Home /News /national /

INDONESIAN WOMAN LOVE MARRIAGE WITH INDIAN MAN LEADS TO PUT HER IN JAIL HERE IS THE REASON HSN

ఓ భారతీయుడితో విదేశీ మహిళ ప్రేమ పెళ్లి చివరకు ఆమెను జైలు పాలు చేసింది.. ఇంతకీ అసలేం జరిగిందో తెలిస్తే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ ఇండోనేషియా మహిళ ఓ భారతీయ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. చివరకు జైలు పాలయింది. అదేంటీ, ప్రేమ పెళ్లి చేసుకుంటే అరెస్ట్ చేస్తారా? అని ఆశ్చర్యపడిపోతున్నారేమో. అసలు కథేంటో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.

    ఓ ఇండోనేషియా మహిళ ఓ భారతీయ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. చివరకు జైలు పాలయింది. అదేంటీ, ప్రేమ పెళ్లి చేసుకుంటే అరెస్ట్ చేస్తారా? అని ఆశ్చర్యపడిపోతున్నారేమో. ఆమె ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతోనే కలిసి ఉండేందుకు చేసిన నిర్వాకాలే ఆ భార్యాభర్తలిద్దరినీ కటకటాలపాలు చేశాయి. టూరిస్ట్ వీసాపై భారత్ కు వచ్చిన ఆమెకు అప్పటికే పెళ్లయి భర్త కూడా ఉన్నాడు. అతడితో విబేధాలు నడుస్తూ విడాకుల ప్రక్రియ కొనసాగుతోంది. భారత్ లో పరిచయమయిన ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతడు కూడా ఆమెను విపరీతంగా ప్రేమించాడు. కలిసి జీవిద్దామనుకున్నారు. ఈ క్రమంలోనే భారతీయ భర్తతో కలిసి ఉండేందుకు భారత్ కు చెందిన మహిళగా ఓటరు కార్డు, ఆధార్ కార్డు వంటి వాటిని అక్రమ దారిలో సంపాదించారు. ఒకటి కాదు రెండు కాదు ఆరేళ్లపాటు సజావుగానే కాపురం చేశారు. కానీ ఒకే ఒక్క మిస్టేక్ తో అడ్డంగా దొరికిపోయారు.

    గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని బాగా డబ్బున్న వాళ్లు నివసించే జాస్పూర్ పరిధిలో సందీప్ జోషీ, తినీ సందీప్ జోషీ అనే జంట నివసిస్తోంది. కొన్నాళ్లుగా ఓ అపార్ట్మెంట్ లో వాళ్లు నివసిస్తున్నారు. ఇటీవల ఆమె పాస్ పోర్టు కు దరఖాస్తు చేసింది. ఆ పాస్ పోర్ట్ వెరిఫికేషన్ కోసం ఆధార్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికెట్ వంటి వాటిని జత చేసింది. అయితే పాస్ పోర్ట్ ఎక్వయిరీలో భాగంగా ఆమెకు అప్పటికే ఇండోనేషియన్ పాస్ పోర్ట్ ఉందని వెలుగులోకి వచ్చింది. ఆమె భారతీయ పౌరురాలిగా నకిలీ సర్టిఫికెట్లను సంపాదించిందని తెలిసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెతోపాటు ఆమె భర్తను కూడా అరెస్ట్ చేసి విచారణ ప్రారంభిస్తే ఓ లవ్ స్టోరీయే బయటపడింది.

    ఇండోనేషియాకు చెందిన నీలు సుహాతిని కేత్వాత్ రేడియా అనే 40 ఏళ్ల మహిళ 2013లో టూరిస్ట్ వీసాపై చెన్నైకి వచ్చింది. అక్కడే ఓ స్పా సెంటర్ లో సందీప్ జోషీ అనే 53 ఏళ్ల వ్యక్తిని కలిసింది. ఆమె స్పా సెంటర్లో అతడికి మసాజ్ చేసింది. ఇద్దరూ పరస్పరం ప్రేమలో పడ్డారు. అయితే ఆమె ఓ ఇండోనేషియా మహిళ అనీ, మరో 15 రోజుల్లోనే తిరిగి వెళ్లిపోబోతోందని మాటల్లో తెలిసింది. ఇద్దరూ ఫోన్ నెంబర్లను ఇచ్చి పుచ్చుకున్నారు. అప్పటికే నీలుకు పెళ్లయి భర్తతో విబేధాలు ఉన్నాయి. దీంతో 2014వ సంవత్సరంలో సందీప్ కోసం అహ్మదాబాద్ కు వచ్చింది. అక్కడే ఓ అపార్ట్మెంట్ లో ఇద్దరూ కలిసి ఉండటం ప్రారంభించారు. కొన్నాళ్లకు ఇద్దరూ ఓ గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు. సందీప్ బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్కులు చేస్తుంటాడు. బాగానే సంపాదిస్తుంటాడు.

    సందీప్ తో పెళ్లి జరిగాక, నీలు తన పేరును తినీ సందీప్ జోషీగా మార్చుకుంది. అక్రమ మార్గాలను ఉపయోగించి మారు పేరుతో ఓటరు కార్డు, ఆధార్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికెట్ పొందారు. భారతీయ పౌరురాలిగానే ఆరేళ్ల పాటు చెలామణీ అయింది. అయితే ఇటీవల ఇండోనేషియాలోని నీలు తల్లిదండ్రుల ఆరోగ్యం విషమించింది. వారిని చూడాలని ఆమెకు అనిపించింది. దీంతో ఆమె భారతీయ పౌరురాలిగానే పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకుంది. ఆ సమయంలో అక్రమ మార్గాల్లో పొందిన ఓటరు కార్డు, ఆధార్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికెట్ ను జతచేసింది. అయితే పోలీసుల వెరిఫికేషన్లో ఆమెకు అప్పటికే ఇండోనేషియా పాస్ పోర్టు ఉందని తేలింది. ఓ ఇండోనేషియా పౌరురాలు అక్రమంగా ఇన్నేళ్లపాటు భారత్ లో ఉండటం, అదే సమయంలో అక్రమ మార్గాల్లో పత్రాలను సంపాదించడంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: E-passport, Illegal affair, India, Love marriage, Passport

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు