Special Berth For Children In Trains : ఇప్పటి వరకూ రైళ్లలో కొత్త కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ చంటి పిల్లలతో ప్రయాణించే తల్లుల కోసం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. భారతీయ రైళ్లలో పెద్ద సంఖ్యలో బాలింతలు, చంటిపిల్లలు ఉన్న తల్లలు ప్రయాణిస్తుంటారు. చంటి పిల్లలతో రైళ్లలో ప్రయాణించేటప్పుడు తల్లులు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒక బెర్త్ ఇద్దరికి సరిపోదు. వారిని వేరే బెర్త్‌పై పడుకోబెట్టలేరు. దాంతో పిల్లల కోసం తల్లులే ఎలాగోలా సర్దుకుపోతుంటారు. అయితే ఇలాంటి చంటిబిడ్డలున్న తల్లుల కోసం రైల్వే శాఖ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. రైలులో ప్రయాణించే సమయంలో చంటిబిడ్డలున్న తల్లులకు సీటు ఇబ్బంది లేకుండా బేబీ బెర్త్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఇన్నాళ్లకు తొలిసారిగా నార్నర్ రైల్వే ఇంజనీర్లు ఈ బేబీ బెర్త్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు.
రైలులో ప్రయాణించే సమయంలో చంటిబిడ్డలున్న తల్లులకు సీటు ఇబ్బంది లేకుండా బేబీ బెర్త్‌లను అందుబాటులోకి తెచ్చారు చిన్న పిల్లలు పడుకోవడానికి రైలులో ప్రత్యేకంగా బేబీ బెర్త్ లను ఏర్పాటు చేశారు నార్తర్న్ రైల్వే డివిజన్ అధికారులు. లోయర్ బెర్త్ పక్కన ఫోల్డబుల్ బేబీ బెర్త్‌ను రూపొందించారు. ఈ సౌకర్యాన్ని లక్నో మెయిల్‌లో తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. మదర్స్ డే సందర్భంగా నార్తర్న్ రైల్వే డివిజన్ ఈ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం విశేషం. దీంతో ఇప్పుడు తల్లులు బేబీ బెర్త్ సాయంతో బుజ్జాయిలను తమ పక్కనే సురక్షితంగా పడుకోబెట్టొచ్చు. లక్నో- ఢిల్లీ డివిజన్ల సమన్వయంతో.. లక్నో మెయిల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని త్రీ టైర్ బీ4 కోచ్‌లో ఈ బెర్త్‌లను పైలట్ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేశారు. ఇక్కడ మంచి స్పందన వస్తే ఈ సౌకర్యాన్ని ఇతర రైళ్లలోకి, ఇతర డివిజన్లలోకి విస్తరించేలా యోచిస్తున్నామని అధికారులు తెలిపారు.
కొత్తగా ప్రవేశపెట్టిన ఈ బేబీ బెర్త్ ఫోటోలను లక్నో మెయిల్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. తల్లులు తమ బిడ్డలతో సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు ఒక బేబీ బెర్త్‌ను ప్రవేశపెట్టామని, ఏర్పాటు చేసిన బేబీ సీటు మడతపెట్టి ఉంటుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
లక్నో డివిజన్ డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ అతుల్ సింగ్ మాట్లాడుతూ.. బేబీ బెర్త్‌ను మెయిన్ లోయర్ బెర్త్‌తో జతచేశాం. అవసరం లేనప్పుడు దీన్ని లోయర్ బెర్త్ కిందికి మడతపెట్టొచ్చు. దీన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సులభం అని తెలిపారు. 770 మి.మీల పొడవు, 255 మి.మీల వెడల్పు, 76.2 మి.మీల ఎత్తు కలిగిన ఈ బేబీ బెర్త్‌కు శిశువును సురక్షితంగా పట్టి ఉంచడానికి పట్టీలూ ఉన్నాయని తెలిపారు. ఇదిలా ఉండగా రైల్వే శాఖ, జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో మొట్టమొదటిసారిగా డిజిటల్ లాకర్‌ను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల లగేజీకి భద్రతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం నాలుగు అంకెల కోడ్ ఉపయోగించి లాకర్లను తెరవవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railway, Indian Railways