కరోనాతో తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాధలైన పిల్లలకు మంచి రోజులు.. ఆ చట్టంలో మార్పులు..

ప్రతీకాత్మక చిత్రం

Child Adoption:పిల్లల దత్తత ఆర్డర్లపై జిల్లా మెజిస్ట్రేట్​లు సంతకాలు చేయవచ్చు. దత్తతను ఆమోదించవచ్చు. దీనిద్వారా దత్తత ప్రక్రియ త్వరగా మొదలుకానుంది.

  • Share this:
కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు. వారిలో కొందరిని బంధువులు చేరదీశారు. ఆస్తిపాస్తులు ఉన్నవారి సంగతి సరే. మరి ఏమీ లేని పిల్లల సంగతి ఏంటి? అత్తెసరు బతుకీడ్చే అలాంటి పిల్లలకు దిక్కెవరు. అలాంటి వారికి అనుకూలంగా ఉండేలా కేంద్రం కొత్తగా చట్టంలో మార్పులు చేసింది.  పిల్లలను దత్తత (అడాప్షన్​) తీసుకోవాలనుకుంటున్న వారికి శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రక్రియ వేగవంతం అయ్యేలా చట్టానికి సవరణలు చేసింది. అలాగే బాలల సంరక్షణ కోసం నిబంధనలను పటిష్టం చేసింది. ఇందుకు ఉద్దేశించిన జువైనల్ జస్టిస్​ (కేస్ అండ్​ ప్రొటెక్షన్ ఆఫ్​ చైల్డ్) సవరణ బిల్లు- 2021కు రాజ్యసభ తాజాగా ఆమోదం తెలిపింది. దీని ప్రకారం, ఇప్పుడు పిల్లల దత్తత ఆర్డర్లపై జిల్లా మెజిస్ట్రేట్​లు సంతకాలు చేయవచ్చు. దత్తతను ఆమోదించవచ్చు. దీనిద్వారా దత్తత ప్రక్రియ త్వరగా మొదలుకానుంది. అలాగే ఈ బిల్లులో భాగంగా బాలల హక్కులను పరిక్షించే అంశాలను కేంద్రం మరింత బలోపేతం చేసింది.

బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్​ (ఎన్​సీపీసీఆర్​) దేశవ్యాప్తంగా ఉన్న పిల్లల షెల్టర్ హోమ్స్​లో సర్వే నిర్వహించిన తర్వాత ఈ బిల్లుకు సవణరలు ప్రతిపాదించినట్టు ప్రభుత్వ అధికారులు చెప్పారు. అలాగే షెల్టర్ హోమ్స్​లో 7,600 మంది పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు గుర్తించినట్టు వెల్లడించారు.

“నివేదికల కోసం అన్ని షెల్టర్ హోమ్​లకు ఆదేశాలు ఇచ్చాం. 2వేల రిప్లేలు వచ్చాయి. చాలా హోమ్స్​లో కనీస సదుపాయాలు లేవు. సరైన ఆహారం, తాగునీరు కూడా పిల్లలకు సరిగా అందుబాటులో లేదు. ముఖ్యంగా దత్తత ప్రక్రియలో ఆలస్యం జరుగుతుండడంతో చాలా మంది పిల్లలు ఎక్కువ కాలం షెల్టర్​ హోమ్స్​లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే దత్తతపై తుది ఆర్డర్లు న్యాయమూర్తి నుంచి రావాల్సిఉంది. కాగా వారిపైనే ఎక్కువ పని భారం ఉండడంతో ఆలస్యమవుతోంది. అయితే ఈ బాధ్యతను డిస్ట్రిక్​ మెజిస్ట్రేట్​, అడిషనల్ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్​కు బదిలీ చేయడం వల్ల దత్తత ప్రక్రియ సులభతరమై, తక్కువ కాలంలోనే ప్రాసెస్​ పూర్తవుతుంది. ఇది పిల్లలకు ఎంతో ఉపకరిస్తుంది. వారి హక్కులను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు కూడా చేపట్టాం” అని ఎన్​సీపీసీఆప్ చైర్​పర్సన్​ ప్రియాంక్​ కనూన్​గో చెప్పారు.

దత్తత ప్రక్రియ నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా కొత్త సవరణ ఉపకరిస్తుందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ బిల్లు ఆమోదం సందర్భంగా పార్లమెంట్​లో చెప్పారు. దత్తత ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు మరింత పటిష్టంగా చట్టం రూపొందిందని అభిప్రాయపడ్డారు.

జువైనల్ జస్టిస్​ (కేస్ అండ్​ ప్రొటెక్షన్ ఆఫ్​ చైల్డ్ ) సవరణ చట్టానికి సంబంధించిన సవరణ బిల్లు గత ఏడాది మార్చిలోనే లోక్​సభలో ఆమోదం పొందింది. అయితే మళ్లీ ఇప్పుడు పార్లమెంటు ప్రారంభం కావడంతో ఎగువ సభలో ఆమోదముద్ర పడి.. చట్టానికి సవరణలు పూర్తయ్యాయి. దీంతో దత్తత ఆర్డర్​పై సివిల్ కోర్టు న్యాయమూర్తికి బదులుగా డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ సంతకం చేసే వెసులుబాటు వచ్చింది.

ప్రస్తుతం కరోనా తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన చిన్నారులకు ఇది ఒక వరంగా చెప్పవచ్చు. కొంచెం స్థితిమంతులైన వారు పిల్లలను దత్తత తీసుకోవడానికి ఎక్కువ రోజులు, ఎక్కువ సార్లు తిరిగే పని లేకుండా సులువుగా దత్తత తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. దీని వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
Published by:Kishore Akkaladevi
First published: