• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • INDIAN GOVERNMENT GIVEN PERMISSION TO USE FOREIGN MANUFACTURED VACCINES IN THE COUNTRY HERE FULL DETAILS NS GH

Corona Vaccine: వ్యాక్సినేషన్ పై భారతీయులకు మరో గుడ్ న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం

Corona Vaccine: వ్యాక్సినేషన్ పై భారతీయులకు మరో గుడ్ న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో కరోనా వ్యాప్తి అధికమవుతుండడం, మరో వైపు వ్యాక్సిన్ కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, జపాన్ దేశాల ఆరోగ్య విభాగాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు పొందిన అన్ని రకాల కోవిడ్ వ్యాక్సిన్లకు భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేసింది.

  • Share this:
భారత్‌లో కరోనా వ్యాప్తి, వ్యాధి తీవ్రత ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాల్లో వినియోగిస్తున్న విదేశీ వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు మంజూరు చేయాలని నిర్ణయించింది. కోవిడ్ వ్యాప్తిని వ్యాక్సినేషన్ ద్వారానే నియంత్రించగలమని ప్రభుత్వం ముందు నుంచి చెబుతోంది. కానీ ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్లకు కొరత ఏర్పడింది. మరికొన్ని రోజుల్లో నిల్వలు అడుగంటే ప్రమాదం ఉంది. దీంతో ఈ పరిస్థితి తలెత్తకుండా అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, జపాన్ దేశాల ఆరోగ్య విభాగాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు పొందిన అన్ని రకాల కోవిడ్ వ్యాక్సిన్లకు భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేశారు. భారతదేశంలో రెండు, మూడో దశల్లో క్లినికల్ ట్రయల్స్ చేపట్టిన తరువాతే విదేశీ టీకాలను వాడాలనే నిబంధనను కేంద్రం తాజాగా రద్దుచేసింది.




దేశంలో రెండో దశ కోవిడ్-19 విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య ఎప్పటికప్పుడూ పెరుగుతోంది. మహారాష్ట్రలో రెండు వారాల పాటు లాక్‌డౌన్ విధించారు. పరిస్థితులు ఇంకా దిగజారే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేసిన కొద్దిసేపటికే మంగళవారం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం దేశ ప్రజలకు కోవిషీల్డ్, కోవాక్సిన్ సహా స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు.

నిబంధనల సడలింపు
సాధారణంగా విదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థలు మన దేశంలో రెండు, మూడు దశల క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను సమర్పించిన తరువాతే.. వాటికి అత్యవసర అనుమతులు మంజూరు చేయాలి. న్యూ డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్స్- 2019లో దీనికి సంబంధించిన నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ ఈ ట్రయల్స్ విషయంలో కఠినమైన నిబంధనలు ఉండవు. ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ట్రయల్స్ నిర్వహించి, సామర్థ్యాన్ని నిరూపించుకున్నందువల్ల 1,000 మందిపై ట్రయల్స్ నిర్వహిస్తే సరిపోతుంది.

కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌కు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇలాగే బ్రిడ్జింగ్ ట్రయల్స్ నిర్వహించాయి. ఆ తరువాత వీటికి అత్యవసర అనుమతులు మంజూరయ్యాయి. కానీ వేరే దేశానికి చెందిన జాతీయ నియంత్రణ సంస్థలు ఆమోదించిన వ్యాక్సిన్లకు ఫాస్ట్ ట్రాక్ అనుమతులు మంజూరు చేయాలనే ఉద్దేశంతో ట్రయల్స్ నిబంధనలను కేంద్రం సడలించింది.

పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ ఎప్పుడు?
విదేశీ వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు భారత్‌లో పూర్తి స్థాయి అనుమతులు ఇవ్వడానికి మరొక ప్రత్యేక నిబంధన ఉంది. వాటి సమర్థతను అంచనా వేయడానికి దేశంలో విదేశీ వ్యాక్సిన్లు తీసుకున్న మొదటి 100 మంది లబ్ధిదారులను కొన్ని రోజుల పాటు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. వారిపై టీకా ఎలాంటి దుష్ప్రభావం చూపలేదని నిర్ధారించుకున్న తరువాతే పూర్తి స్థాయి వ్యాక్సినేషన్‌కు అనుమతిస్తారు. అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. విదేశీ వ్యాక్సిన్ల బ్రిడ్జింగ్ ట్రయల్స్ సమాంతరంగా కొనసాగించాల్సి ఉంటుంది.

విదేశీ కంపెనీలకు మార్గం సులభం
కేంద్రం తాజా నిర్ణయంతో జాన్సన్ అండ్ జాన్సన్, నోవావాక్స్, ఫైజర్ వంటి విదేశీ వ్యాక్సిన్లు భారత్‌లో అడుగుపెట్టేందుకు మార్గం సలభం అయింది. ఈ సంస్థలకు భారత కంపెనీలతో ఒప్పందం ఉంది. కానీ మోడెర్నా ఇంకా ఇండియన్ కంపెనీలతో ఒప్పందం చేసుకోలేదు. గతంలో ఫైజర్ కూడా భారత్‌లో అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకుంది. అయితే క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ సంస్థ దరఖాస్తును వెనక్కు తీసుకోవడం విశేషం.


Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు