగా బలగాలు -కేంద్రం ఆందోళన
అమరావతిలో దుకాణంలో మంటలు ఆర్పుతోన్న పోలీసులు (శనివారం నాటి చిత్రం)
ఈశాన్య రాష్ట్రం త్రిపురలో చోటుచేసుకున్న మత ఘర్షణల వేడి పశ్చిమాన ఉన్న మహారాష్ట్రలో అగ్గిరాజేసింది. రెండు వర్గాలకు చెందిన సంస్థలు పోటాపోటీగా బంద్, ర్యాలీలు నిర్వహించి, రాళ్లు రువ్వుకోవడంతో ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న అమరావతిలో నాలుగురోజులు కర్ఫ్యూ విధించడంతోపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు..
ఈశాన్య రాష్ట్రంలో చోటుచేసుకున్న మత ఘర్షణల వేడి పశ్చిమమధ్య భాగంలోని మరో రాష్ట్రంలో అగ్గిరాజేసింది. అల్లర్లు, విధ్వంసాన్ని అడ్డుకునేందకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాలను మోహరించి, కర్ఫ్యూ విధించగా, పుకార్లు నమ్మరాదంటూ కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. ఈశాన్య రాష్రమైన త్రిపురలో మైనార్టీలపై దాడులను నిరసిస్తూ మహారాష్ట్రలోని పలు ముస్లిం సంస్థలు శుక్రవారం బంద్ చేపట్టడం, ముస్లింల బంద్ ను నిరసిస్తూ శనివారం నాడు కాషాయశ్రేణులు ఆందోళనలకు దిగడం, ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడం తదితర ఘటనలతో పలు జిల్లాల్లో వాతావరణం అట్టుడికి పోయింది.
త్రిపురలో మైనార్టీలను నిరసిస్తూ మహారాష్ట్రలో ముస్లిం సంస్థ చేపట్టిన బంద్ నేపథ్యంలో అమరావతి, నాసిక్, నాందేడ్ జిల్లాల్లో ఘర్షణలు, రాళ్లు రువ్వుకోవడం జరిగింది. దీనికి ప్రతిగా శనివారం అమరావతిలో వందలాది మంది కాషాయ జెండాలు పట్టుకొని రాజ్‌కమల్ చౌక్ దగ్గర ప్రదర్శన నిర్వహించి, అక్కడి షాపులపై రాళ్లు రువ్వారు. వరుసగా రెండు రోజుల్లోనూ అమరావతిలో పదుల సంఖ్యలో దుకాణాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి మరింత దిగజారకుండా అధికారులు అమరావతి జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధించడంతోపాటు పుకార్లు వ్యాపించకుండా ఇంటర్నెట్ సేవలనూ నిలిపేశారు.
అమరావతి జిల్లాలో శనివారం నుంచి నాలుగు రోజులపాటు కర్ఫ్యూ అమలులో ఉంటుందని, పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాతే ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. అమరావతి జిల్లాతోపాటు నాందేడ్, నాసిక్, యావత్మల్ తదితర ప్రాంతాల్లోనూ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరువర్గాలు సంయమనం పాటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే, హోంశాఖ మంత్రి దిలీప్ వల్సే పాటిల్ విజ్ఞప్తి చేశారు. కాగా,
మహారాష్ట్రలోని అమరావతిలో అల్లర్లు చోటుచేసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర హోం శాఖ ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో.. త్రిపురలో మసీదు కూల్చివేశారనే ప్రచారం అవాస్తవమని, లేనిపోని ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళనకు గురికావొద్దని తెలిపింది. అమరావతి సహా ఉద్రిక్తత నెలకొన్న ప్రాంతాల్లో నాలుగు కంపెనీల మహారాష్ట్ర స్టేట్ రిజర్వ్ పోలీస్ బలగాలు, అదనంగా మరో 125 మంది అధికారులను మోహరింపజేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.