కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అన్ని రంగాల ప్రజలు తమ వంతుగా ఏమేం వస్తాయన్నదాని కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసింది. ప్రజల జీవనోపాధికి నష్టం కలిగింది. లక్షలాది మంది సగటు జీవులు ఉద్యోగాలను కోల్పోయారు. వలసకూలీల జీవనం కకావికలం అయింది. ప్రైవేటు రంగం పైనే కాదు, ప్రభుత్వ రంగం పై కూడా కరోనా ప్రభావం విపరీతంగా పడింది. ప్రస్తుతం కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో వస్తున్న బడ్జెట్ పై దేశవ్యాప్తంగా ప్రజల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అయితే ఈ సమయంలోనే బడ్జెట్ గురించి నెటిజన్లు ఆసక్తికరమైన విషయాలను వెతుకుతున్నాను. బడ్జెట్ ను ఎలా రూపొందిస్తారు? ఆదాయం ఎలా వస్తుంది.? వంటి అనేక విషయాలను తెలుసుకునేందుకు సెర్చ్ చేస్తున్నారు. ఇదే సమయంలో మన భారత దేశ తొలి బడ్జెట్ ను ఎవరు ప్రవేశ పెట్టారు? అనే విషయం గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
భారత దేశానికి స్వాంతంత్ర్యం వచ్చిన తర్వాత 1947-1948 ఆర్థిక సంవత్సరానికి గాను ఆనాటి పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఆర్కే షన్ముఖం చెట్టి 1947వ సంవత్సరం నవంబర్ 26న ఈ బడ్జెట్ ను తొలిసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ పూర్తి ఏడాది కాలానికి కాకపోవడం విచిత్రం. 1947వ సంవత్సరం ఆగస్టు 15 నుంచి మరుసటి ఏడాది 1948 మార్చి 31 వరకు మాత్రమే ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం గమనార్హం. కేవలం ఏడున్నర నెలల కాలానికే బడ్జెట్ ను రూపొందించి పార్లమెంట్ ఆమోదం తీసుకోవడం జరిగింది. 171.15 కోట్ల రూపాయల మొత్తంతో ఈ బడ్జెట్ ను రూపొందించారు.
ఇదిలా ఉండగా, మధ్యతరగతి వర్గం, సామాన్య ప్రజలు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు, వైద్య రంగం.. ఇలా ఒకటేమిటి అన్ని రంగాలు కూడా తమ వాటాగా బడ్జెట్ లో ఏం లభించబోతోందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అదే సమయంలో దేశంలోని ప్రధాన రాష్ట్రాలు కూడా బడ్జెట్ కేటాయింపుల్లో తమకు లభించబోయే కేటాయింపుల గురించి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంత రీతిలో ఈ బడ్జెట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి నిర్మలా సీతారామన్ ఏఏ వర్గాలపై వరాల జల్లు కురిపిస్తారో తెలియాలంటే పార్లమెంట్ సెషల్ ప్రారంభమయ్యే దాకా ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2021, Indian parliament, Narendra modi, Nirmala sitharaman, Union Budget 2021