ఆదివారం ఇండియాలో జరగబోతున్న కార్యక్రమం మామూలుది కాదు. ఆ రోజు కొత్త పార్లమెంట్ భవనాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తోంది. అంతేకాదు.. అదే రోజు రాజదండాన్ని కూడా లోక్‌సభలో ప్రతిష్టించబోతోంది. అంతేకాదు.. అదే రోజు 75 రూపాయల కొత్త నాణేన్ని కూడా ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. గురువారం ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ఈ విషయాన్ని తెలిపింది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తున్నారు.
ఈ కొత్త నాణేనికి ఓవైపు.. మూడు సింహాల చిహ్నం, మధ్యలో అశోక స్తంభం దాని కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. అలాగే ఎడమ అంచువైపున దేవనాగరి లిపిలో భారత్ అనీ, కుడి అంచువైపున ఇంగ్లీష్‌లో ఇండియా అని రాసి ఉంటుంది. ఇంకా ఈ నాణెంపై రూపీ సింబల్, డినామినేషన్ వాల్యూగా 75 సంఖ్య.. సింహాల సింబల్ కింద ఉంటుంది.
ఈ నాణేనికి మరోవైపు కొత్త పార్లమెంట్ భవనం ముద్ర ఉంటుంది. ఆ ముద్ర పైన సంసద్ సంకుల్ అని దేవనాగరి లిపిలో పైన రాసి ఉంటుంది. అలాగే పార్లమెంట్ కాంప్లెక్స్ అని కింద రాసి ఉంటుంది. ఇంకా పార్లమెంట్ భవనం ముద్ర కింద 2023 అని రాసి ఉంటుందని నోటిఫికేషన్ తెలిపింది.
ఈ కొత్త నాణెం బరువు 35 గ్రాములు ఉంటుంది. ఇది 44 మిల్లీమీటర్ల వ్యాసార్థం కలిగివుంది. అలాగే... ఈ నాణేనికి 200 రంపపు కోతలు (serrations) ఉంటాయి. ఈ లోహ నాణెంలో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.