భారత నౌకాదళం రోజు రోజుకూ బలం పుంజుకుంటోంది. భారత దళంలో మరో అమ్ముల పొది చేరబోతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక చేరేందుకు రంగం సిద్ధమైంది. వి.సి.11184 పేరుతో నిర్మాణమై ధ్రువ్ ఇప్పుడు భారత బలంగంలో చేరుతోంది. ప్రయోగాత్మకంగా విధులు కొనసాగిస్తున్న ఈ సముద్ర నిఘా యుద్ధ నౌకకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సాధారణ క్షిపణులతో పాటు, అణు క్షిపణులను ఇట్టే క్షణాల్లో గుర్తు పట్టడం దీని ప్రధాన ప్రత్యేకత.
భారతదేశంలోని షిప్యార్డ్లన్నింటిలో ఇప్పటివరకు తయారైన యుద్ధనౌకలతో పోల్చితే తాజా యుద్ధనౌక అతిపెద్దదిగా కూడా రికార్డు సృష్టించింది. అందుకే దీనిని బాహుబలితో పోలుస్తారు. 2015వ సంవత్సరంలో మొదలుపెట్టి 2020వ సంవత్సరం అక్టోబరు నాటికి పూర్తిచేశారు. రియర్ అడ్మిరల్ ఎల్.వి.శరత్‌బాబు షిప్‌యార్డ్ సీఎండీగా ఉన్న కాలంలో అత్యధికశాతం నిర్మాణం పూర్తైంది. నిర్మాణానికి సుమారు 750 కోట్ల రూపాయలు వ్యయమైనట్లు అంచనా వేస్తున్నారు.
విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో అత్యంత రహస్యంగా ఐదు సంవత్సరాలపాటు శ్రమించి దీనిని తయారు చేశారు. గత సంవత్సరం అక్టోబరు నుంచి దీన్ని వినియోగిస్తున్నారు. నూతన యుద్ధనౌకలకు సాధారణంగా జరిగే ప్రారంభోత్సవ వేడుకలు ఏవీ దీనికి జరగలేదు. కొద్ది నెలల్లో అధికారికంగా నౌకాదళంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. దీంతో భారత ఆయుధం బలం మరింత పెరగనుంది.
ఈ నౌక బరువు 15 వేల టన్నులు ఉంటుంది. 14 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే సదుపాయం కూడా ఇందులో ఉండడం విశేషం. ఈ యుద్ధనౌకను డి.ఆర్.డి.ఒ. శాస్త్రవేత్తలు, నౌకాదళ ఇంజినీరింగ్ నిపుణులు ఎంతో శ్రమించి రూపొందించారు. ప్రధాని కార్యాలయంలోని జాతీయ భద్రతా సలహాదారు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండే నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్తలు కూడా నూతన నిఘా యుద్ధనౌక నిర్మాణంలో భాగస్వాములయ్యారు. డి.ఆర్.డి.ఒ., ఎన్.టి.ఆర్.ఒ., నౌకాదళ శాస్త్రవేత్తలు సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ సాంకేతిక నిపుణులు ఈ .నౌకను నిర్మించారు.
పాకిస్తాన్, చైనా తదితర దేశాల్లోని భూభాగాల్లోనుంచి క్షిపణులను ప్రయోగించినా వాటి ప్రయాణమార్గాల్ని దీని ద్వారా ట్రాక్ చేయగలరు. అవి ఏ లక్ష్యం దిశగా వెళ్తున్నాయన్న అంశాన్ని ముందుగా అంచనా వేయగలరు. మార్గమధ్యలోనే శత్రుదేశాల క్షిపణులను ధ్వంసం చేయడానికి అవసరమైన కీలక సమాచారాన్ని తాజా యుద్ధనౌకలోని నిపుణులు వందశాతం కచ్చితత్వంతో అందించగలుగుతారు. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ ధ్రువ్ సొంతం
సాధారణ క్షిపణులతోపాటు అణుక్షిపణులను కూడా గుర్తించగలగడం దీని ప్రత్యేకత. వాయువేగంతో దూసుకొచ్చే క్షిపణులను సకాలంలో గుర్తించకపోతే వాటి కారణంగా జరిగే విధ్వంసం భారీగా ఉంటుంది. ఒక్క సెకను ఆలస్యం జరిగినా ఎంతో నష్టం జరుగుతుంది. ఆయా అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని శాస్త్రవేత్తలు ఆధునిక సొబగులు అద్దారు. దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన నిఘా నౌకలోని పరిజ్ఞానాలు ప్రపంచంలోని నాలుగుదేశాల్లో మాత్రమే ఉండడం గమనార్హం. ఇప్పుడు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ దేశాల సరసన భారత్ కూడా చేరినట్లైంది. అధునాతన సముద్ర నిఘా వ్యవస్థలున్న ఐదో దేశంగా భారతదేశం గుర్తింపు పొందినట్లైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Indian Navy, Navy seal, Visakha, Visakhapatnam, Vizag