ఎన్నికల వ్యవస్థలో సంచలన మార్పులు -దేశంలోనే తొలిసారి ఖమ్మంలో -Mock e-voting ఫలితాలివే..

ఖమ్మంలో మాక్ ఈ-ఓటింగ్

దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి ‘ఆన్ లైన్ ఓటింగ్’ అంశం చర్చకు వస్తుంది. అత్యధిక జనాభా, అందులోనూ అక్షరాస్యత అంత గొప్పగాలేని భారత్ లో ఈ-ఓటింగ్ సాధ్యాసాధ్యలను పరిశీలించేందుకు ఎన్నికల సంఘం పైలట్ ప్రాజెక్టులు చేపట్టింది. దేశంలోనే తొలిసారి ఖమ్మం సిటీలో పూర్తిగా స్మార్ట్ ఫోన్లతో మాక్ ఈ-ఓటింగ్ నిర్వహించింది. దాని ఫలితాలు, ప్రక్రియపై అధికారులు చెప్పిన వివరాలివి..

  • Share this:
(G. Srinivasa Reddy, News 18, Khammam)
మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను కూడా అప్ డేట్ చేయాలని, అధిక జనాభా ఉన్న భారత్ లో ఆన్ లైన్ ఓటింగ్ కు అనుమతివ్వాలనే వాదన నెట్టింట, బయటా చాలా బలంగా వినిపిస్తుంది. సదరు డిమాండ్లకు అనుగుణంగా, ఆన్ లైన్ ఓటింగ్ విధానాన్ని తెస్తే ఎలా ఉంటుంది? అనే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం సైతం ప్రయోగాలకు సిద్ధమైంది. అందులో భాగంగా దేశంలో తొలిసారి పూర్తిగా స్మార్ట్ ఫోన్ ఆధారిత మాక్ ఈ-ఓటింగ్ పైలట్ ప్రాజెక్టును ఖమ్మం జిల్లాలో అమలు చేసింది. జిల్లా కేంద్రమైన ఖమ్మం సిటీలో బుధవారం నాడు మాక్ ఈ-ఓటింగ్ జరగ్గా, వాటి ఫలితాలను ఖమ్మం మున్సిపల్‌ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి గురువారం వెల్లడించారు...

దేశంలోనే తొలిసారి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకొనేలా ఖమ్మంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన మొబైల్‌ మాక్‌ ఈ-ఓటింగ్‌ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసినట్టు మున్సిపల్ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి వెల్లడించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ్ర-పోలింగ్ నిర్వహించారు. మొత్తం 10వేల మంది (స్మార్ట్ ఫోన్లున్న) ఓటర్లను ఈసీ టార్గెట్ చేసినప్పటికీ, మాక్‌ ఓటింగ్‌కు 3,830 మంది మాత్రమే పేర్లు నమోదు చేసుకున్నారు. తీరా ఓటింగ్ నాడు అందులో 2,128 మంది మాత్రమే (67 శాతం) మంది మాత్రమే ప్రత్యేక మొబైల్‌ యాప్‌ ద్వారా ఓటు వేశారని కమిషనర్ చెప్పారు. అయితే, ఈ-ఓటింగ్ ప్రక్రియపై ఓటర్లు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారని, 90% మంది ‘గుడ్‌’ అని, 70% మంది ‘ఎక్సలెంట్‌’ అని ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చారని కమిషనర్ తెలిపారు. దీనికి సంబంధించిన పలు ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలివి..

ప్రశ్న- అసలు ఏంటి ఈ యాప్‌..?
జవాబు- ఈ- ఓటింగ్‌ యాప్‌ అనేది ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని ఆసరా చేసుకుని ఎక్కడి నుంచి అయినా ఓటు హక్కు వినియోగించుకునే ఓ సదుపాయం. ఏ నియోజకవర్గానికి చెందిన ఓటరు అయినా ఎక్కడ ఉన్నా, భౌతికంగా ఓటింగ్‌లో పాల్గొనకపోయినా, ఎక్కడి నుంచి అయినా ఓటు వేసే సదుపాయం ఇది.

ప్రశ్న- ఈ యాప్‌ను ఎవరు నిర్వహిస్తారు..? దీనికి ఉన్న విశ్వసనీయత ఎంత..?
జవాబు- ఈ-ఓటింగ్‌ యాప్‌ను ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఐటీ సిడాట్‌ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించింది. ఐటీ రంగంలో మంచి పేరున్న ఐటీ సీడాట్‌కు ఈ రంగంలో మంచి పేరుంది.

ప్రశ్న- ఈ-ఓటింగ్‌ను ఎక్కడ ప్రయోగాత్మకంగా పరీక్షించారు..?
జవాబు- పైలట్‌ ప్రాజెక్టు కింద ఖమ్మం మునిపిసల్‌. కార్పోరేషన్‌లో పరీక్షించారు. కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి చొరవ చూపి దీన్ని విజయవంతం చేశారు.
అక్టోబరు 8వ తేదీ నుంచి 18 వరకు దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని ప్రచారం నిర్వహించారు. ప్రజల్లో దీనిపై చర్చ జరిగింది.

ప్రశ్న- ఈ-ఓటింగ్‌ విధానంలో ఆశించిన లక్ష్యం ఏంటి.? ఫలితం ఎలా ఉంది.
జవాబు- ఈ-ఓటింగ్‌ విధానంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఖమ్మంలో 10 వేల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్న లక్ష్యంగా పెట్టుకోగా, అది గడువు ముగిసే నాటికి 38.3 శాతం అంటే 3,830 మంది మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

ప్రశ్న- పోలింగ్‌ అనుభవం ఏంటి?
జవాబు- రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారిలో 55.56 శాతం మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. మొత్తం 2,128 ఓట్లు పోలైయ్యాయి.

ప్రశ్న- మాక్‌ ఓటింగ్‌ ఎలా నిర్వహించారు?
జవాబు- మొబైల్‌ యాప్‌ ద్వారా నిర్వహించిన ఈ-ఓటింగ్‌లో అధికారులు ఆల్ఫా, బీటా, గామా, నోటా గుర్తులతో నమూనా బ్యాలెట్‌ను రూపొందించారు. బుధవారం నాడు పోలింగ్‌ ముగియగా, గురువారం కౌంటింగ్‌ జరపనున్నారు.

ప్రశ్న- ఇప్పటికే ఈవీఎంల పైన పలు సందేహాలు లేవనెత్తుతున్న తరుణంలో ఈ-ఓటింగ్‌ యాప్‌ ఫలితాలను ఇస్తుందా..?
జవాబు- మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ఓటర్లు పనిచేసే ప్రదేశం నుంచే ఓటు వేసే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి యాప్‌లు ఉపయోగంగా ఉంటాయి. ముఖ్యంగా యూత్‌ ఇలాంటి సదుపాయాన్ని సమర్థంగా ఉపయోగించుకుంటుంది.

ప్రశ్న - ఈఓటింగ్ విధానంలో తలెత్తిన అతిపెద్ద సమస్య ఏంటి?
జవాబు -ఈ-ఓటింగ్‌ కోసం 10 వేల లక్ష్యానికన్నా ఎక్కువగానే అంటే 14,804 మందికి పైగా రిజిస్ట్రేషన్‌ కోసం ప్రయత్నించారు. కానీ ఆధార్‌ లింక్‌ సమస్య తలెత్తడంతో కేవలం 3,830 మంది మాత్రమే యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోగలిగారు. మొత్తానికి ఓటర్ల నుంచి సానుకూలంగానే ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది ఇది ఒక మంచి ప్రయత్నం.
Published by:Madhu Kota
First published: